Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడెవ‌రు?

By:  Tupaki Desk   |   20 Aug 2022 12:34 PM GMT
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడెవ‌రు?
X
వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్య‌క్షుడుగా ఎవ‌రు ఎంపిక‌వుతారనేదానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రో రెండేళ్ల‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక‌య్యే వ్య‌క్తి పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డ‌పాల్సి ఉంటుంది.

కాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను చేపట్ట‌డానికి ముందుకు రావ‌ట్లేద‌ని చెబుతున్నారు. ఆయ‌న‌ను అధ్య‌క్షుడిగా ఉండేందుకు ఒప్పించ‌డానికి పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేసినా రాహుల్ ఒప్పుకోలేద‌ని అంటున్నారు. మ‌రోవైపు వృద్ధాప్య‌, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డానికి సిద్ధంగా లేరని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్ట జాతీయ అధ్యక్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌డ‌తార‌నేదానిపై ఉత్కంఠ నెల‌కొంది. కాగా ఆగ‌స్టు 21 నుంచి సెప్టెంబ‌ర్ 20 మ‌ధ్య కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక పూర్త‌వుతుంద‌ని ఆ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మాత్రం అధ్యక్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సిద్ధంగా లేర‌ని స‌మాచారం. అయితే ఆయ‌న‌ను ఒప్పించేందుకు ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్య‌త‌లు చేప‌ట్టడానికి సిద్ధంగా లేక‌పోవ‌డంతో ఇక మ‌ధ్యేమార్గంగా ప్రియాంకా గాంధీ పేరు ఆ ప‌ద‌వికి వినిపిస్తోంది. అన్ని ప్ర‌య‌త్నాలు చేశాక కూడా రాహుల్ ఒప్పుకోక‌పోతే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పీఠంపై కూర్చోపెట్టే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని అంటున్నారు.
అయితే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రియాంక అంత‌గా ప్ర‌భావం చూప‌ని నేప‌థ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా అవ‌కాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

కాగా గ‌త లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ 2019లో రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. నేతల ఒత్తిడితో ఆ బాధ్యతను సోనియాగాంధీ చేప‌ట్టారు. మధ్యలో జీ-23 పేరుతో సీనియర్‌ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు సోనియా సిద్ధ‌ప‌డ్డారు. అయితే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) విన్నపం మేరకు సోనియా అధ్యక్ష ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు చేప‌డ‌తార‌నేదానిపై ఆస‌క్తి నెల‌కొంది.