Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ గుట్టు రట్టుచేసిన సొంత ఉద్యోగులు

By:  Tupaki Desk   |   21 Oct 2019 11:10 AM GMT
ఇన్ఫోసిస్ గుట్టు రట్టుచేసిన సొంత ఉద్యోగులు
X
టెక్నాల‌జీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌...మ‌రోమారు వివాదంలో చిక్కుకుంది. ఇన్ఫోసిస్ కార్పొరేట్ గవర్నెన్స్ విధానం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండనుందని - కాబట్టి ఇన్వెస్టర్లంతా హాయిగా నిద్రపోవచ్చని ప‌లు సంద‌ర్భాల్లో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి చెప్పిన మాటల్లో నిజం లేద‌ని తేలింది. ఉన్నతాధికారులు అడ్డదారులు తొక్కుతున్నారని కంపెనీ రాబడి, లాభాలని అధికంగా చూపేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆధారాల‌తో స‌హా వెల్ల‌డిస్తూ...కంపెనీలో పనిచేసే 'ఎథికల్ ఎంప్లాయిస్' పేరుతో ఏర్పడిన ఒక బృదం ఈ మేరకు ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డుకు, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ ఈసి) కి ఫిర్యాదు చేసిన ఉదంతం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

వివిధ అంశాల‌ను పేర్కొంటూ ఇన్ఫోసిస్‌ పై ది ఎకనామిక్ టైమ్స్ సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించింది. ఇటీవల కుదిరిన కొన్ని బిలియన్ డాలర్ల ఒప్పందాల్లో ఎలాంటి మార్జిన్లు లేవని పేర్కొంటూ ఇన్ఫోసిస్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ మ‌రియు అమెరికా ఎస్ ఈసి కి రాసిన ప్రత్యేక లేఖల్లో ఎథికల్ ఎంప్లాయిస్ గ్రూప్ ఆ లేఖ‌ను త‌మ‌కు అందించింద‌ని - దీంతో పాటుగా ప‌లు వాయిస్ రికార్డుల ఆధారంగా తాము ఈ వార్తా క‌థ‌నం ప్ర‌చురించామ‌ని వెల్ల‌డించింది. వెరిజోన్ - ఇంటెల్ - ఏబీఎన్ అమ్రో - జపాన్ కు చెందిన జాయింట్ వెంచర్స్ తదితర భారీ డీల్స్ లో రాబడి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం లేవని ఆ బృందం గుర్తించింద‌ని - సీఈఓ సలీల్ పరేఖ్ - సిఎఫ్ ఓ నీలాంజన్ రాయ్ విధానాల్లో మార్పులు చేస్తూ ట్రెజరీ మానేజ్ మెంట్ లో మార్పులు చేయాలనీ కంపెనీ ఫైనాన్స్ టీం పై ఒత్తిడి తెస్తున్నారని బృందం ఆరోపించిందనే అంశాల‌ను త‌న క‌థ‌నంలో ఈటీ పేర్కొంది.

రాబ‌డికి సంబంధించిన అంశాలే కాకుండా వీసా ఖర్చులను కూడా చూపొద్దని మేనేజ్‌ మెంట్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని - సుమారు రూ 350 కోట్ల విలువైన ఒప్పందం విష‌యంలోనూ...ఇదే దోర‌ణిని అవ‌లంభించార‌ని స‌ద‌రు బృందం పేర్కొంది. సంబంధించిన వివరాలను తాము బోర్డుకు ఇచ్చే ప్రెసెంటేషన్స్ లో వెల్లడించకుండా కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) అడ్డుకున్నట్లు ఈ టీం ఆరోపించింది. . కీలకమైన అంశాలను ఫారం 20 ఎఫ్ లో ప్రస్తావించవద్దని చెబుతున్నారని, అలాగే అనలిస్టులు, ఇన్వెస్టర్లతో కంపెనీకి సంబంధించిన మంచి అంశాలను మాత్రమే వెల్లడించాలని కోరుతున్నారని తెలిపింది. ఈ నేప‌థ్యంలో...ఆడిటర్లు ఆయా డీల్స్ కు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని - మార్జిన్లు - అప్రకటిత ముందస్తు కమిట్ మెంట్లు - రాబడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనీ కోరింది.

2017లోనూ ఇన్ఫోసిస్‌ లో ఇలాంటి ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. పనయా డీల్‌ లో అక్రమాలు జరిగాయని విజిల్ బ్లోయర్ ఒకరు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ఫిర్యాదు చేశారు. దాంతో సంస్థ అంతర్జాతీయ న్యాయ - ఆడిటింగ్ సంస్థలతో థర్డ్‌ పార్టీ ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరిపించింది. పనయా డీల్‌లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని దర్యాప్తు ఏజెన్సీలు సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చాయని ఇన్ఫీబోర్డు ప్రకటించింది. కానీ ఈ విషయంపై సందేహం వ్యక్తం చేసిన మూర్తి దర్యాప్తు రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా సంస్థ గవర్నెన్స్ ప్రమాణాల్లో ఎక్కడ పొరబాటు జరుగుతుందో తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే రిపోర్టును బయటపెట్టాలని కోరారు. తాజా ఉదంతంలో కూడా అదే ర‌క‌మైన ప‌రిణామాలు సంభ‌వించిన నేప‌థ్యంలో... ఇన్ఫోసిస్ కంపెనీ బోర్డు త‌క్ష‌ణ‌మే స్పందించింది. తమ ఆడిట్ కమిటీ కి ఈ విషయాన్నీ పరిశీలించాలని సిఫారసు చేసింది. తమ విజిల్ బ్లోయర్ పాలసీ కి అనుగుణంగా తగు చర్య తీసుకొంటామని పేర్కొంటూ అమెరికా మార్కెట్ రెగ్యులేటర్‌ కు స్టేట్‌ మెంట్ స‌మ‌ర్పించింది.