Begin typing your search above and press return to search.

ఈట‌ల రాజేంద‌ర్ తో అయ్యేది లేదు.. స‌చ్చేది లేదుః కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 July 2021 4:14 AM GMT
ఈట‌ల రాజేంద‌ర్ తో అయ్యేది లేదు.. స‌చ్చేది లేదుః కేసీఆర్‌
X
హుజూరాబాద్ ఎన్నిక‌ల ముంగిట రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌కం ‘దళిత బంధు’. ఈ ప‌థ‌కం నిర్వ‌హణ, తీరుతెన్నుల‌పై చ‌ర్చించేందుకు 26వ తేదీన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామానికి న‌లుగురు చొప్పున ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కేసీఆర్ ఫోన్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌మ్మికుంట మండ‌లం త‌నుగుల గ్రామానికి చెందిన ఎంపీటీసీ భ‌ర్త వాసాల రామ‌స్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈట‌ల‌పై వ్యాఖ్య‌లు చేశారు.

ఎంపీటీసీ భ‌ర్త‌కు ఫోన్ చేసిన కేసీఆర్ ‘‘రామస్వామి గారూ బాగున్నారు కదా.. ఒక రిక్వెస్టు.. ప్ర‌భుత్వం తీసుకున్న దళిత బంధు విజ‌యం మీద తెలంగాణ ద‌ళిత జాతి భ‌విష్య‌త్ మొత్తం ఆధార‌ప‌డి ఉంది. చాలా బాధ్య‌త‌తో, ఓపిక‌తో, ఒక దృక్ప‌థంతో చేసే ప‌ని ఇది. జిల్లా క‌లెక్ట‌ర్ మీకు ఫోన్ చేస్తారు. రేపు క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో 26వ తేదీ కార్య‌క్ర‌మం గురించి మీకు అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. ఆ రోజు అన్ని మండ‌లాల నుంచి గ్రామానికి ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఇద్ద‌రు పురుషుల చొప్పున బ‌స్సుల్లో హైద‌రాబాద్ కు వ‌స్తారు. ఆ రోజంతా ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి సంపూర్ణంగా చ‌ర్చిస్తాం. దీన్ని గొప్ప‌గా ముందుకు తీసుకుపోవాలి. హుజూరాబాద్ త‌ర్వాత మీరు రాష్ట్ర‌మంతా పోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లో దీన్ని స‌క్సెస్ చేసి దేశానికే ఆద‌ర్శంగా నిలుద్దాం’’ అని అన్నారు కేసీఆర్.

ఈ క్ర‌మంలోనే ఎంపీటీసీ మాట్లాడుతూ.. ‘‘సార్ మీ నాయకత్వంలో 2001 నుంచి నేను పనిచేస్తున్నాను. కానీ.. ఈటల రాజేందర్ నన్నెప్పుడూ పక్కన పెడుతూ వచ్చాడు. 2018లో కూడా నాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాను. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఆయ‌న ద‌గ్గ‌రికి పోలేదు’’ అని అన్నారు. దీనికి స్పందించిన కేసీఆర్ ‘‘ ఈట‌ల రాజేంద‌ర్ చాలా చిన్నోడు.. ఆయ‌న‌తోని అయ్యేది లేదు స‌చ్చేది లేదు. ఆ ఆ విష‌యం విడిచిపెట్టండి. ద‌ళిత బంధు చాలా పెద్ద మిష‌న్‌. నిబ‌ద్ధ‌త‌తో, మొండిప‌ట్టుతో దీన్ని చేసి చూపిద్దాం. ప్రాణం పోయినా వెన‌క్కి త‌గ్గే ముచ్చ‌ట లేదు’’ అని కేసీఆర్‌చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం ఈ విష‌యం వైర‌ల్ అవుతోంది. అయితే.. ఈ ప‌థ‌కంపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కేవ‌లం ఎన్నిక‌ల్లో గెలిచేందుకే ద‌ళిత బంధును ప‌ట్టుకొచ్చార‌ని అంటున్నాయి. ఇదికూడా.. కేవ‌లం హుజూరాబాద్ వ‌ర‌కే ప‌రిమితం అవుతుంద‌ని, రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డం ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని అంటున్నాయి.