Begin typing your search above and press return to search.

రైతుల కష్టాలు తెలుసుకున్న మాజీ జేడీ ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   12 Jan 2020 1:30 AM GMT
రైతుల కష్టాలు తెలుసుకున్న మాజీ జేడీ ఇప్పుడెక్కడ?
X
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మొన్నటి ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తృతంగా తిరిగి ప్రధానంగా రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అయితే, ఇప్పుడు రాజధాని అమరావతిలో రైతులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆయన మాత్రం వారి తరఫునా ఎక్కడా కనిపించడంలేదు. అంతేకాదు... ఆయన ప్రస్తుతం ఉండీలేనట్లుగా ఉన్న ఆయన పార్టీ జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. దీంతో లక్ష్మీనారాయణ వైఖరి ఏమిటి? ఆయన మౌనానికి అర్థమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

లక్ష్మీనారాయణ ఎన్నికల తరువాత జనసేన కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. అయితే, ఆ విషయం చర్చకు రావడంతో మధ్యలో ఓసారి ఇలా కనిపించి అలా మాయమైపోయారు. పవన్ కల్యాణ్‌తో అభిప్రాయభేదాలు సమసిపోయాయని.. తాను జనసేనలోనే ఉన్నాననీ చెప్పారు. కానీ, ఆ తరువాత మళ్లీ కనిపించడం మానేశారు.

జనసేనలో లక్ష్మీనారయణ కనిపించకపోవడం వెనుక భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందని కొందరంటుంటే, ఆయనే పార్టీకి దూరం జరుగుతున్నారని మరికొందరు చెబుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అదే విశాఖను పాలనా రాజధానిని చేస్తామని వైసీపీ చెబుతోంది. దీంతో అమరావతిలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిస్థితుల్లో అటు అమరావతి రైతులకు మద్దతివ్వలేక.. ఇటు తన రాజకీయ కార్యక్షేత్రం విశాఖకు దక్కుతున్న ప్రాధాన్యాన్ని వ్యతిరేకించలేక ఆయన మౌనం దాల్చినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు జనసేనలో నాదెండ్ల మనోహర్ అంతా తానే అయి కనిపిస్తున్నారు. నాదెండ్లకు అధిక ప్రాధాన్యం దక్కుతుండడంతో ఇప్పటికే ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీకి దూరంగా ఉంటుండగా ఇప్పుడు లక్ష్మీనారయణ అసంతృప్తి వెనుకా నాదెండ్ల ఫ్యాక్టరే ఉందని తెలుస్తోంది.

అయితే, ఇటీవల లక్ష్మీనారాయణ...పాలనా వికేంద్రీకరణ కంటే అభివృద్ది వికేంద్రీకరణే ముఖ్యమని చెప్పి పార్టీ లైన్లోనే మాట్లాడారు. కానీ.. రాజధాని ప్రాంత రైతులు అన్యాయమైపోతున్నారన్న భావనా ఆయనకు ఉందని చెబుతున్నారు. ఈ సందిగ్థంలోనే ఆయన మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.