Begin typing your search above and press return to search.

సీక్రెట్స్ లేవంటూనే షాకింగ్ విషయాల్ని చెప్పేశారు

By:  Tupaki Desk   |   22 April 2020 5:30 PM GMT
సీక్రెట్స్ లేవంటూనే షాకింగ్ విషయాల్ని చెప్పేశారు
X
కొన్నిసార్లు అంతే. ఎవరో మొదలు పెడతారు. దాని ముగింపు ఎప్పుడో.. ఎక్కడో అస్సలు తెలీదు. గమ్యం లేని ప్రయాణం మాదిరి సాగుతుంటుంది. సరిగ్గా ఈ మాటలకు తగ్గట్లే ఉంది కరోనా ఎపిసోడ్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్ 19) మీద షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్. డబ్ల్యూహెచ్ వో తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో టెడ్రోస్ సమాధానం చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయన్న భావన వ్యక్తమైంది.

ఇలాంటి వేళ మీడియా ముందుకు వచ్చిన ఆయన.. కరోనాకు సంబంధించి మరిన్ని షాకింగ్ వాస్తవాల్ని ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని చాలామందికి ఈ ప్రాణాంతక వైరస్ మీద ఇంకా అవగాహనకు రాలేదన్న బాంబు పేల్చారు. తమను నమ్మాలని.. రానున్న రోజుల్లో మరింత ఉత్పాతం రానున్నట్లుగా ఆయన చెప్పారు.

ఈ విషాదాన్ని అందరం కలిసికట్టుగా ఆపాలన్న ఆయన.. కరోనా గురించి చాలామందికి ఇంకా అర్థం కాలేదన్నారు. తమ దగ్గర ఎలాంటి సీక్రెట్స్ లేవని.. కరోనాకు సంబంధించిన విషయాల్ని గోప్యంగా ఉంచటం చాలా డేంజర్ గా అభివర్ణించారు. కొవిడ్ 19 చాలా ప్రమాదకరమైనదని.. దానికి సంబంధించి విబేధాలు ఉంటే.. దాంతో మరింత ప్రమాదమని ఆయన హెచ్చరించారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిబ్బంది తో కలిసి తాము పని చేస్తామని... అలాంటప్పుడు తమ వద్ద ఎలాంటి రహస్యాలు ఉండవని స్పష్టం చేశారు.

అమెరికాకు తెలీకుండా తామేమీ దాచిపెట్టలేమన్న ఆయన.. వందేళ్ల క్రితం నాటి స్పానిష్ ఫ్లూకు కరోనా కు పోలిక ఉందన్నారు. అప్పట్లో కోటి మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారికి తగ్గట్లే.. కరోనా ఉందన్నారు. అందరూ కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయం ఇదేనన్నారు. కరోనాపై అందరూ ఐకమత్యం తో పోరాడాల్సి ఉందన్న విషయాన్ని పక్కన పెడితే.. రానున్న రోజులు మరింత ప్రమాదకరమన్న విషయాన్ని అండర్ లైన్ చేసుకొని ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.