Begin typing your search above and press return to search.

తాలిబన్లకే వణుకు పుట్టించే అహ్మద్ షా మసూద్ ఎవరు? పంజ్ షిర్ ఎక్కడుంది?

By:  Tupaki Desk   |   22 Aug 2021 4:08 AM GMT
తాలిబన్లకే వణుకు పుట్టించే అహ్మద్ షా మసూద్ ఎవరు? పంజ్ షిర్ ఎక్కడుంది?
X
తాలిబన్లు పేరు చెబితేనే కోట్లాది అఫ్గాన్లు భయంతో వణుకుతారు. వారి రాక్షస పాలనను గుర్తు చేసుకొని భయానికి గురవుతారు. అలాంటి తాలిబన్లకే భయం పుట్టేలా చేస్తుంది పంజ్ షిర్. అఫ్గాన్ ప్రభుత్వాన్నికూలదోసి.. ఒక్కో ప్రావిన్సును తమ సొంతం చేసుకొని.. గత వారంలో రాజధాని కాబూల్ లోనూ తాలిబన్లు తమ జెండాను ఎగురవేయటం తెలిసిందే. ఇలా.. తాము అడుగుపెట్టిన ప్రతిప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునే తాలిబన్లకు.. పంజ్ షిర్ ప్రావిన్సు మాత్రం ఒక పట్టాన కొరుకుడు పడటం లేదు.

హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబూల్ కు ఉత్తరాన 150 కిలోమీటర్లదూరంలో ఉంటుంది పంజ్ షిర్ ప్రావిన్సు. ఇక్కడి జనాభా దాదాపు లక్ష మంది వరకు ఉంటారు. వీరిలో అత్యధికం తజిక్ జాతికి చెందిన ప్రజలే ఉంటారు. వీరి ప్రత్యేకత ఏమంటే.. వీరందరిలో తెగింపు చాలా ఎక్కువ. ఇదే తాలిబన్లకు చుక్కలు కనిపించేలా.. ఒక పట్టాన అంతుచిక్కనిది మారింది. ఈ ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకంలో పంజ్ షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు.

1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంతంగా పోరాటం జరిపిన ప్రముఖుల్లో అహ్మద్ షా కీలక భూమిక పోషించారు. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు మిలటరీ కమాండర్ కూడా. ఇది మరింత కలిసి వచ్చేలా చేసింది. ఆయన్ను దెబ్బ తీసేందుకు తాలిబన్లు.. అల్ ఖైదా భారీ పథకాన్ని అమలు చేసింది. తాలిబన్లు.. అల్ ఖైదాకు చెందిన కొందరు నకిలీ విలేకరుల అవతారం ఎత్తి.. మీడియా ఇంటర్వ్యూ చేసినట్లుగా ప్లాన్ చేసి.. ఆ సందర్భంలో ఆయనపై ఆత్మాహుతి దాడి చేయటంతో ప్రాణాలు విడిచారు. ఇదంతా 2001లో చోటు చేసుకుంది.

ఆయన మరణానికి ముందు యూరప్ ను సందర్శించిన ఆయన తాలిబన్లకు పాక్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలని యూరోపియన్ నేతల్ని కోరారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్లు భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పేర్కొన్నారు. ఇప్పుడు అదే అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ (32) తన పంజ్ షిర్ లోయ నుంచి తాలిబన్లకు సవాలు విసురుతున్నారు.

తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని శపథం చేసిన అతడు.. అందుకు తగ్గట్లే అఫ్గాన్ లోని పలువురు మిలిటరీ సభ్యులు.. కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతోకలిసి పోరాడుతున్నారు. తాలిబన్ల తమపై దాడి చేస్తే.. తీవ్రమైన ప్రతిఘటన తప్పదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే.. తనకు అమెరికా.. బ్రిటన్.. ఫ్రాన్స్.. మద్దతు ఇచ్చి.. అవసరమైన వాటిని అందించాలని ఆయన కోరుతున్నారు. తాలిబన్లను కంట్రోల్ చేయటానికి ఇతగాడి అవసరం ప్రపంచానికి ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. అగ్రరాజ్యాలు ఆయన వినతిని ఎలా రిసీవ్ చేసుకుంటాయో చూడాలి.