Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు అరుదైన గౌర‌వం... జ‌పాన్ ఆహ్వానం

By:  Tupaki Desk   |   30 July 2019 2:50 PM GMT
జ‌గ‌న్‌ కు అరుదైన గౌర‌వం... జ‌పాన్ ఆహ్వానం
X
ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అరుదైన గౌర‌వం ల‌భించింది. జ‌పాన్ ప్ర‌భుత్వం నుంచి ఆయ‌నకు ఆ దేశంలో ప‌ర్య‌టించాల్సిందిగా ఆహ్వానం అందింది. జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరో ఉచియామ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భాగస్వామ్యం ఉండాలని ఉభ‌యులు ఆకాంక్షించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఏపీలో జ‌పాన్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌స్తే భూములు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఉన్న ఆవ‌శ్య‌క‌త‌ను ఉచియామ‌కు వివ‌రించిన జ‌గ‌న్ ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌- ఔషధ తయారీ పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే భూముల కేటాయింపుతో పాటు ఇత‌ర‌త్రా రాయితీలు కూడా ఇస్తామ‌న్నారు. ఏపీలో ర‌వాణా రంగంలో వినూత్న‌మైన మార్పుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని... ప్ర‌స్తుతం ఉన్న బ‌స్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.

అభివృద్ధిలో ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న నిలిచిన జ‌పాన్‌ లో అత్యాధునిక పోర్టులు, మౌలిక వసతులు, నైపుణ్య వనరులు అందుబాటులో ఉన్నాయ‌ని... ఈ రంగాల్లో ఎంతో నైపుణ్యం ఉన్న జ‌పాన్ కంపెనీల‌కు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంద‌ని కూడా జ‌గ‌న్ ఆ దేశ ప్ర‌తినిధుల‌కు సూచించారు. ఇదే క్ర‌మంలో శీతల నిల్వకేంద్రాలు, గోదాములు, అగ్రిల్యాబ్‌ లు, ఇతర పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని కోరారు.

కొత్త‌గా ఉన్న పెట్టుబడుల ప్రోత్సాహక, పర్యవేక్షణ విధానం ద్వారా పారిశ్రామిక పెట్టుబడుల నుంచి ఉత్పత్తి వరకూ పూర్తిస్థాయిలో సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పారదర్శకతతో పెట్టుబడులను ఆహ్వానిస్తే భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని కూడా చెప్పారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే రిజర్వేషన్‌ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ క్ర‌మంలోనే జపాన్‌లో పర్యటించవలసిందిగా కొజిరో ఉచియామ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు.

రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్‌ మరియు రీసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌పాన్ నుంచి ఈ రంగాల్లో పెట్టుబ‌డులు పెరిగితే స్థానికంగా యువ‌త‌కు భారీ ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భ్య‌మ‌వుతాయి. జ‌గ‌న్ సీఎం అయిన రెండు నెల‌ల‌కే జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశం నుంచి పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖంగా ఉన్న సంకేతాలు రావ‌డం ఏపీకి శుభ‌సూచిక‌మే.