Begin typing your search above and press return to search.

లేక లేక సచిన్ మాట్లాడబోతే..

By:  Tupaki Desk   |   21 Dec 2017 1:16 PM GMT
లేక లేక సచిన్ మాట్లాడబోతే..
X
భారత క్రికెట్ దిగ్గజం.. ఎంపీ సచిన్ తెందూల్కర్ రాజ్యసభకు రావడమే గగనం. ఎంపీ అయ్యాక గత ఐదేళ్లలో సచిన్ సభకు వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. దీనిపై ఎన్ని విమర్శలు చెలరేగాయో తెలిసిందే. అతను ఇప్పుడు లేక లేక సభకు రావడమే కాదు.. ప్రసంగం చేయడానికి కూడా తయారయ్యాడు. కానీ సచిన్ ను రాజ్యసభకు పంపిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలే సచిన్ ప్రసంగానికి బ్రేక్ వేశారు. అతడిని మాట్లాడనివ్వకుండా చేశారు. తొలిసారి రాజ్యసభలో ప్రసంగం చేసేందుకు సిద్ధమైన సచిన్ కు గురువారం చేదు అనుభవం ఎదురైంది. మైకు తీసుకుని ప్రసంగించేందుకు సిద్ధమైన తరుణంలోనే వేరే కారణాలతో కాంగ్రెస్ సభ్యుల అదే పనిగా నినాదాలు చేస్తూ ఏండటంతో చేసేది లేక మాస్టర్ బ్లాస్టర్ తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. తనను ఇంతవాడిని చేసిన క్రీడా రంగం మీదే సచిన్ మాట్లాడాలనుకున్నాడు. ‘రైట్‌ టు ప్లే అండ్‌ ఫ్యూఛర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా 'అనే అంశంపై మాట్లాడేందుకు ప్రిపేరై వచ్చాడు. విద్యతోపాటు ఆటలు కూడా తప్పనిసరి చేయాలని.. అందుకు అవసరమైన వసతులను ప్రభుత్వమే కల్పించాలని సచిన్‌ కోరాలనుకున్నాడు. కానీ అతడికి మాట్లాడే అవకాశమే లేకపోయింది.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. వాళ్లు ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో సచిన్ ప్రసంగానికి వీలు పడలేదు. సచిన్ క్రీడల్లాంటి ముఖ్యమైన అంశంపై మాట్లాడుతుంటే వినరా అంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినా.. కాంగ్రెస్ ఎంపీల్ని మందలించినా ఫలితం లేకపోయింది. సచిన్ ను మాట్లాడనివ్వకపోవడంపై ఎంపీ జయాబచ్చన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.