Begin typing your search above and press return to search.

దేవినేని.. వల్లభనేని.. నెక్స్ట్ చింతమనేనేనా?

By:  Tupaki Desk   |   16 Nov 2019 9:28 AM GMT
దేవినేని.. వల్లభనేని.. నెక్స్ట్ చింతమనేనేనా?
X
వైసీపీలోకి టీడీపీ నాయకుల వలసలు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కోర్ కమ్యూనిటీకి చెందిన నాయకులు ఇటీవల వైసీపిక జై కొడుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకులే కాకుండా చంద్రబాబునాయుడు సొంత సామాజికవర్గానికి చెందిన నాయకులూ రీసెంటుగా వైసీపీకి జై కొట్టారు.

గుడివాడలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన దేవినేని అవినాశ్ పార్టీకి, పార్టీ అనుబంధ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మరో నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన్ను పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆయన అధికారికంగా ఇంకా వైసీపీలో చేరకపోయినప్పటికీ తన మద్దతు ఆ పార్టీకేనని స్పష్టం చేశారు.

దేవినేని, వల్లభనేని ఇద్దరూ టీడీపీ కోర్ కమ్యూనిటీకి చెందిన నేతలే. త్వరలో కోర్ కమ్యూనిటీకి చెందిన మరో నేత కూడా వైసీపీలో చేరుతారన్న అనూహ్య ప్రచారం మొదలైంది. ఆయనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్. గత 67 రోజులుగా జైలులో ఉండి ఈ రోజే విడుదలైన చింతమనేనికి ప్రస్తుతానికి బెయిలొచ్చినా ఆయనపై ఇంకా రెండు వారెంట్లు ఇంకా పెండింగులో ఉన్నాయి. పైగా అనేక కేసులు ఉండడం.. వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఆది నుంచి టార్గెట్ చేయడంతో ఆయన ఇప్పటికే నీరుగారిపోయినట్లు తెలుస్తోంది.

చింతమనేని జైలు నుంచి బయటకు వచ్చాక వైసీపీపై రివెంజ్ తీర్చుకుంటారని.. ఆయన అనూహ్యమైన స్టెప్స్ వేస్తారని టీడీపీ నాయకులు చెబుతున్నప్పటికీ ఆయన అనుచరవర్గం నుంచి మాత్రం భిన్నమైన మాట వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్ల కాలంలోనే రెండు నెలలు జైలులో పెట్టారంటే మిగతా నాలుగేళ్లు మరింత దారుణంగా ఉంటుందని చింతమనేని అన్నట్లుగా సమాచారం. దేవినేని, వల్లభనేని తరహాలోనే వైసీపీకి జై కొడితే తాత్కాలికంగా కష్టాలు తప్పించుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పైగా.. చింతమనేని జైలులో ఉన్నప్పుడే ఆయన్ను వల్లభనేని వంశీ కలిశారు. ఆ తరువాత వంశీ టీడీపీ నుంచి వైసీపీకి ఫిరాయించారు. చింతమనేని కూడా అదే దారి పట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.