Begin typing your search above and press return to search.

స్వాతంత్ర్యం వచ్చినపుడు గాంధీ ఎక్కడున్నారంటే?

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:30 PM GMT
స్వాతంత్ర్యం వచ్చినపుడు గాంధీ ఎక్కడున్నారంటే?
X
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై దేశప్రధాని మోడీ జాతీయ జెండా ఎగురవేసి అనంతరం ప్రసంగించారు. కాగా, మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు జాతిపిత మహాత్మా గాంధీజీ ఎక్కడున్నారో మీకు తెలుసా? ఆయన సంబురాల్లో పాల్గొన్నాడా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందంతే..

అహింసా మార్గంతో భారత‌కు స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ. అయితే, ఆయన స్వాతంత్ర్యం వచ్చిన రోజున సంబురాల్లో పాల్గొనలేదు. ఆ రోజు గాంధీజీ దేశ రాజధాని ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లిం మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే అప్పటికే ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే గ్రహించిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్‌ మహాత్మాగాంధీకి ఓ లేఖ రాశారు.

అందులో ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది. కాబట్టి ఆ సంబురాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించాలని లేఖలో కోరారు. కాగా, ఆ లేఖకు రిప్లై ఇచ్చారు గాంధీ. రిప్లై లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. అవేంటంటే..కలకత్తాలోని హిందూ-ముస్లిం ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబురాలు జరుపుకోడానికి ఎలా రాగలను? అని ప్రశ్నించారు.

ఈ ఘర్షణలు ఆపడానికి తాను తన ప్రాణాలైనా ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ఆగస్టు 14న అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ఇచ్చారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ, జాతిపిత గాంధీ ఆ రోజు తొమ్మిది గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు.

తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్టాడారు. ప్రతీ సారి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదన్న సంగతి దాదాపు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. లోక్‌సభ సెక్రటేరియట్‌ పత్రాల ప్రకారం.. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు.

ఆ రేఖను ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం అంటూ ఏదీ లేదు. ‘జన గణ మణ’ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాశారు. కానీ, అది 1950లో జాతీయగీతంగా గౌరవం పొందింది. ఇకపోతే ఈ గీతాన్ని గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు ఆలపిస్తారు.