Begin typing your search above and press return to search.

ఎవరు చెప్పారు బాస్ మోడీని అభిమానించొద్దని?

By:  Tupaki Desk   |   8 Dec 2022 12:41 AM GMT
ఎవరు చెప్పారు బాస్ మోడీని అభిమానించొద్దని?
X
అనూహ్యంగా రియాక్టు కావటం రాజకీయాల్లో ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఈ గుణం సరిపడనంత ఉండాలే కానీ.. సామాన్యుల్ని సైతం అసమాన్య స్థానాలకు తీసుకెళ్లేలా చేస్తుంది. ఇలాంటి గుణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి టన్నుల కొద్దీ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వ వికాస నిపుణుడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మాటలు.. విలువలే తన వలువలన్నట్లుగా ఆయన మాటల తీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. కాకుంటే.. మోడీని అభిమానించాలన్నా.. ఆరాధించాలన్నా విచక్షణ అన్న గుణం లేకుంటే మాత్రం నిర్విరామంగా ఆయన్ను అభిమానించే వీలు ఉంటుంది.

కానీ.. దరిద్రపుగొట్టు లాజిక్ అనేది మెదడులో కాస్తంత ఉండి ఉంటే.. మోడీని సపోర్టు చేసే ప్రతిసారీ.. అదెలా? ఇదెలా? లాంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మనసు అడిగే మాటల్ని.. మెదడు అడిగే ప్రశ్నల్ని పక్కన పెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు మోడీ మాష్టార్ని అభిమానించటానికి. విషయం ఏదైనా సరే.. తాను అనుకున్నది మాత్రమే చేసే అలవాటున్న నమో.. కొన్ని విషయాల్లో జిడ్డూగా ఉంటారో ఒక పట్టాన అర్థం కాదు.

ఏపీ విషయంలో ఆయన తీరే వేరుగా ఉంటుందని చెప్పాలి. ప్రధానమంత్రి రేసులో ఉండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వేళలో.. ఏపీకి ప్రత్యేక హోదా మీద హామీ ఇచ్చేయటమే కాదు.. ఏపీ రాజధానిగా ఢిల్లీని తలదన్నేలా తయారు చేద్దామని చెప్పిన ఆయన.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని ఎలా చూస్తున్నారో తెలిసిందే.

తాను స్వయంగా హాజరై.. శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో తన దత్తపుత్రుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నా.. పల్లెత్తు మాట అనని వైనం చూస్తే.. ఆయన ఆలోచనలు ఏమిటన్నది ఒక పట్టాన అర్థం కాదు.

ఏపీ సీఎంను మోడీ ఎంతలా అభిమానిస్తారన్న విషయాన్ని ఈ మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఓపెన్ అయ్యారు. మరి.. అంతటి సన్నిహిత్వం ఉన్న జగన్ తో.. ఏపీ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్న విషయం మోడీ నోటి నుంచి రావాలే కానీ.. జగన్ మొత్తంగా మారిపోతారన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తనకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఆయన ఎందుకు వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్న.

ప్రేమ పెదాల మీద.. కోపం మాత్రం మనసుకు తీసుకునే మోడీకి ఆ రెండు గుణాలే ఆయన బలం.. బలహీనతగా చెబుతుంటారు. మాట్లాడే ప్రధానమంత్రి కావాలని కోరుకున్న దేశ ప్రజలకు గడిచిన ఎనిమిదిన్నరేళ్లుగా ఆ లోటును తీర్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశాన్ని ప్రగతి బాట పట్టించటంలో ఆయన ఎంతమేర సక్సెస్ అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతా తాను చెప్పినట్లు మాత్రమే జరగాలన్న తపన ఎక్కువగా ఉన్న మోడీ మాష్టారిని.. అభిమానించొచ్చు. ఆరాధించొచ్చు. కాకుంటే కండీషన్స్ అప్లై అన్నది మాత్రం అస్సలు మరవకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.