Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లేకుంటే మీరెక్కడ మోడీ? ఈ విషయాన్ని ఎలా మరుస్తారు?

By:  Tupaki Desk   |   9 Feb 2022 6:30 AM GMT
కాంగ్రెస్ లేకుంటే మీరెక్కడ మోడీ? ఈ విషయాన్ని ఎలా మరుస్తారు?
X
ఎప్పుడేం మాట్లాడాలో అది మాట్లాడితేనే బాగుంటుంది. అందుకు భిన్నంగా ఎజెండా పెట్టుకొని ప్రసంగాలు చేయటం.. అది కూడా రాజ్యసభలో.. ప్రధానమంత్రి హోదాలో ఉన్న ప్రముఖుడు అంటే ఇంకేం చెప్పాలి. తాజాగా కాంగ్రెస్ పార్టీని దారుణమైన విలన్ గా అభివర్ణిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైనది? మరెంత దుర్మార్గమైనది? ఆ పార్టీ కారణంగానే దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్న తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు? అన్నది ప్రశ్న.

దీనికి సమాధానం సింఫుల్ గా చెప్పేయొచ్చు. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా మోడీనోటి నుంచి వచ్చే మాటలు మారిపోవటమే కాదు.. కాంగ్రెస్ దేశానికి ఎంత నష్టం చేసిందన్న విషయాన్ని ఆయన అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి కాంగ్రెస్ నష్టమే చేసిందనే అనుకుందాం మోడీ చెప్పినట్లు. కానీ.. అందుకు తమ పార్టీ కూడా సాయం చేసిందన్న వైనాన్ని అస్సలు మర్చిపోకూడదు.

ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ తప్పులే చేయకుంటే ఈ రోజున దేశానికి మోడీ అవసరం ఎందుకు వచ్చేది? ఆయన ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్ తప్పు చేసిందని దేశ ప్రజలు డిసైడ్ చేసి.. ఆ పార్టీని కాదని మోడీ సర్కారు చేతికి అధికారం ఇచ్చిన తర్వాత.. ఇప్పుడు పోస్టు మార్టం దేనికి? దేశంలో జరిగిన దారుణాలకు కాంగ్రెస్ పార్టీని బాధ్యుల్ని చేసే కన్నా.. అలాంటి పరిస్థితి అసలెందుకు వచ్చిందన్న విషయాన్ని వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే మోడీ విశ్లేషిస్తే బాగుండేది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాంనబీ అజాద్ కు మొన్నటికి మొన్న పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చిన మోడీ ప్రభుత్వం చెప్పిందేమిటి? కాంగ్రెస్ పార్టీ చెడ్డది కాదు.. దాన్ని నడిపించిన కొందరు వ్యక్తులు మాత్రమే అనేగా? అలాంటప్పుడు పార్టీ మీద ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన తప్పులే.. వారికి ప్రత్యామ్నాయం కోసం దేశం వెతికే ప్రయత్నం చేయటం.. మోడీ చేతికి పగ్గాలు ఇవ్వటం చేసిందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తాను రెండు దఫాలు ప్రధాన మంత్రిని అయ్యానంటే అందుకు కారణమైన కాంగ్రెస్ కు మోడీ మాష్టారు ధన్యవాదాలు చెప్పాలి కదా? ఆ చిన్న లాజిక్ ను మర్చిపోయి.. కాంగ్రెస్ మీద అంతలా విరుచుకుపడటం ఏమాత్రం న్యాయం? కాంగ్రెస్ పార్టీ లేకున్నా.. ఆ పార్టీకి చెందిననేతలు పలువురు తప్పులు చేయకుంటే.. ఇవాళ మోడీ ఇలా మాట్లాడే అవకాశం ఉండేది కాదు కదా?

అయినా.. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ గుణగణాలు.. మంచి చెడ్డలు అధికారం చేతికి వచ్చిన ఎనిమిదేళ్లకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చరిత్రను చెప్పటానికి.. చరిత్రలో జరిగిన తప్పుల్ని సరి చేసే అవకాశం.. అధికారం మోడీ చేతిలో ఉన్నప్పుడు.. దాన్ని మార్చకుండా మాటలకే పరిమితం కావటం ఏమిటి మోడీజీ?