Begin typing your search above and press return to search.

హుజూరాబాద్‌లో కారు డ్రైవ‌ర్ ఎవ‌రో?

By:  Tupaki Desk   |   15 July 2021 2:59 AM GMT
హుజూరాబాద్‌లో కారు డ్రైవ‌ర్ ఎవ‌రో?
X
2014లో అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా నిలిచిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఏ ఎన్నిక‌ల్లోనైనా విజ‌యం త‌ప్ప ఓట‌మి తెలీద‌నే అతి విశ్వాసం ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ నాయ‌కుల‌కు 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దారుణ‌మైన దెబ్బ త‌గిలింది. ఆ త‌ర్వాత కేసీఆర్ నియంతృత్వ పాల‌న ప‌ట్ల విసుగు చెందిన ప్ర‌జ‌లు అధికార మార్పిడి కోరుకుంటున్నార‌నే విష‌యం దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంద‌ని రాజకీయ వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ త‌ర్వాత సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలిచిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు క్ర‌మంగా వ్య‌తిరేకంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రంలో ఎంతో శ‌క్తిమంత‌మైన ఆ పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో నిల‌బెట్టేందుకు అభ్య‌ర్థి దొర‌క‌క‌పోవ‌డమే అందుకు నిద‌ర్శ‌నం.

మొద‌టి నుంచి టీఆర్ఎస్‌తోనే ఉండి ఉద్య‌మంలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన ఈటెల రాజేంద‌ర్‌పై భూక‌బ్జా కోరు అనే ముద్ర వేసి మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించి పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆయ‌న బీజేపీలో చేరారు. దీంతో ఆయ‌న రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. రోజుకొక‌రి పేరు వినిపిస్తూనే ఉంది. బీజేపీ నుంచి పోటీ చేయ‌డం ఖాయ‌మైన ఈటెల‌.. టీఆర్ఎస్ త‌ర‌పున త‌మ మీద పోటీ చేసేందుకు ద‌మ్మున్న అభ్య‌ర్థులే లేర‌ని చేసిన స‌వాల్‌కు ఆ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం ఇవ్వ‌లేక‌పోతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్ అక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో అందుకు స‌రైన అభ్య‌ర్థిని ఎంచుకునే విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. బ‌ల‌మైన బీసీ నేత కావ‌డంతో ర‌మ‌ణ‌ను టీడీపీ నుంచి లాక్కొని కారెక్కించుకున్నారు. దీంతో హుజూరాబాద్‌లో ఆయ‌న‌ను పోటీగా నిలిపే అవ‌కాశాలున్న‌ట్లు వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ త‌న కూతురు క‌విత‌ను వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి పోటీ చేయించేందుకు వీలుగా అక్క‌డ బ‌ల‌మున్న ర‌మ‌ణ‌ను పార్టీలోకి తీసుకున్నార‌ని, ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి మాత్ర‌మే క‌ట్ట‌బెట్టే ఛాన్సుంద‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. ఇక టీఆర్ఎస్ టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని, ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్‌రెడ్డి మాట్లాడిన కాల్ లీక్ సంచ‌ల‌నంగా మారింది. దీంతో కౌశిక్ వైపు టీఆర్ఎస్ మొగ్గుచూపుతుందా అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల ఆ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా కౌశిక్‌తో కేటీఆర్ మాట్లాడ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్పుడు ఆ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్ త్వ‌ర‌లోనే గులాబీ కండువా క‌ప్పుకోనున్నారు.

హుజూరాబాద్‌లో ఏ అభ్య‌ర్థిని నిల‌బెడితే విజ‌యం ద‌క్కుతుందోన‌ని ర‌హ‌స్యంగా స‌ర్వేలు చేయిస్తున్న కేసీఆర్ ఆ కార‌ణంతోనే ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంపై ఓ నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నార‌నే అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి. టీఆర్ఎస్‌కు హుజూరాబాద్‌లో తిరుగే లేదు. అక్క‌డ ఈటెల గెలుస్తూనే వ‌చ్చారు. కానీ ఇప్పుడు ఆయ‌న బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తుండ‌డంతో ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకునేందుకు కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే మంత్రుల‌ను, ఇత‌ర నాయ‌కుల‌ను హుజూరాబాద్‌లో దింపిన ఆయ‌న అక్క‌డి స్థానిక నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉన్నారు. అయితే ఉద్య‌మ పురిటి గ‌డ్డ హుజూరాబాద్‌లో ద్వితీయ శ్రేణి రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎద‌గ‌కుండా చేయ‌డం ఆ పార్టీకి మైన‌స్‌గా మారింది. బీజేపీ నుంచి పెద్దిరెడ్డిని లాగే ప్ర‌య‌త్నంతో పాటు హుస్నాబాద్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్‌రెడ్డిపై కేసీఆర్ ఆస‌క్తి చూపార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఇక టీఆర్ఎస్‌కు చెందిన ప్ర‌ణాళిక‌ సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌, కెప్టెన్ ల‌క్ష్మీకాంత్ రావు, క‌డియం శ్రీహ‌రి, టీఆర్ఎస్‌వీ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ల పేర్ల పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్‌లో చేర్చుకున్న టీడీపీ దివంగ‌త నేత దామోద‌ర్‌రెడ్డి కొడుకు క‌శ్య‌ప్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి.