Begin typing your search above and press return to search.

ఏపీలో ఈసారి ఏ వేలికి సిరా చుక్క పెడతారంటే?

By:  Tupaki Desk   |   6 April 2021 8:01 AM GMT
ఏపీలో ఈసారి ఏ వేలికి సిరా చుక్క పెడతారంటే?
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మొన్నామధ్యన పుర ఎన్నికలు పూర్తి కావటం.. అంతలోనే తిరుపతి ఉప ఎన్నిక వచ్చేయగా.. తాజాగా జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నెల 8న దీనికి సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్ని ఏపీ విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం బహిష్కరించటం తెలిసిందే.

తెలుగుదేశం బాటలోనే జనసేన కూడా నడుస్తూ.. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన మున్సిపోల్స్ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన వారికి వేసిన సిరా చుక్క చాలా మందికి పోలేదు. దీంతో.. పరిషత్ ఎన్నికల్లో ఏ వేలికి సిరా చుక్క గుర్తు పెడతారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా ఏపీ ఎన్నికల అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. పరిషత్ ఎన్నికల్లో ఓటర్లకు ఏడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు పెట్టనున్నారు. ఈ మధ్యనే ముగిసిన మున్సిపోల్స్ సందర్భంగా ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్క వేశారు. సాధారణంగా ఈ చుక్క ఐదు నుంచి ఏడు రోజుల్లో చెరిగిపోతోంది. అయితే.. కొందరిలో మాత్రం గోరు పెరిగే వరకు కనిపించే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకొని చిటికెన వేలుపై సిరా చుక్క వేయాలని నిర్ణయించారు. మరి.. తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఎన్నికకు ఏ వేలికి సిరా చుక్క వేస్తారన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు.