Begin typing your search above and press return to search.

కరోనా ముగిసిపోలేదు : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

By:  Tupaki Desk   |   30 Jun 2022 11:16 AM GMT
కరోనా ముగిసిపోలేదు : డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
X
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచాన్ని మరోసారి కలవర పెట్టేందుకు ఈసారి కరోనా.. వివిధ రూపాల్లో రూపాంతరం చెంది మరీ వస్తుంది. తాజాగా ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

కరోనా మహమ్మారి మార్పు చెందుతోందని.. ఇంకా ముగిసి పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరోసారి ప్రపంచాన్ని గడగడ లాడించడానికి సిద్ధమైందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. కొత్త కేసుల రిపోర్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడంతో వైరస్ ను ట్రాక్ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీనివల్ల ఒమిక్రాన్ ను గుర్తించడం, భవిష్యత్ వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోందని వివరించింది.

బీఏ.4, బీఏ.5 సబ్‌ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. అన్ని దేశాలూ తమ జనాభాలో 70 శాతం మందికి టీకా వేయాలని సూచించినట్లు తెలిపారు. 18 నెలల్లో 12 బిలియన్ల టీకాలు పంపిణీ అయ్యాయని చెప్పారు. కానీ అల్పాదాయ దేశాల్లో మాత్రం ఇంకా అర్హులకు టీకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

టీకా పంపిణీలో 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. పేద దేశాల్లో దీన్ని సాధించడం కష్టమని కొందరంటున్నారని. ఈ సమయంలో వైరస్ నిరంతర వ్యాప్తి గురించి ఆందోళనగా ఉందని పేర్కొంది. పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు కరోనా నుంచి మరింత ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.

మరోవైపు భారత్‌లో ఈ ఏడాది ప్రారంభంలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కాస్త ఆందోళనకు గురిచేసినా.. ప్రమాదకరంగా మాత్రం మారలేదు. తర్వాత సబ్ వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా మళ్లీ కరోనా కోరలు చాస్తోంది.

తాజాగా 19 వేలకు చేరువగా కొత్త కేసులు వచ్చాయి. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమించాయి. నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ మహమ్మారి మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నాయి.