Begin typing your search above and press return to search.

మేకిన్ ఇండియా అంటే.. గంగాన‌దిలో శ‌వాలు తేల‌డ‌మా? ఇంత దారుణ‌మా మోడీ జీ!

By:  Tupaki Desk   |   14 May 2021 5:31 AM GMT
మేకిన్ ఇండియా అంటే.. గంగాన‌దిలో శ‌వాలు తేల‌డ‌మా? ఇంత దారుణ‌మా మోడీ జీ!
X
దేశంలో క‌రోనా తీవ్ర‌త పెరుగుతున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం సరైన విధంగా స్పందించ‌డం లేద‌నే ఆవేద‌న‌, వాద‌న దేశ‌వ్యాప్తంగా వినిపిస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర కేవలం మాట‌ల మ‌నిషిగానే క‌నిపిస్తున్నార‌ని, చేత‌ల విష‌యంలో ఆయ‌న పూర్తిగా జీరో అయ్యార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ‌.. ప్ర‌ధానిపై విమ‌ర్శ‌ల జోరు పెరిగింది. నిజానికి దేశంలో గ‌త ఏడాది తొలి ద‌శ క‌రోనా.. పొడ‌చూప‌గానే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన మోడీకి.. ఇష్ట‌మైనా.. క‌ష్ట‌మైనా.. అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాలు కూడా మోడీ నిర్ణ‌యానికి హ‌ర్షాతిరేకం వ్య‌క్తం చేశాయి.

అయితే.. అది జ‌రిగిన కొన్నాళ్ల‌కే దేశంలో సెకండ్ వేవ్ ఉందంటూ.. ప‌లు సంస్థ‌లు, నిపుణులు ప్ర‌ధానిని హెచ్చ‌రించారు. అయితే.. దీనిని ఆయ‌న ఖాతరు చేయ‌లేద‌ని.. పైగా సెకండ్ వ‌చ్చాక చూసుకుందామ‌నే ధోర‌ణి అవ‌లంబించార‌ని కొంద‌రు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. దీనికితోడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ఆయ‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, క‌రోనా ముప్పు పొంచి ఉంద‌ని తెలిసినా.. భారీ ఎత్తున ల‌క్ష‌ల మందితో స‌భ‌లు నిర్వ‌హించ‌డం వంటివి క‌రోనా వ్యాప్తికి దారితీశాయ‌ని.. నిపుణులు చెబుతున్నారు. ఇక‌, దేశంలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తే..ఇంత తీవ్ర‌త ఉండేది కాద‌ని, ఫిబ్ర‌వ‌రి-మార్చి మ‌ధ్య ఉత్ప‌త్తి అయిన‌.. వ్యాక్సిన్ ను త‌న గొప్ప కోసం మోడీ.. విదేశాల‌కు ఉ చితంగా పంపిణీ చేశార‌ని ఇదే పెద్ద మైన‌స్ అని చెబుతున్నారు.

పోనీ.. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందించే ప్ర‌క్రియ‌ను కూడా మోడీ స‌త్వ‌రం ప్రారంభించ‌లేక పోయార‌నే వాద‌న కూడా ఉంది. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి, పంపిణీపై స‌మ‌గ్ర వివ‌రాలు త‌న చేతిలో ఉంచుకుని కూడా.. 18-45 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేయాలంటూ.. పిలుపు నివ్వ‌డం.. రాష్ట్రాల‌కు వ్యాక్సిన్‌ను ఇవ్వ‌క‌పోవ‌డం.. వంటివి కేవ‌లం ప‌టాటోపాల కోసం ప్ర‌ధాని చేసిన ప్ర‌చార‌మే త‌ప్ప‌.. మ‌రేమీ లేద‌ని ఈస‌డిస్తున్నారు. ఇక‌, ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి స‌ర‌ఫ‌రా విష‌యంలోనూ ప్ర‌ధాని చ‌ర్య‌లు తీసిక‌ట్టుగా ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇక‌, ప్ర‌ధానిపై ఎవ‌రైనా.. కామెంట్లు చేస్తే.. వెంట‌నే బీజేపీ దండు రంగంలోకి దిగి.. వారిపై దేశ‌ద్రోహుల‌నో.. చైనా అనుకూల వ‌ర్గాల‌నో ముద్ర వేయ‌డం ప‌రిపాటిగా మారిపోయింది. వాస్త‌వాన్ని ఒప్పుకొనే... జీర్ణించుకునే అవ‌కాశం కూడా మోడీ స‌హా ఆయ‌న మంత్రి వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీకి కూడా లేక పోవ‌డం మ‌రో అశ‌నిపాతం. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. క‌రోనా మృతుల‌కు గౌర‌వంగా అంతిమ సంస్కారాలు నిర్వ‌హించుకోలేని దుర్భ‌ర దేశంగా భార‌త్ మిగిలిపోయింద‌ని.. అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌, మేక్ ఇన్ ఇండియా వంటి ప‌డిక‌ట్టు పదాల‌తో త‌న ప్ర‌సంగాల‌ను హోరెత్తించే ప్ర‌ధాని మోడీ.. ప్ర‌స్తుతం గంగా నదిలో జ‌రుగుతున్న క‌రోనా శ‌వ నిమ‌జ్జ‌నాల విష‌యందేశ‌వ్యాప్తంగా గ‌గ్గోలు పుట్టిస్తున్నా.. త‌న‌కేమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. మేధావులు కూడా సోష‌ల్ మీడియాలో దుయ్య‌బ‌డుతున్నారు. ప్ర‌స్తుతం గంగా ప‌రివాహ‌క ప్రాంతాలు శ‌వాల దిబ్బ‌ల్లా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ.. ముందుచూపు ఎంత బాగుందో.. శ‌వాలు చెప్పక‌నే చెబుతున్నాయ‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు. మ‌రి ఇదేనా.. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్, ఇదే మేక్ ఇన్ ఇండియా అంటే మోడీ జీ!! అంటున్నారు ప‌రిశీల‌కులు.