Begin typing your search above and press return to search.

పచ్చ పత్రికలు మైక్ పెట్టాయా... మోడీకి... జగన్ కి మధ్యలో...?

By:  Tupaki Desk   |   7 Dec 2022 6:57 AM GMT
పచ్చ పత్రికలు మైక్ పెట్టాయా... మోడీకి... జగన్ కి మధ్యలో...?
X
ఆయన దేశ ప్రధాని. ఈయన ఏపీ సీఎం. ఈ ఇద్దరు నేతలు జీ 20 సన్నాహక సదస్సు ఢిల్లీలో జరిగిన వేళ కర చాలనాలు చేశారు. పరస్పరం పలకరించుకున్నారు. మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి దరిదాపూల్లో ఎవరూ లేరు. వారు ఏమి మాట్లాడుకున్నారో మూడవ మనిషికి తెలిసే అవకాశం అయితే అసలు లేదు.

కానీ ఈ ఇద్దరు మధ్య ఏం జరుగుతుంది ఏమి మాట్లాడుకున్నారు అన్నది పూస గుచ్చినట్లుగా వార్తలు వండి వార్చేస్తునాయి పచ్చ పత్రికలు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటపడి మీడియా ముందుకు వచ్చి ఇదీ మ్యాటర్. మేము దీని మీద మాట్లాడామని చెబితే అపుడు అది న్యూస్ అవుతుంది. దానికి ఒక వాస్తవికత ఉంటుంది. అలా కాకుండా వారితో పాటుగా ఉన్న మూడవ మనిషి ఎవరైనా వివరాలు లీక్ చేస్తే ఆ విధంగా ఆ సోర్స్ ని దగ్గర పెట్టుకుని వార్తలను అల్లుకోవచ్చు.

కానీ ఢిల్లీలో జరిగింది వేరు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న చోట వారి ఏమి మాట్లాడుకున్నారు అన్నది పచ్చ పత్రికలకు మాత్రమే ఎలా లీక్ అయింది. వారికే ఆ వివరాలు ఎలా తెలిసాయి అన్నది ఇక్కడ అతి పెద్ద ప్రశ్న. పోనీ ప్రధాని మోడీ చెప్పారా. ఆయన మీడియాతో ఏమీ చెప్పరు, ఇలాంటివి అసలు మాట్లాడరు, జగన్ అయితే మీడియాకే దూరంగా ఉంటారు. మరి ఏమీ లేని చోట గాలి పోగు చేసి ఇలాంటి వార్తలు వండి వార్చడం కదా పచ్చ మీడియా చేసే పసందు అయిన పని అన్న విమర్శలు వస్తున్నాయి.

ఇక పచ్చ మీడియా వార్తలు ఎలా ఉన్నాయి అంటే చాలా అసంబద్ధంగా ఉన్నాయి. నిజానికి ఎవరూ కూడా అసలు ఇలా జరుగుతుందా అని కూడా అనుకోలేరు. ఏ మాత్రం లాజిక్ కి కూడా అందని వార్తలు అవి. జగన్ ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్. ఆయన సొంతంగా సీఎం అయిన నాయకుడు. మోడీ వేరే పార్టీకి నాయకుడు. మరి జగన్ మీద పెత్తనం చేసే అధికారం హక్కు మోడీకి ఎలా ఉంటుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా కేంద్ర రాష్ట్ర అధికార సంబంధాలే. రాజ్యాంగం ప్రకారం ఉన్న సంబంధాలే.

ఇక చనువు ఉంది. వయసులో పెద్దాయన ప్రధాని అనుకున్నా వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నా బయటకు చెబుతారా. అవి పూర్తిగా అనఫీషియల్ మ్యాటర్ కదా. మరి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు అయినా టీయారెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిందని, ఆ విషయాన్ని జగన్ ఎందుకు ఖండించలేదు అని మోడీ అడిగారట. అసలు ఆ టాపిక్ ఎందుకు అక్కడ చర్చకు వస్తుంది. వచ్చినా జగన్ ఖండించడం మానడం ఆయన సొంత విషయం. దాన్ని ప్రధాని ఎందుకు పాయింట్ చేస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతారు.

అయినా అక్కడ సందర్భం ఏంటి, జీ 20 సన్నాహక సదస్సు. ఇక ఒక ముఖ్యమంత్రి ప్రధాని కూడా అఫీషియల్ గా వేరే విషయాలు మాట్లాడుకోవాలన్నా అది వేదిక కూడా కాదు, పిచ్చాపాటీ సమయం లేదు. కేవలం పలకరింపులు కుశల ప్రశ్నలకు అలాంటి కలయికలు పరిమితం అవుతాయి. ఇది లోకమంతా తెలిసిన విషయం. కానీ పచ్చ పత్రికలు మాత్రం మైక్ ఏకంగా జగన్ జేబులోనే పెట్టి మొత్తం మ్యాటర్ ఎక్కడ నుంచో వింటున్నట్లుగా రాయడం అంటే దాన్ని ఏ తరహా జర్నలిజం అనుకోవాలి అన్నదే అందరి మాటగా ఉంది.

నిజానికి వైఎస్ షర్మిల విషయమే తీసుకుంటే ఆమె అరెస్ట్ అన్నది ఒక చర్చ అయింది. అయితే ఆ విషయం జాతీయ సమస్య కాదు. అంతర్జాతీయంగా భారత్ కి దక్కిన అరుదైన అవకాశంగా జీ 20 అధ్యక్ష స్థానాన్ని అంతా చూస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న జీ 20 సదస్సు ఎలా జరపాలి అన్నది అక్కడ మ్యాటర్. దాని కోసం అందరికీ పిలిపించారు. మరి అలాంటి కీలక సదస్సులో చిల్లర రాజకీయాలు చిన్న విషయాలు ఎందుకు వస్తాయి. ఆ మాటకు వస్తే జగన్ చిన్న పిల్లవాడా ఆయన మోడీ పార్టీకి చెందిన గల్లీ లీడరా.

ఆయన్ని మోడీ గద్దిస్తే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం జగన్ కి ఉందా. మరి ఈ విషయం పచ్చ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్న వారికే తెలియాలి. కేంద్రం సమాఖ్య వ్యవస్థలో ఒక గౌరవనీయ స్థానంలో ఉంటుంది. రాష్ట్రాలు కూడా అందులో కీలకం. అలాగే ప్రధాని ముఖ్యమంత్రుల మంధ్య సంబంధాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటాయి తప్ప వారిని నిలదీసి కంట్రోల్ లో పెట్టి స్కూల్ మాస్టార్ స్టూడెంట్ ని గద్దించినట్లుగా ఉంటాయా.

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఇలాంటి గాలి వార్తలను పోగు చేయడం వాటి మీద డిబేట్లు పెట్టి ఆత్మానందం పొందడం అంటే జర్నలిజం విలువలు ఎక్కడికి పోతున్నాయని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేముంది. జగన్ మీద పీకబండెడు కోపం ఉంటే ఉండవచ్చు. దాని కోసం అయిదు కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఢిల్లీలో ప్రధాని నిలదీశారు అని రాయడం ద్వారా ఎవరి పరువు పోగొడుతున్నారో కూడా తెలుసుకోలేని ఆలోచించలేని మానసిక దౌర్బల్యంలో పచ్చ మీడియా పడిపోతే ఇక ఖర్మ ఇదంతా అని జనాలు అనుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.