Begin typing your search above and press return to search.

మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇప్పుడెక్కడ ఉన్నాడు?

By:  Tupaki Desk   |   10 April 2021 4:37 AM GMT
మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇప్పుడెక్కడ ఉన్నాడు?
X
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న మావోలు ఇచ్చిన షాక్ కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడుపడనిదిగా మారింది. ఛత్తీస్ గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వటమే కాదు.. ఉచ్చు విసిరి మరీ భారీ ప్రాణ నష్టాన్ని కలిగించటంలో మావోలు తాము అనుకున్నట్లే చేశారన్న వాదన వినిపిస్తోంది. త్రిశూల వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన మావోలు ఇప్పుడు ఎక్కడ? వారికి నాయకత్వం వహించిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఇప్పుడెక్కడ ఉన్నాడు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

బీజాపూర్ లోని తెర్రాం వద్ద జరిగిన కాల్పుల్లో మావోలు అతి తక్కువగా.. భద్రతా బలగాలకు భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్ హాసన్ ను కిడ్నాప్ చేయటం తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కిడ్నాప్ చేయటం.. ఆ తర్వాత సేఫ్ గా వదిలేయటం కూడా వ్యూహంలో భాగంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. కిడ్నాప్ జరిగిన వెంటనే ప్రభుత్వం మీద ఒత్తిడి పడటం.. కూంబింగ్ కంటే జవాను ప్రాణాల్ని రక్షించేందుకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. ఆ సమయంలో తామంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవాలన్న ఆలోచనలో మావోలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

అనుకున్నట్లే భద్రతా బలగాల మీద దాడి చేసిన మావోలు పది టీంలుగా విడిపోయి సుక్మా అడవుల్లోని సేఫ్ జోన్లకు వెళ్లిపోయారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దారుణమైన ఆపరేషన్ కు పాల్పడిన హిడ్మాను ప్రభుత్వాలు టార్గెట్ చేయటంతో అతడి భద్రతను మరింత పెంచినట్లుగా చెబుతున్నారు. నాలుగు అంచెల భద్రతను కల్పిస్తూ సేఫ్ జోన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.

తాము అనుకున్నట్లుగా గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాతనే రాకేశ్వర్ సింగ్ ను ప్రజాకోర్టుకు తరలించి.. వందలాది మంది సమక్షంలో అతడ్ని విడుదల చేయటం ద్వారా అందరి చూపును అటువైపు మరిలేలా చేశారని చెబుతున్నారు. కిడ్నాప్ ఎపిసోడ్ మొత్తం ముందుగా వేసుకున్న ప్లాన్ లో భాగమేనన్న అనుమానం ఇప్పుడు బలపడుతోంది. కాల్పులు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున బలగాల్ని కూంబింగ్ కోసం దించాలని భావించగా.. అదే సమయంలో తమ అదుపులోకి తీసుకున్న జవాను ఫోటోను విడుదల చేసి.. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచినట్లుగా అనుమానిస్తున్నారు. మొత్తంగా అనుకున్న ప్లాన్ అనుకున్నట్లుగా మావోలు వర్కువుట్ చేశారని చెప్పక తప్పదు.