Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ ఎక్క‌డ‌? ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   4 July 2022 1:45 PM GMT
ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ ఎక్క‌డ‌?  ఏం జ‌రిగింది?
X
బీజేపీ-ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల మ‌ధ్య బంధం ఈ రోజుది కాదు. 2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోయినా.. ప్రధానిగా బీజేపీ నాయ‌కుడు.. న‌రేంద్ర మోడీని గెలిపించేందుకు ప్ర‌చారం చేశారు. ఆ నాటి స‌భ‌ల్లో ప‌వ‌న్ విస్తృతంగా ప‌ర్య‌టించారు. బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థి మోడీ పాల్గొన్న ప్ర‌తి స‌భ‌లోనూ.. ప‌వ‌న్ క‌నిపించారు. ఇది ఆ నాటి ముచ్చ‌ట‌. కానీ, ఎనిమిదేళ్లు తిరిగేస‌రికి.. రాజ‌కీయాలు మారిపోయాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌ధాని హోదాలో మోడీ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసినా.. ప‌వ‌న్ ఊసు.. ధ్యాస ఎక్క‌డా క‌నిపించ‌లేదు.. వినిపించ‌లేదు.

మ‌రి ఏం జ‌రిగింది? ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌వ‌న్‌ను బీజేపీ ప‌క్క‌న పెట్టిందా? లేక‌.. ప‌వ‌నే బీజేపీకి దూరంగా ఉన్నారా? అనేది ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. 2019లో జ‌న‌సేన అధినేత‌గా ప‌వ‌న్, బీజేపీలు విడివిడి గానే పోటీ చేశాయి. అయితే.. త‌ర్వాత‌.. అనూహ్యంగా 2020లో ప‌వ‌న్‌ను ఆహ్వానించి.. మ‌రీ బీజేపీ పొత్తు పెట్టుకుంది. దీంతో అప్ప‌టి నుంచి జ‌న‌సేన‌, బీజేపీలు మిత్ర‌ప‌క్షంగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ నేత‌లు ఏపీలో ఎక్క‌డ మాట్లాడినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌లిసి పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. వేరే పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని.. త‌మ‌కు జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగానే ఉంద‌ని.. ఏపీ బీజేపీ సార‌థి సోము వీర్రాజు కూడా చెబుతున్నారు. ఇక‌, ప‌వ‌న్ కూడా.. రెండు మాసాల కింద‌ట నిర్వ‌హించిన జన‌సేన ఆవిర్భావ స‌భ‌లో బీజేపీతో తాను క‌లిసే ఉన్నాన‌ని చెప్పారు. అంతేకాదు.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీలిపోనివ్వ‌న‌ని.. దీనికి సంబంధించి బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం వేచి చూస్తున్నాన‌ని చెప్పారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని క‌లుపుకొని పోవాల‌నే వ్యూహంతోనే ప‌వ‌న్ ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇదిలావుంటే.. బీజేపీతో పొత్తు ప్రారంభించిన త‌ర్వాత‌.. మూడు సార్లు రాష్ట్రంలో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. తిరుపతి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో తన పార్టీ అభ్య‌ర్థిని రంగంలోకి దించుతాన‌న్నా.. బీజేపీ నేత‌లు ప‌ట్టుబ‌ట్టి.. త‌మ అభ్య‌ర్థినే నిల‌బెట్టిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ ఏమీ అన‌లేదు. పైగా.. బీజేపీ కోరిక మేర‌కు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇక‌, బ‌ద్వేల్‌, నెల్లూరు జిల్లాలోని ఆత్మ‌కూరుల్లో ఆయ‌న ప్ర‌చారానికి దూరంగా ఉంటాన‌ని చెప్పారు. మ‌రి ఇంత‌లా రాసుకుని పూసుకుని తిరుగుతున్న జ‌న‌సేన అధినేత‌ను బీజేపీ నేత‌లుప‌క్క‌న పెట్ట‌డం.. చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ‘గోదావరి గర్జన’ పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు కూడా పవన్‌కు ఆహ్వానం అందలేదు. దీనికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా హాజ‌ర‌య్యారు. ఆయ‌న కూడా ఎక్క‌డా ప‌వ‌న్ పేరును ప్ర‌స్తావించ‌లేదు. ఇప్పుడు తాజాగా తెలంగాణ‌లో నిర్వ‌హించిన మోడీ స‌భ‌లోనూ.. ఏపీలో నిర్వ‌హించిన అల్లూరి 125వ జ‌యంతి కార్య‌క్ర‌మంలోనూ.. ప‌వ‌న్‌కు ఆహ్వానం అంద‌లేదు. ఈ పరిణామాలు బీజేపీ, జనసేన మధ్య రాజకీయంగా దూరం పెరిగిందనే అనుమానాలకు తావిచ్చాయి.

తాజాగా.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పవన్‌కు ఆహ్వానం అందకపోవడం ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంగా గ్యాప్ మ‌రింత పెరిగిందనే వాదనకు బలం చేకూర్చింది. అయితే.. రాజకీయాలకు అతీతంగా అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, కార్య‌క్ర‌మాన్ని ఆసాంతం ప‌రిశీలిస్తే.. మోడీతోపాటు వేదికపై ఉన్న వారంతా బీజేపీ, వైసీపీ నేతలే కావడం గమనార్హం. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్‌ను బీజేపీనే ప‌క్క‌న పెడుతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.