Begin typing your search above and press return to search.

వైట్ ఫంగస్ టెన్షన్.. ఎవరికి ప్రమాదకరం?

By:  Tupaki Desk   |   29 May 2021 12:30 AM GMT
వైట్ ఫంగస్ టెన్షన్.. ఎవరికి ప్రమాదకరం?
X
కరోనా రెండో దశలో ఎక్కువగా కలవరపెట్టే అంశం ఫంగస్ ఇన్ఫెక్షన్లు. ఇప్పటికే వివిధ రకాల ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ పేరిట ముప్పేట దాడి చేస్తున్నాయి. యూపీలోని ఘాజియాబాద్ లోని ఓ ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందే రోగిలో ఈ మూడు రకాల ఫంగస్ లను గుర్తించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమని చెబుతున్నారు.

బిహార్ రాష్ట్రంలో వైట్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆ రాష్ట్ర వైద్యులు వెల్లడించారు. పట్నాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు రోగుల్లో వైట్ ఫంగస్ ను నిర్ధారించినట్లు తెలిపారు. వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్లతో ఎక్కువ ప్రమాదం ఉందని శ్వాసకోస నిపుణులు చెబుతున్నారు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలో, తేమ ఎక్కువగా ఉండే వారిలో ఈ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, రక్తం, ఎముకలు, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.

కరోనా కారణంగా లేదా ఇతర సమస్యల వల్లనైనా ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్నవారికి వైట్ ఫంగస్ సోకే ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. కీమో థెరపీ చేయించుకున్న వారికీ ప్రమాదం ఉందని హెచ్చరించారు. అవయవ మార్పిడి చేసుకున్నవారిలోనూ వైట్ ఫంగస్ వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకటి కన్నా ఎక్కువ సర్జరీలు చేసుకున్నా, షుగర్ తో బాధపడేవారు, ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్కువ ముప్పు అని నిపుణులు తెలిపారు.

వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదని తేల్చారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని... కాకపోతే చర్మానికి సోకితే వ్యాపించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీనికి కరోనా లక్షణాలు ఉంటాయని తెలిపారు. సీటీ స్కాన్, ఎక్స్ రే ద్వారా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ప్రధాన అవయవాలకు సోకిన ఈ ఫంగస్... నోరు, మెదడు, జననాంగాలు, మూత్ర పిండాలకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శరీరంలో వ్యాప్తిని బట్టి ఫంగస్ రంగు ఉంటుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ తెలిపారు. పరిశుభ్రంగా ఉండడం ఒక్కటే మార్గమని సూచించారు. వీలైనంత వరకు శుభ్రతతో ఉంటే ఫంగస్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చని సూచించారు.