Begin typing your search above and press return to search.

కొండా దంప‌తులు ఎక్క‌డ ఉన్నారు... ఏం చేస్తున్నారు..?

By:  Tupaki Desk   |   14 Nov 2019 1:30 AM GMT
కొండా దంప‌తులు ఎక్క‌డ ఉన్నారు... ఏం చేస్తున్నారు..?
X
కొండా దంప‌తులు..ఒక‌ప్పుడు తిరుగులేని నేత‌లు.. వారు చెప్పిందే వేదం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల‌ను ఒక ద‌శ‌లో శాసించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే త‌మ‌దైన శైలి రాజ‌కీయాల‌తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. పార్టీల‌తో సంబంధం లేకుండా.. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే వారు ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించే స్థాయి వారి సొంతం. ఇదంతా గ‌తం..ప్ర‌స్తుతం కొండా దంప‌తులు ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు..? ఎక్క‌డ ఉన్నారు..? అనే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య జ‌నంలోనూ ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. కొండా సురేఖ‌, కొండా ముర‌ళీ రాజ‌కీయ జీవితంలో అనేక మ‌లుపు ఉన్నాయి. ఊహించ‌ని ఘ‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలో వారు రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కొండా దంప‌తుల రాజ‌కీయ జీవితం వైసీపీలో చేరిన త‌ర్వాత అనేక మలుపుల‌కు గురైంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు కొండా దంప‌తులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌వ‌క‌ర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు కంచుకోట‌గా ఉన్న ప‌ర‌కాల‌ను త్యాగం చేసిన సురేఖ తూర్పులో ఏకంగా 55 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. ఇక కొండా ముర‌ళీ ఎమ్మెల్సీ అయ్యారు. ఆ త‌ర్వాత కొండా దంప‌తుల దూకుడు... కేసీఆర్‌కు ఫిర్యాదుల నేప‌థ్యంలో వాళ్ల‌ను పార్టీలోనే రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కారు.

కానీ.. 2018లో జ‌రిగిన ముందస్తు ఎన్నిక‌ల‌కు ముందు ఊహించ‌ని ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.
అభ్య‌ర్థుల తొలి జాబితాలో కొండా సురేఖ పేరును కేసీఆర్ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన కొండా దంప‌తులు కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డి పార్టీని వీడారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ప‌ర‌కాల ఎమ్మెల్యేగా కొండా సురేఖ పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత కొండా ముర‌ళి ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా పోయింది. ఇక అప్ప‌టి నుంచి కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు.

ఈ క్ర‌మంలో వారు బీజేపీలోకి వెళ్తార‌నే టాక్ కూడా బ‌లంగా వినిపిస్తోంది. కానీ, ఈ ప్ర‌చారంపై వారు స్పందించ‌డం లేదు. రాజ‌కీయంగా వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తినిరేపుతోంది. అయితే.. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో మాత్రం కొండా దంప‌తుల అనుచ‌రులు చురుగ్గానే పాల్గొన్నారు. దీంతో కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతార‌నే టాక్ మొద‌లైంది. ఇప్ప‌టికిప్పుడు వారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోర‌ని, మ‌రికొంత‌కాలం సైలెంట్‌గానే ఉం టార‌ని, ఆ త‌ర్వాతే వారి విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌నే టాక్ వినిపిస్తోంది.