Begin typing your search above and press return to search.

క్వారంటైన్ కు నో అన్నోళ్లపై కేసులు కాదు.. ఇలా చేయాలట

By:  Tupaki Desk   |   23 March 2020 6:35 AM GMT
క్వారంటైన్ కు నో అన్నోళ్లపై కేసులు కాదు.. ఇలా చేయాలట
X
ఎవరికి వారు బాగుండాలనుకోవటం మామూలే. కానీ.. ఎదుటోళ్లు.. పక్కనున్నోళ్లు కూడా బాగుండాలనుకోవాల్సిన పరిస్థితి కరోనా వేళ నెలకొని ఉంది. మనతో పాటు.. మన చుట్టుపక్కల వారు బాగున్నప్పుడు మాత్రమే మనమంతా బాగుంటామన్న విషయాన్ని కరోనా క్లియర్ గా చెబుతోంది. ప్రమాదకరమైన వైరస్ ను దూరంగా ఉంచేందుకు ఎవరికి వారు స్వీయ నియంత్రణ అవసరం. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. విదేశాల నుంచి వచ్చినోళ్లు మాత్రం చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

విదేశాల నుంచి వచ్చినంతనే.. ఆరోగ్యంగా ఉన్నోళ్లు పద్నాలుగు రోజులు ఎవరికి వారు క్వారంటైన్ చేసుకోవటం ద్వారా.. కరోనా వైరస్ ఏమైనా ఉంటే బయటపడే అవకాశం ఉండటంతోపాటు.. ఇతరులకు సోకే ప్రమాదం నుంచి తప్పించొచ్చు. ఇంత చిన్న విషయం మీద ప్రభుత్వం ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారింది. మాటలతో వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చి.. బుద్దిగా ఇంట్లో ఉండాలని చెబితే.. మాట వినని వారిపైన పోలీసులు చర్యలు స్టార్ట్ చేశారు. మహబూబాబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో హోం క్వారంటైన్ పాటించని నలుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవల వారు ఖతార్ నుంచి వచ్చిన ఇద్దరు దంపతులకు.. వారి అత్తమామలకు కరోనా మీద అవగాహన కల్పించారు. ఇంట్లోనే ఉండాలని.. బయటకు రాకూడదని స్పష్టంగా చెప్పి.. దాని వల్ల చోటు చేసుకునే ఇబ్బందుల్ని తెలియజేశారు. అయినప్పటికీ వారు ఇళ్లల్లో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోవటంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఈ విషయాల్ని తెలియజేశారు. దీంతో.. వారిపై కేసు నమోదు చేశారు.
ఇలాంటి ఉదంతాలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండటానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఈ నెల 18న దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడు.అతను ఫారిన్ నుంచి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. అతన్ని క్వారంటైన్ కావాలని కోరారు.అయినప్పటికీ అధికారుల మాటల్ని పెడచెవిన పెట్టి.. బయట తిరగటం మొదలు పెట్టాడు.
తాజాగా ఫ్రిజ్ కొనేందుకు సిరిసిల్ల వెళ్లాడు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకోవటమే కాదు.. కేసు నమోదు చేశారు. ఇలాంటి వారి తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం తమ కోసం.. తమ స్వార్థంతో క్వారంటైన్ చేయని వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ మీద ప్రపంచం ఇంతలా ఆగమాగం అవుతుంటే.. ప్రభుత్వ ఆదేశాల్ని తుంగలో తొక్కే ఇలాంటి వారందరిని.. కలిసి ఒకేచోట ఉంచాలని.. వీరికి పరిమితమైన ఆహారాన్ని ఇస్తే సరిపోతుందంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి చర్యలు భారత్ లో సాధ్యం కానప్పటికీ.. అవగాహన కల్పించటం.. లేదంటే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.