Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి అంతం ఎప్పుడు?

By:  Tupaki Desk   |   31 May 2022 2:30 AM GMT
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి అంతం ఎప్పుడు?
X
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా సాగుతున్న ఈ భీకర పోరుతో ఎందరో సైనికులు, పౌరులు వీరమరణం పొందారు. యుద్ధ వాతావరణాన్ని తట్టుకోలేక చాలా మంది ఉక్రెయిన్ వాసులు ఇతర దేశాలకు తరలిపోయారు. చర్చలు జరుపుతున్నా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో నష్టం భారీగానే ఉంటోంది. ఉక్రెయిన్ మొత్తం కకావికలం అయిపోయింది. దీంతో పలు నగరాలు దెబ్బతిన్నాయి. కోలుకోలేని విధంగా మారాయి. బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. రష్యా సేనల ధాటికి నివ్వెరపోతున్నాయి. యుద్ధ కాంక్షతో రష్యా చేస్తున్న దమనకాండతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది దేశం విడిచి పారిపోయారు. రష్యా సేనలను ఉక్రెయిన్ కూడా ధీటుగానే ఎదుర్కొంటోంది. రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌకలను నాశనం చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ తీర ప్రాంతాలకు చేరుకున్న రష్యాకు చెందిన నౌకలను పాశ్చాత్య దేశాల బాంబులతో ఉక్రెయిన్ ముంచేస్తోంది. దీంతో రష్యాకు భారీగానే నష్టం వాటిల్లుతోంది.

ఉక్రెయిన్ లోని మహిళలు, చిన్నారులనూ రష్యా సైనికులు వదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రష్యా సైనికులపై దాదాపు 400 కు పైగా అత్యాచార కేసులు నమోదైనట్టు ఉక్రెయిన్ అంబుడ్స్ మెన్ లియుడ్ మైలా డెనిసోవా వెల్లడించారు. లైంగిక హింసకు సంబంధించి నివేదించేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేయగా.. ఏప్రిల్ నెలలో తమ కార్యాలయానికి దాదాపు 400కు పైగా లైంగిక హింసకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని ఆమె తెలిపారు. బాధితుల్లో ఉక్రెయిన్ చిన్నారులు కూడా ఉన్నట్టు ఆ దేశం ఆరోపిస్తోంది.ష్యా సేనలు తల్లులపై సామూహిక అత్యాచారం, పసిపాపలపై లైంగిక దాడులు అందరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పుతిన్ సేనల తీరు వివాదాస్పదమవుతోంది. మనుషులను హింసించమనే నినాదంతో వచ్చిన రష్యా సేనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఉక్రెయిన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పలు స్వచ్ఛంధ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఫిబ్రవరి 24న మొదలైన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నానాటికి పెరుగుతోంది.యుద్ధంలో 24200 మందికి పైగా రష్యా తన సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ రష్యా 1300 క్షిపణులను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ డిప్యూటీ రక్షణ మంత్రి అన్నా మలయార్ తెలిపారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో క్షిపణులు నిల్వలు సగానికి పడిపోయాయన్నారు. ఇక రష్యా యుద్ధంలో 217మంది చిన్నారులు మృతి చెందగా.. ఇప్పటివరకూ 610 మందికి పైగా గాయపడినట్లు ఉక్రెయిన్ తెలిపింది.

యుద్ధం మరింతకాలం కొనసాగించేందుకు రష్యా సన్నాహాలు చేసుకుంటోంది. సైన్యం వయోపరిమితి గడువును పెంచింది. యుద్ధం సహాయక చర్యల్లో పాల్గొనే వారిని భారీగా నియమించుకుంటోంది. గతంలో రష్యా సైన్యంలో వయోపరిమితి 18-40 ఏళ్ల మధ్య ఉండగా.. ఇప్పుడు 45 ఏళ్లకు పెంచింది. యుద్ధంలో రష్యా బలగాలకు భారీగా ప్రాణనష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఊరటనిస్తోంది. కొన్ని రోజుల క్రితం బాంబులు, క్షిపణులతో దద్దరిల్లిన కీవ్ పై ఇప్పుడు రష్యా వెనక్కి తగ్గింది. శివారు నగరాలు, ప్రాంతాలనుంచి యుద్ధం చేస్తోంది. కీవ్ ను వదిలేసింది. శిథిలాల మధ్య కీవ్ ఆవిర్భావానికి గుర్తుగా ఆదివారం ‘కీవ్ డే’ జరిపారు. యుద్ధం మిగిల్చిన విషాదాలను తలుచుకుంటూ కీవ్ ప్రజలు నగరంలో ఒక్కచోట చేరి స్మరించుకున్నారు.