Begin typing your search above and press return to search.

ఢిల్లీ రోడ్డు మీద పోలీసులతో రచ్చ చేసిన జంట ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   20 April 2021 1:07 AM GMT
ఢిల్లీ రోడ్డు మీద పోలీసులతో రచ్చ చేసిన జంట ఇప్పుడెక్కడ?
X
ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఢిల్లీలో కర్ఫ్యూ విధించిన వేళ.. సరైన కారణం లేకుండా ఒక జంట కార్లో షికారు చేయటం.. కారులోపల ఉన్నా.. మాస్కు పెట్టుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల్ని పాటించకుండా ఉండటంతో వారిని పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. తమను అనవసరంగా ఆపుతున్నారంటూ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించటంతో పాటు.. నాభర్తను ముద్దు పెట్టుకుంటా? మీరేం చేస్తారంటూ విరుచుకుపడిన వైనం షాకింగ్ గా మారింది.

నిబంధనల్ని పాటించకపోవటం ఒక తప్పు అయితే.. అడ్డగోలుగా వాదించే ధోరణిపై విమర్శలు వెల్లువెత్తాయి. వారి తప్పు ఎత్తి చూపిన పోలీసులపై వారు ప్రదర్శించిన ఆగ్రహం.. కేసులు పెడితే పెట్టమనంటూ వారు వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. ఈ వీడియో తర్వాత ఏమైంది? వారిప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వచ్చింది.

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి.. వారిపై మాటల దాడికి పాల్పడిన జంట ఢిల్లీకి చెందిన పంకజ్.. అభాగా గుర్తించారు. వారు ఢిల్లీలోని వెస్ట్ పటేల్ నగర్ ప్రాంతంలో నివసిస్తారని గుర్తించారు. రోడ్డు మీద రచ్చ చేసిన అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు మహిళా పోలీసుల్ని ప్రత్యేకంగా రప్పించి మరీ.. దయాగంజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

అక్కడ వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు.. చలానా విధించారు. విపత్తు వేళ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ముఖానికి మాస్కు పెట్టేందుకు ససేమిరా అన్న వీరు.. పోలీస్ స్టేషన్ లో కేసులునమోదైన తర్వాత ముఖానికి మాస్కులు పెట్టుకొని బయటకు వచ్చారు. పోలీసుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభా.. సివిల్స్ నుక్లియర్ చేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో.. తన స్థాయి కంటే మీ స్థాయి చాలా చిన్నదన్న మాట రావటం.. దానిపై విచారణలో ఆమె సివిల్స్ ను క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి బాధ్యత లేని వారు.. అధికారులుగా మారితే ఏమవుతుందన్న మాట వినిపిస్తోంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. అందుకు భిన్నగా విధినిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచితంగా వ్యవహరించిన వారు.. బద్నాం కావటమే కాదు.. ఇప్పుడు కేసుల్ని మోయాల్సిన దుస్థితి. కాస్త కూల్ గా ఉంటే.. ఇప్పుడు ఎదురవుతున్న తిప్పలన్ని తప్పేవి కదా?