Begin typing your search above and press return to search.

కేసీఆర్ ని ఢీకొనే శక్తి టీ.కాంగ్రెస్ లో ఎవరికి ఉంది?

By:  Tupaki Desk   |   4 Jun 2020 9:30 AM GMT
కేసీఆర్ ని ఢీకొనే శక్తి టీ.కాంగ్రెస్ లో ఎవరికి ఉంది?
X
జూన్ 2తో కేసీఆర్ ఆరేళ్ల పాలన పూర్తయ్యింది. తెలంగాణలో రెండోసారి అధికారం వచ్చిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగారు. ఈ ఆరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించి అభివృద్ధి పథాన తెలంగాణను నడిపించారు. ఆరేళ్ల సంబురానికి కొత్త రాష్ట్రం రెడీ అవుతున్న వేళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ ను ఢీకొట్టలేకపోతోంది. ఇప్పటికీ పీసీసీ చీఫ్ కోసం సీనియర్లు మంకు పట్టు పట్టి తగవులాడుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు వత్రం చెడ్డా ఫలితం దక్కలేదు. మొన్నటిసారి చుక్కెదురైంది. మరి కాంగ్రెస్ ను తెలంగాణలో నిలబెట్టే మగాడెవరు? కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది అనే దానిపై ‘తుపాకీ.కామ్’ పోల్ నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఈ పోల్ లో ప్రధానంగా కేసీఆర్ ను ఢీకొనే నేత ఎవరు అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పేర్లను ఇవ్వగా వారిలో ఎవరు నిలిచారన్నది చూద్దాం..

*ఉత్తమ్ పని అయిపోయింది..
తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించలేదు. పైగా తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో కూడా ఓడిపోయి పీసీసీ చీఫ్ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజల సానుభూతి వల్ల మూడు ఎంపీ సీట్లు దక్కి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాంగ్రెస్ పరువు దక్కింది. ఇప్పుడు కరోనా-లాక్ డౌన్ ముగిస్తే మొదట కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడి మార్పే మొదటి ప్రియారిటీగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఢీకొనే నేత ఎవరు అన్న పోల్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేవలం 2.65% ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కేసీఆర్ ను ఎదురించే సామర్థ్యం ఉత్తమ్ కు లేదని పాఠకులు తీర్పునిచ్చారు.

*రేవంత్ రెడ్డి అందరికంటే ముందు..
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ చీఫ్ రేసులో అందరికంటే ముందు రేవంత్ రెడ్డియే ఉన్నాడు. ఇటు పార్టీ యువ కేడర్ లో.. నేతల్లో రేవంత్ కు మేనియా పీక్స్ లో ఉంది. మాస్ లీడర్ గా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే చేయాలని ఉబలాటపడుతోంది. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ చీఫ్ ను చేయడానికి వీల్లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.. కానీ కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడిగా తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఆ పేరుంది. వాగ్ధాటిలో, నాయకత్వశైలిలో రేవంత్ అందరికంటే ముందున్నారు. అందుకే తుపాకీ పోల్ లో కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా పాఠకులంతా కలిసి ఏకగ్రీవంగా రేవంత్ కే ఓటేశారు. ఆయనకు 76.64% ఓటింగ్ రావడం గమనార్హం.

*కోమటి రెడ్డిపై శీతకన్ను
నిజానికి ఉత్తమ్ తర్వాత అత్యంత బలంగా కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ చీఫ్ ఇవ్వండి టీఆర్ఎస్ లోని 50 మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని అంటున్నాడు. కానీ ఆయన తమ్ముడు బీజేపీకి సపోర్టు చేయడం.. నిలకడలేని రాజకీయం వల్ల కోమటిరెడ్డిని నమ్మేస్థితిలో అధిష్టానం లేదన్న వాదన వినిపిస్తోంది.అయితే పాఠకుల్లోనూ కేసీఆర్ ఢీకొట్టే నేతగా కోమటి రెడ్డిని పాస్ చేయలేదు. ఆయనకు కేవలం 14.92%మంది మాత్రం సపోర్టు చేశారు.

* రేవంత్, కోమటిరెడ్డి తర్వాత అంతో ఇంతో కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా జగ్గారెడ్డికి పేరుంది. కానీ ఆయన పాఠకులు వేసిన ఓటింగ్ కేవలం 5.79% మాత్రమే. దీన్ని బట్టి కూడా కేసీఆర్ ను ఢీకొట్టడంలో సరిపోడని అర్థమైంది.

*వీహెచ్, జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి, జానాలకు డౌటే
ఓటింగ్ లో చేర్చని వీరు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో కీలక సభ్యులేననడంలో ఎలాంటి సందేహం లేదు. పేరు మోసిన కాంగ్రెస్ కురువృద్ధులైన వీ హనుమంతరావు, జీవన్ రెడ్డి, జానారెడ్డిలకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడం డౌటే అన్న చర్చ పార్టీలో సాగుతోంది. వీరు పార్టీని ముందుండి నడిపించలేరనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ రేసు నుంచి సీనియర్లను పక్కనపెట్టారనే చర్చ సాగుతోంది.

ఇక రేవంత్ రెడ్డికి వద్దనుకుంటే రేసులో దళిత నేత మల్లు భట్టివిక్రమార్క్, మరోనేత శ్రీధర్ బాబుల పేరు వినిపిస్తోంది.కానీ వీరికి రేవంత్ రెడ్డిలా మాస్ ఫాలోయింగ్ లేకపోవడం.. వీరికి అప్పగించినా పెద్దగా పురోగతి ఉండదన్న అభిప్రాయాలు పార్టీలో ఉంది.

మిగతా నేతలున్నా కూడా పీసీసీ బరిలో వీరి పేర్లే వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరిలోకి రేవంత్ రెడ్డి బలంగా కనిపిస్తున్నారు... కేసీఆర్ ను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలున్నాయని ప్రజలు ఏకగ్రీవంగా తీర్పునిచ్చారు. ఆయనకు 76.64% మంది ప్రజలు మద్దతుగా నిలిచారు. అయితే రేవంత్ ను పీసీసీ పీఠం ఎక్కనీయకుండా సీనియర్లు అడ్డుపడుతున్నారు. ప్రజల తీర్పు ఇలా ఉంది మరి ఈ పీఠాన్ని అధిష్టానం ఎవరికి ఇస్తుందనేది వేచిచూడాల్సిందే..