Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఎవరి వాడు....ఆయన కోసం కొట్లాట...?

By:  Tupaki Desk   |   23 Aug 2022 1:30 PM GMT
మెగాస్టార్ ఎవరి వాడు....ఆయన కోసం కొట్లాట...?
X
మెగాస్టార్ చిరంజీవి అందరివాడు. ఆయన ఆ పేరుతో ఒక సినిమా కూడా తీశారు. రాజకీయాల్లోకి వచ్చాక కొందరివాడుగా మార్చాలని చూసినా ఆయన మనసుకు అది గిట్టక స్వస్తి అనేశారు. తిరిగి సినిమాలు చేసుకుంటూ తాను మొత్తం కోట్లాది ప్రజల మనిషిని అని చెప్పుకుంటున్నారు. ఒక విధంగా రాజకీయం నీడ కూడా తనకు అంటకూడదన్న పట్టుదల ఆయనలో కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, కొన్నాళ్ళు ఉన్నారు, వెళ్లారు. అయితే రాజకీయాల పోకడలను చూసి విసిగిపోయారు. అందుకే ఆయన రాం రాం అనేశారు.

అందుకే తన ఇంట్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టినా చిరంజీవి ఆ ఛాయలకు కూడా పోవడంలేదు. అదే టైమ్ లో ఆయన టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోగా దాదాపు అయిదు దశాబ్దాల అనుబంధం పెనవేసుకున్న ప్రముఖునిగా పద్మ విభూషణ్ పౌర పురస్కారం అందుకున్న మేటి నటుడిగా ప్రభుత్వ కార్యక్రమాలకు వారి పిలుపు మేరకు అటెండ్ అవుతున్నారు. అక్కడ ఉన్నది ఏ పార్టీ ప్రభుత్వం అన్నది చిరంజీవికి పట్టని విషయం. ఆయన సినీ ప్రముఖుడిగానే పాలుపంచుకుంటున్నారు. తనను గౌరవంగా పిలిచిన వారిని అంతే గౌరవంతో వెళ్ళి తన పేరు నిలబెట్టుకుంటున్నారు.

ఆ క్రమంలో ఆయన ఏపీ సర్కార్ తోనూ కలసి కొన్ని సమావేశాల్లో కనిపించారు. ముఖ్యంగా తెలుగు సినిమా సమస్యల మీద ఆయన ముఖ్యమంత్రి జగన్ తో చర్చలలో పాలుపంచుకున్నారు. దానికంటే ముందు జగన్ ఆయన్ని సమాదరించి ఇంటికి పిలిచి విందు కూడా ఇచ్చారు. ఎపుడు వచ్చినా అన్నా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళు అని ఓపెన్ ఆఫరే జగన్ ఇచ్చారని నేరుగా చిరంజీవే మీడియా ముఖంగా చెప్పుకున్నారు. అంత మాత్రాన ఆయన వైసీపీ వైపు వెళ్లినట్లు కాదు.

ఆయనకు వైసీపీ రాజ్యసభ ఆఫర్ చేసిందని కూడా ప్రచారం జరిగినా వెంటనే చిరంజీవి ఖండించారు. ఇక ఆయన్ని అల్లూరి 125వ జయంతి వేడుకలకు భీమవరానికి పిలిపించి ప్రధాని మోడీ కూడా చనువుగా మాట్లాడారు. ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఇవ్వాలనుకున్నారని టాక్ నడిచింది. అయినా సరే చిరంజీవి సున్నితంగా తిరస్కరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఒక విధంగా చిరంజీవి కోరుకుంటే పదవులు ఇచ్చేందుకు పార్టీలు రెడీ. కానీ ఆయన పాలిటిక్స్ కి బ‌హు దూరం.

ఈ విషయం ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అయితే చిరంజీవిని తమ కార్యక్రమాలకు పిలిచి ఆయన మావాడు అని ఆయా పార్టీలు చెప్పుకుంటే అది ఆయన తప్పు కాదు. అలాగే చిరంజీవి ఏ కార్యక్రమాలకు వెళ్లకూడదు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎవరేమనుకున్నా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద సెలిబ్రిటీ. ఈ రోజు దాకా ఆయన తన కీర్తిని ఒక్కో మెట్టూ పెంచుకుంటూ వెళ్తున్నారే తప్ప ఎక్కడా తగ్గలేదు. మరి అలాంటి చిరంజీవిని కేవలం రాజకీయ చట్రంలోనే బిగించాలని చూస్తే అంత కంటే పొరపాటు ఉండదు.

ఇక జనసేన సంగతి చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆ పార్టీకి ఎంతో ఉన్నా మెగాస్టార్ కూడా ఒక చేయి వేస్తే ఏపీలో ఆ పార్టీ దున్నేయడం ఖాయం. కానీ చిరంజీవి రాజకీయాల ఊసే వద్దు అనుకునే వారు కాబట్టి జనసేన విషయంలో ఏ రకంగానూ బాహాటంగా మాట్లాడే సీన్ ఉండదు. అదే టైమ్ లో జనసేనకు సిసలైన వైరి పక్షంగా ఉన్న వైసీపీ కార్యక్రమాలలో మెగాస్టార్ కలసి కనిపించడం తమ్ముడు పార్టీ వారికి చాలా బాధగా ఉంటోంది. దానికి తోడు వైసీపీ వారంతా అన్న మంచివాడు, తమ్ముడే తేడా అంటూ చేస్తున్న కామెంట్స్ కూడా తెగ బాధపెడుతున్నాయి.

ఇంకో వైపు చూస్తే చిరంజీవి పవన్ తో పబ్లిక్ గా కనిపించడం లేదు కానీ జగన్ తో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీని వల్ల వేరే రకమైన సంకేతాలు జనాల్లోకి వెళ్తాయేమో అని కలవరపడుతున్న జనసేన చిరంజీవిని జగన్ అవమానించాడని చెబుతోంది. సమయం సందర్భం లేకపోయినా పవన్ పదే పదే తన అన్న జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు అని చెప్పడం ద్వారా జగన్ అహంకారాన్ని ఎక్స్ పోజ్ చేస్తున్నాను అనుకుంటున్నారే కానీ తన అన్నను కోరి ఇబ్బంది పెడుతున్నానని ఆలోచించలేకపోతున్నారు.

ఆ విధంగా మాట్లాడడం ద్వారా మెగాభిమానులలోజగన్ మీద ఏమైనా సానుకూలత ఉంటే తుడిచిపెట్టాలని, వారంతా జనసేన వైపే రావలన్నది ఆ పార్టీ ఎత్తుగడ కావచ్చు. కానీ అక్కడ ఉన్నది మెగాస్టార్. ఆయన ఇమేజ్. దాన్ని మరచిపోయి వరసబెట్టి చేస్తున్న ఈ తరహా కామెంట్స్ అన్నయ్యకు ఎంత మేర ట్రబుల్ ఇస్తున్నాయన్నది జనసేనాని ఆలోచించుకోకపోవడమే ఇక్కడ విచిత్రం.

మరో వైపు చూస్తే మెగాస్టార్ ని ఇప్పటికే సొంతం అనుకుంటున్న వైసీపీ వారు నాలుగాకులు ఎక్కువ చదివేశారు. అందుకే మంత్రులు గుడివాడ అమరనాధ్, దాడిశెట్టి రాజా వంటి వారు చిరంజీవి మావాడే. పవనే చంద్రబాబు పక్షం అని రివర్స్ అటాక్ చేస్తున్నారు. మెగాస్టార్ ని ఏమైనా అంటే మేము బాధపడతామని ఆయన తమ్ముడైన పవన్ మీద విరుచుకుపడుతున్నారు. అంటే అన్న వేరు తమ్ముడు వేరు అని మెగాభిమానులకు సందేశం పంపడమే ఇక్కడ వైసీపీ వ్యూహం.

ఇలా మెగాస్టార్ ని మధ్యన పెట్టి ఆయన కోసం అటు జనసేన ఇటు వైసీపీ సాగిస్తున్న మాటల యుద్ధం వల్ల మధ్యలో నలుగుతోంది మాత్రం చిరంజీవే అంటున్నారు. ఆయనకు రాజకీయాలు ఇష్టం లేకపోయినా తమ పక్కన ఉంచుకోవాలన్న తాపత్రయంతో అటూ ఇటూ సాగుతున్న ఈ పోరులో మెగాస్టార్ కే బిగ్ ట్రబుల్స్ ఇస్తున్నారు.

ముందుగా ఈ విషయం జనసేనాని మెగాస్టార్ తమ్ముడు అయిన పవనే గుర్తెరగాలి. అన్న గారిని రాజకీయాల్లో పెట్టే వ్యూహాలకు ఇకనైనా చెక్ పెట్టాల్సి ఉంది. అలా కనుక చేయకపోతే ఈ కధ ఎంత దూరం అయినా పోతుంది. ఒక విధంగా ఈ మొత్తం మాటల యుద్ధంలో మెగాస్టార్ మౌనం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిని కోరి కల్పించారు అని కూడా అంటున్నారు. ఆయన కనుక నోరు విప్పితే ఈ రాజకీయ ఆటలకు శాశ్వతంగా చెక్ పడుతుంది అని కూడా అంటున్నారు.