Begin typing your search above and press return to search.

లక్కీ హ్యాండ్...ఏపీలో కమ్యూనిస్టులు ఎటు వైపు...?

By:  Tupaki Desk   |   9 Nov 2022 2:30 AM GMT
లక్కీ హ్యాండ్...ఏపీలో కమ్యూనిస్టులు ఎటు వైపు...?
X
కమ్యూనిస్టులతోనే తమకు విజయం దక్కిందని టీయారెస్ చెబుతోంది. మునుగోడులో తాము గెలిచామంటే అది కమ్యూనిస్టుల మద్దతుతోనే అని మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. నిజంగా చూస్తే అదే జరిగింది. మునుగోడులో ఉన్న కమ్యూనిస్టుల ఓట్లు టీయారెస్ ని ఒడ్డున పడేశాయి. అంతే కాదు తమతోనే కమ్యూనిస్టులను రేపటి రోజున ఏ ఎన్నికలోనైనా ఉంచుకుంటామని టీయారెస్ చెబుతోంది.

ఇక ఏపీ విషయానికి వస్తే కమ్యూనిస్టులు గత రెండు ఎన్నికల నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. 2014, 2019లలో వారు పోటీ చేసినా గెలుపు అన్నది పలకరించలేదు. అయితే 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కమ్యూనిస్టులు చూస్తున్నారు. పొత్తులకు కూడా సై అంటున్నారు. ఇప్పటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ని సీపీఎం నేత మధు కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం.

ఇక సీపీఐ నాయకులు అయితే తెలుగుదే తెలుగుదేశంతో కలసి గత మూడేళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ లేని కూటమిలో తాము ఉండాలని వారు భావిస్తున్నారు. అయితే టీడీపీ ఇంకా బీజేపీ వైపు చూస్తోంది. చివరి నిముషం వరకూ బీజేపీ టీడీపీ జనసేన కూటమి కధ తెమిలేది కాదు అని అంటున్నారు. అందువల్ల కమ్యూనిస్టులకు ఏపీలో ఎవరితో పొత్తులు అన్నది ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.

అయితే టీయారెస్ బీయారే గా మారి వచ్చే ఎన్నికల్లో దేశమంతటా పోటీ చేయాలని చూస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి కూడా బీయారెస్ పోటీ పడుతుంది అని అంటున్నారు. అలా చూసుకుంటే తాము వామపక్షాలను వదలమని ఏ ఎన్నిక ఎక్కడ జరిగినా పొత్తు కొనసాగిస్తామని టీయారెస్ నాయకులు అంటున్నారు. అంటే ఏపీలో కూడా వామపక్షాలను వదిలే పరిస్థితి ఉండదు అని చెబుతున్నారు.

మరి ఏపీలో బీయారెస్ తో జట్టుకట్టి వామపక్షాలు ఇక్కడ కూడా తమది లక్కీ హ్యాండ్ అని చాటుకుంటాయా లేక ఏపీ వరకూ తమకు టీడీపీతో జనసేనతోనే పొత్తు అని వేరు పడతారా అన్నది చూడాలి. ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది. ఏపీలో అన్ని పార్టీలు కలిసి మహా కూటమిగా వస్తాయని. మరి ఆ మహాకూటమిలో బీయారెస్ కి కూడా చోటిస్తారా అన్నది కూడా ఆలోచించాలి.

ఏది ఏమైనా ఏపీలో కమ్యూనిస్టులు ఎటు వైపు అంటే ప్రస్తుతానికి వారు కూడా చెప్పలేరు. ఒక్కటి మాత్రం నిజం. కమ్యూనిస్టులు వైసీపీకి దూరంగానే ఉంటున్నారు. కాబట్టి ఆ పార్టీతోనూ జట్టు ఉండదు. అలాగే సిద్ధాంతాల పరంగా తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీతో, ఆ పార్టీ ఉన్న కూటమితోనూ వారు కలిసే చాన్స్ లేదు. అందువల్ల ఎర్రన్నలు ఏపీలో ఎవరితో దోస్తీ అంటారో ఆసక్తికరమైన అంశమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.