Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ కు ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు? దిక్కుతోచ‌ని క‌మ‌లం పార్టీ?

By:  Tupaki Desk   |   10 Jan 2020 2:30 PM GMT
కేజ్రీవాల్ కు ప్ర‌త్య‌ర్థి ఎవ‌రు? దిక్కుతోచ‌ని క‌మ‌లం పార్టీ?
X
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎవ‌రిని ప్ర‌క‌టిస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏదైనా రాష్ట్రంలో జాతీయ పార్టీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం రివాజు. ప్రాంతీయ పార్టీల్లో అయితే ఆ పార్టీల అధినేతే సీఎం అభ్య‌ర్థిగా ఉంటారు. జాతీయ పార్టీల్లో మాత్రం అంతా పై నుంచి వ‌చ్చే ఆదేశాల మీదే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇలాంటి క్ర‌మంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సీఎం అభ్య‌ర్థులు ఎవ‌ర‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది.

ఆమ్ ఆద్మీ పార్టీకి య‌థారీతిన కేజ్రీవాలే సీఎం క్యాండిడేట్ గా ఉంటారు. ఇక బీజేపీకి మాత్రం ప్ర‌త్యామ్నాయం దొర‌క‌డం లేదు. కేజ్రీవాల్ ను ఢీ కొట్ట‌గ‌ల సీఎం అభ్య‌ర్థి ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిస్థితిని ఆ పార్టీ వాళ్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నారు కానీ.. మోడీనే కేజ్రీవాల్ కు ధీటైన నేత అని క‌మ‌లం పార్టీ వాళ్లు అంటున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి హోదాలోని మోడీనే.. కేజ్రీవాల్ ను ఎదుర్కొంటార‌న్న‌ట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్ర‌ధాని హోదాలోని వ్య‌క్తి స‌ద‌రు పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌వ‌చ్చు. త‌న పార్టీ త‌ర‌ఫున జ‌నాల్లోకి వెళ్లొచ్చు. అయితే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి మాత్రం కాలేడు క‌దా. అయితే బీజేపీ మోడీ మీదే ఆశ‌లుపెట్టుకుంది.

వేరే ఎవ‌రినైనా సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే.. ఎన్ని ఓట్లు ప‌డ‌తాయో, అధికారం ద‌క్కుతుందో లేదో తెలియ‌దు. మోడీనే అంతా తానైతే క‌మ‌లం పార్టీ గెలుస్తుంద‌నేది వారి ఆశ‌లాగా క‌నిపిస్తూ ఉంది. కానీ సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క‌పోతే కేజ్రీవాల్ దాన్ని కూడా ఉప‌యోగించుకుంటారు. సీఎం క్యాండిడేట్ ఎవ‌రో కూడా తెలియ‌ని బీజేపీకి ఓటేస్తారా, త‌న‌కు ఓటేస్తారా.. ఆయ‌న ప్ర‌చారం చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. బీజేపీ త‌ర‌ఫు నుంచి మ‌నోజ్ తివారీ పేరు సీఎం క్యాండిడేట్ గా వినిపిస్తూ ఉంది. అయితే అందుకు అధికారిక ధ్రువీక‌రణ లేదు. బీజేపీ నేత‌ల తాజా మాట‌ల‌ను బ‌ట్టి అక్క‌డ ఆ పార్టీకి సీఎం అభ్య‌ర్థే ఉండ‌ర‌నే అభిప్రాయాలు ఏర్ప‌డుతూ ఉన్నాయి.