Begin typing your search above and press return to search.

వైసీపీకి ఎక్కడ చెడుతోంది?

By:  Tupaki Desk   |   3 Aug 2022 8:20 AM GMT
వైసీపీకి ఎక్కడ చెడుతోంది?
X
ఇప్ప‌టిదాకా సంక్షేమానికే కోట్లు ఖ‌ర్చు చేస్తున్న ప్ర‌భుత్వానికి ఊహించినంత ఆదరణ రాకపోవడంపై అధికార పార్టీ పెద్దలు చింతిస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది అని వారు అనుకుంటున్నారు. అయితే... దీనికి కారణం ఇదీ అని ఏ ఒక్క దాన్నో చెప్పే పరిస్థితి లేదు. సమాధానాలు వెతుకుంటే పెద్ద లిస్టే తయారవుతోంది.

ముఖ్యంగా రోడ్లు... జనానికి నరకం చూపిస్తున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగతంగా మేలు చేస్తే ప్రజలు వాటిని పట్టించుకోరు అనే భ్రమలో ఉన్నారు. ఎక్క‌డా రోడ్ల‌న్న‌వి అస్స‌లు బాలేవ‌ని వీలున్నంత వ‌ర‌కూ కొత్త‌వాటిని వేయాల‌ని విప‌క్షం నెత్తీ నోరూ కొట్టుకుంటోంది. విపక్షమే కాదు సొంత పార్టీ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన, టీడీపీ కూడా అస్త‌వ్య‌స్త రోడ్ల‌పై ఎన్నో సార్లు నిరసనలు తెలిపాయి. అవి జనాల్లోకి బాగా వెళ్లాయి.

తాజాగా ఇవాళ చిరు వ్యాపారుల‌కు ఊతం ఇస్తామంటూ, వారికి వ‌డ్డీ లేని రుణాలు ఇస్తామంటూ జ‌గ‌న‌న్న తోడును అమ‌లు చేస్తున్నారు. ఇందుకు దాదాపు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చిస్తున్నారు. మొన్న కాపు నేస్తంకు ఐదు వంద‌ల ఎనిమిది కోట్ల రూపాయ‌లు ఇచ్చారు. ఇంకా చేనేత సాయం, ఆటో వాలా సాయం... వంటివి ఉన్నాయి. ఇవ‌న్నీ బాగానే ఉన్నా ఇదే స‌మ‌యంలో ప‌న్నుల బాదుడు విప‌రీతంగా ఉండటంతో ఇచ్చిన దానికంటే తీసుకుంటున్నది ఎక్కువన్న అభిప్రాయంలో ప్రజలున్నారు అంటున్నాయి ప్రతిపక్షాలు.

ముఖ్యంగా చెత్త ప‌న్నుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో భారీ విమ‌ర్శ‌లున్నాయి. చెత్త ప‌న్ను వ‌సూలు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ద్దేవ‌ద్ద‌ని కొడాలి నాని మొన్న‌టి వేళ గుడివాడ‌లో తేల్చేశారు. ప‌న్ను వ‌సూలులో రాష్ట్రంలోనే టాప్ పొజిష‌న్ లో ఉన్న గుడివాడ మున్సిపాల్టీకి సంబంధించి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. ఇదేవిధంగా మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌న్ను ర‌ద్దు కు సంబంధించి నిర‌స‌న‌లు రేగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అదేవిధంగా ఆస్తి ప‌న్ను, విద్యుత్ ఛార్జీల పెంపు, బ‌స్ ఛార్జీల పెంపు కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు ప్ర‌బ‌ల కార‌ణం కావొచ్చు.పెట్రో, డీజిల్ రేట్లు త‌మ ప‌రిధిలోనివి కావ‌ని త‌ప్పుకునేందుకు వీల్లేద‌ని, రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న ప‌న్నుల వాటాను త‌గ్గించుకుంటే చాలు ధ‌ర‌లు వాటంత‌ట అవే దిగివ‌స్తాయి అన్న అవగాహన ప్రజలకు వచ్చేసింది. దీంతో ఊరికే కేంద్రం మీద వేసినా జనం వినడం లేదు.

ముఖ్యంగా ఏపీ నుంచి జీఎస్టీ వ‌సూళ్లు బాగున్నాయి. ఆ మేర‌కు అభివృద్ధి లేదు. ఏపీలో ప‌న్నుల వ‌సూళ్లకు అభివృద్ధికి పొంతన లేదు. ఇవ‌న్నీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌లను పెంచే వీలున్న‌వే ! వీటితో పాటు కొన్ని నిర్ణ‌యాల కార‌ణంగా ప్ర‌భుత్వం కొన్నిసార్లు దిద్దుకోలేని త‌ప్పులు చేస్తోంది. అలాంటి వాటిలో స్కూళ్ల విలీనం ఒకటి.

రైతుల విషయానికి వస్తే నాలా వసూళ్ల విషయ‌మై ఆరు శాతం వ‌డ్డీతో క‌లిపి రైతుల నుంచి ముక్కు పిండి మ‌రీ ! లాక్కున్నారు. అయినా పంట కాలువలు ఏమ‌యినా బాగుప‌డ్డాయా అంటే అదీ లేదు. చాలా చోట్ల గుర్ర‌పు డెక్క తొలిగించేందుకు కూడా ఉపాధి ప‌నుల్లో భాగంగా సంబంధిత చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు కూడా సర్కారు ముందుకు రాక‌పోవ‌డంతో వేల ఎక‌రాలు ఈ ఖ‌రీఫ్ కు సాగు యోగ్య‌త‌ను పొంద‌లేక‌పోయాయి అన్న‌ది ఓ వాస్త‌వం. ఇది పైదాకా చేరలేదు.

ఇక ఆటోవాలాల‌కు ఇచ్చిన వాహ‌న మిత్ర డ‌బ్బులు కూడా ఏ మేర‌కు వారికి ఉప‌యోగ‌ప‌డ‌డం లేద‌ని ఓ విమ‌ర్శ వస్తోంది. ఆటోకు సంబంధించి పేప‌ర్ వ‌ర్క్ పేరిట ఆర్టీఓ కార్యాల‌యంలోనూ., ఇంకా ఇత‌ర ఖ‌ర్చుల నిమిత్తం ఏడాదికి తొమ్మిది వేలు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంద‌ని, అలాంట‌ప్పుడు వాహ‌న మిత్ర ఇచ్చి ఏం లాభం అన్న వాద‌న వినిపిస్తోంది. ఓ వైపు డీజిల్, పె ట్రోల్ ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోగా మ‌రోవైపు వివిధ అనుమ‌తులు, నియ‌మ నిబంధ‌న‌ల పేరిట త‌మ నుంచి ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఆటోవాలాల నుంచి వినిపిస్తున్నాయి.

ఏ విధంగా చూసినా ప‌న్నుల వ‌సూళ్ల‌కు ఇస్తున్న ప్రాధాన్యం కూడా కొన్నింటే బాగుంది. కొన్నింట అధికారుల ప‌ట్టింపే లేదు. దీంతో ఉద్దేశ పూర్వ‌క ఎగ‌వేత‌దారులూ పెరిగిపోతున్నారు. క‌ట్టే స్థోమత ఉన్న‌వారు కూడా ఎగ్గొట్టేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌రోవైపు డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి లాంటి వారు కూడా స్థానిక వ్య‌తిరేక‌త‌లు దాటి ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నారు. ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం మ‌నుషులే బాప‌ట్ల‌లో తిరుగుబాటు చేస్తున్నారు. ఏ విధంగా చూసినా ఎమ్మెల్యేలు యాక్టివ్ అయినా కూడా ఇంత కాలం నిధులే లేని కార‌ణంగా త‌ప్పుకున్నారు.

కొంతవరకు వాస్తవం అర్థం కావడంతో ఇప్పుడు స‌చివాల‌య ప‌రిధిలో ఒక్కొక్క దానికీ ఇర‌వై ల‌క్ష‌లు ఇచ్చారు సీఎం జగన్. అదేవిధంగా నియోజ‌క‌వర్గ అభివృద్ధి నిధుల పేరిట రెండు కోట్లు ఇచ్చారు ఎమ్మెల్యేల‌కు. అయితే వీటిని కూడా ఖర్చు చేయకుండా ఎమ్మెల్యేలు మీన‌మేషాలు లెక్కిస్తున్నారట. దీంతో జ‌గ‌న్ పై ఓ విమ‌ర్శను గట్టిగా విసురుతోంది ప్రతిపక్షం. అదేంటంటే.. ఇష్టారాజ్యంగా ప‌న్నులు పెంచి, ప‌థ‌కాల పేరిట డ‌బ్బులు పంచి, కుడిచేత్తో ఇచ్చిన దానిని ఎడ‌మ చేత్తో లాక్కుంటున్నార‌న్న అభియోగం జగన్ పై మోపుతోంది.

ఇలాంటి అనేక విషయాలు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు కార‌ణమని... పార్టీ కేడర్ చెబుతోంది. క‌నుక కొంప‌లు ముంచే ప‌న్నులు వ‌ద్ద‌ంటే వద్దంటున్నాయి పార్టీ వర్గాలు. సొంత పార్టీ మ‌నుషులు సైతం సీఎం జ‌గ‌న్-కు ఈ కోణంలో హిత‌వు చెబుతూనే ఉన్నారట.