Begin typing your search above and press return to search.

బిగ్ క్వశ్చన్: ఇప్పుడు ఆర్కే ఎక్కడున్నారు..?

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:38 AM GMT
బిగ్ క్వశ్చన్: ఇప్పుడు ఆర్కే ఎక్కడున్నారు..?
X
ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా మావోలపై దెబ్బ పడిన వైనం తెలిసిందే. ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోలు మరణించటం ఒక ఎత్తు అయితే.. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే ఉనికి ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిన పరిస్థితి. ఎన్ కౌంటర్ జరిగి మూడోరోజు అవుతున్నా.. ఆయన పార్టీ కాంటాక్ట్ లోకి వెళ్లకపోవటం ఇప్పుడు పలు సందేహాల్ని వ్యక్తం చేసేలా చేస్తోంది. ఇంతకీ ఆర్కే ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ఆర్కేకు గాయాలు అయినట్లుగా సమాచారం బయటకు రావటం ఒకటైతే.. తాజా ఎన్ కౌంటర్లో ఆర్కే పోలీసులకు చిక్కినట్లుగా కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్ కౌంటర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు పలు సందేహాలు కలిగేలా ఉండటం గమనార్హం.

ఆర్కే పోలీసుల చేతిలో బందీగా ఉన్నట్లుగా పౌరహక్కుల నేత హరగోపాల్ లాంటి వారు చెబుతుండటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రా.. ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో నిర్వహించిన మావో ప్లీనరీకి ఆర్కే హాజరయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక.. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కేను పోలీసులు టార్గెట్ చేయగా.. ఆయన గన్ మెన్లు ఆయన్ను తప్పించినట్లుగా సమాచారం బయటకు వచ్చింది.

ఆర్కేను సేఫ్ గా తరలించే ప్రయత్నంలో ఆయన ముగ్గురు గన్ మెన్లు సైతం మరణించారని పోలీసు వర్గాలు చెప్పటం చూసినప్పుడు.. వారికీ సమాచారం ఎలా తెలిసిందన్నది ఒక ప్రశ్న. ఇదిలా ఉండగా.. పోలీసుల వద్ద ఒక వ్యక్తి సజీవంగా ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమైన పక్షంలో ఆయన ఆర్కేనే అయి ఉంటారని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంత భారీగా ఏవోబీలో కూంబింగ్ సాగుతున్న నేపథ్యంలో.. ఆర్కే తప్పించుకోవటం సాధ్యం కాదంటూ పోలీసు వర్గాలు చేస్తున్న అనధికార వ్యాఖ్యలు చూస్తే.. ఆర్కే ప్రమాదంలో ఉన్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. ఆర్కే సతీమణి చేసిన సంచలన వ్యాఖ్య ఇప్పుడు కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆర్కే మరణించినా.. ఉద్యమం ఆగదని ఆయన సతీమణి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. ఆయనకు ఏమైందన్న అంశంపై ఆమెకు ఎంతోకొంత సమాచారం అంది ఉండి ఉంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆర్కేకు సంబంధించిన కన్ఫ్యూజన్ ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. పలువురి అభిప్రాయాన్ని వింటున్న వేళ.. ఆర్కే ప్రమాదంలో ఉన్న విషయంపై అందరూ అనుమానాలు వ్యక్తం చేయటంతో.. మావో సానుభూతిపరుల్లో ఆర్కే మిస్టరీ కలకలం రేపుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/