Begin typing your search above and press return to search.

ఎంవీవీ వెనక ఎవరున్నారు.... పొలిటికల్ రూటు ఎటువైపు...?

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:23 AM GMT
ఎంవీవీ వెనక ఎవరున్నారు.... పొలిటికల్ రూటు ఎటువైపు...?
X
ఆయన 2018 జూలై వరకూ వైసీపీకి సంబంధం లేని వ్యక్తిగానే ఉన్నారు. గోదావరి జిల్లాలలో జగన్ పాదయాత్ర జరుగుతూంటే వెళ్ళి కలిశారు. ఆ మీదట సడెన్ గా వైసీపీలో చేరారు. పట్టు మంది పది నెలలు తిరగకుండా లక్కీగా విశాఖ లాంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటుకు నెగ్గి పార్లమెంట్ లో ప్రవేశించారు. ఆయనే ఎంవీవీ సత్యనారాయణ. ఆయన రాజకీయాల్లోకి రాకముందు బిల్డర్ గా ఉంటూ వచ్చారు. అలాగే చిన్న సినిమాల నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉన్నా వైసీపీ ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మూడున్నరేళ్ల ఎంపీగా ఆయన విశాఖకు ఏం చేశారంటే జవాబు నిరాశతోనే వస్తుంది. విశాఖకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నా ఆయన ఎంపీగా తన వరకూ పెద్దగా ఏమీ చేయలేదని ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తాయి. ఇక వైసీపీ చేయించిన సొంత సర్వేలలో కూడా ఆయన మళ్లీ గెలవడం కష్టమన్న నివేదికలు వచ్చాయట.

అదే విధంగా చూస్తే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కూడా విపక్షాలు విమర్శలు అప్పట్లో చేశాయి. అవన్నీ కూడా అధినాయ‌కత్వం జాగ్రత్తగా గమనిస్తోంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈసారి ఆయనకు టికెట్ కష్టమే అని అంటున్నారు. ఇక ఎంపీకి కూడా 2019లో జనసేన పుణ్యమాని నాలుగు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచాను అన్నది తెలుసు. అందుకే ఆయన విశాఖ సిటీలో తూర్పు నియోజకవర్గం మీద ఫోకస్ పెడుతున్నారు.

తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన హై కమాండ్ ని కోరుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డితో మొదటి నుంచి విభేదాలు ఉన్నాయని అంటారు. విశాఖలో ఏం జరిగినా విజయసాయిరెడ్డి పెత్తనమే ఎక్కువగా ఉందని, ప్రజల నుంచి గెలిచిన తనకు విలువ లేదని ఆయన మధనపడిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు.

ఇక తనతో సరిగ్గా లేరని ఎంపీ మీద విజయసాయిరెడ్డికి ఎక్కడో గుర్రు ఉందని కూడా చెప్పుకుంటారు. మొత్తానికి విశాఖ పార్టీ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నంతవరకూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. మరో విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారన్న విషయాలను టీడీపీ అనుకూల మీడియాకు సమాచారం ఎంపీ గారే ఇస్తున్నారు అని సాయిరెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నారు.

దాంతో ఇద్దరు మధ్య రాజకీయ రచ్చ అలా సాగుతోంది. ఇపుడు అది బయటపడిపోయింది. పేరు ఎత్తకుండా విజయసాయిరెడ్డి కూర్మన్నపాలెంలో ఎంవీవీ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద విమర్శలు చేశారు. దాంతో మండిన ఎంవీవీ ఆయన మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ విజయసాయిరెడ్డి ఫ్యామిలీ విశాఖలో భూములు బాగా కొన్నదని అసలు గుట్టు విప్పారు.

నిజానికి ఎంవీవీ విశాఖలోనే ప్రెస్ మీట్ పెట్టి పూర్తి ఆధారాలతో భూ దందాను బయటపెడతాను అని ఆవేశపడుతూంటే విషయం తెలిసిన అధినాయకత్వం ఆయన్ని వెనక్కి తగ్గమని చెప్పి తమ వద్దకు పిలిపించుకుందని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంవీవీ వివాదంలో హై కమాండ్ ఎటు వైపు ఉంటుంది అన్నదే చర్చగా ఉంది.

ఎంపీగా ఎంవీవీకి ఈసారి టికెట్ అయితే దక్కదు. ఆయన కోరుతున్నట్లుగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే చాన్స్ ఉందా అని ఇన్నాళ్ళూ డౌట్లు ఉండేవి. ఇపుడు అయితే ఆయన్ని పూర్తిగా పక్కన పెడతారు అనే అంటున్నారు. ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నా టీడీపీ వారితో మంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు అని వైసీపీ పెద్దలు చాలా కాలంగా అనుమానిస్తున్నారుట. ఇక విజయసాయిరెడ్డి విష‌యంలో ఆయన మీడియాకు ఎక్కడంతో ఇపుడు ఆయన విషయంలో సైలెంట్ గా ఉన్న సరైన సమయం చూసి పక్కన పెడతారు అని అంటున్నారు.

మరో వైపు ఆయన కూడా తన రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకునే విజయసాయిరెడ్డి మీద కామెంట్స్ చేశారు అని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఆయన చూపు టీడీపీ మీద ఉండవచ్చు అని కూడా అంటున్నారు. ఆయనకు ఇప్పటికే టీడీపీకి చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యేతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు.

మొత్తానికి విజయసాయిరెడ్డి మీద ఈ రకంగా ఎంవీవీ ఫైర్ అవడం వెనక టీడీపీ వారి హస్తం ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తూంటే వైసీపీలోనే విజయసాయిరెడ్డి అంటే పడని వారే ఎంపీ చేత ఇలా కామెంట్స్ చేయించారు అని మరో ప్రచారం సాగుతోంది. వీటి సంగతి పక్కన పెడితే విజయసాయిరెడ్డి విషయంలో హై కమాండ్ ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలియదు కానీ ఎంవీవీకి మాత్రం కచ్చితంగా ఈసారి వైసీపీ టికెట్ దక్కదనే అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.