Begin typing your search above and press return to search.

సీఎస్ పదవి ఏ కులానికి ఇస్తారో?

By:  Tupaki Desk   |   30 July 2016 10:30 PM GMT
సీఎస్ పదవి ఏ కులానికి ఇస్తారో?
X
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) టక్కర్ పదవీకాలం పూర్తవుతుండడంతో కొత్త సీఎస్ ఎవరన్నది ఇంకా తేలలేదు. అయితే... ఇద్దరు సీనియరు అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ కుల సమీకరణల కారణంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. టక్కర్ పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియబోతోంది. ఆయన తరువాత సీనియర్లయిన అజయ్ కల్లాం - దినేష్ కుమార్ ల పేర్లు ఇప్పుడు సీఎస్ రేసులో వినిపిస్తున్నాయి.

వీరిద్దరిలో అజయ్ కల్లాం ఆంధ్రప్రదేశ్ కే చెందిన వారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయనను సీఎస్ చేయాలని టీడీపీలోని కొందరు రెడ్డి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే టీడీపీలో చేరిన ఆనం సోదరులు ఎలాగైనా అజయ్ కల్లాంను సీఎస్ చేయాలని చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అపవాదు చెరిపేసుకోవాలంటే అజయ్ కు సీఎస్ పదవి ఇవ్వాలని ఆనం సోదరులు ముఖ్యమంత్రిని కలిసి సూచించినట్లు సమాచారం. వీరి ఒత్తిళ్లతో పాటు స్వతాహాగా మంచి వ్యక్తి, సమర్థుడైన అధికారిగా పేరుండడం కూడా అజయ్ కల్లాంకు కలిసి రావొచ్చని భావిస్తున్నారు.

రేసులో ఉన్న మరో అధికారి దినేశ్ కుమార్ రాష్ట్రానికి చెందిన అధికారి కానప్పటికీ రాష్ట్రానికి చెందిన బడా పారిశ్రామిక వేత్త ఒకరు ఆయన కోసం ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో పేరున్న ఆ నీ అధిపతి తన సామాజికవర్గ కోణంలో ప్రయత్నిస్తున్నారని అధికారవర్గాల్లో వినిపిస్తోంది. ఇద్దరికీ ఒకటే సామాజికవర్గం కావడంతో ఆ అధికారిని సీఎస్ ని చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. దినేష్‌ కుమార్ ప్రస్తుతం పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు. ఆయనకు మంచి అధికారిగా పేరుంది. గతంలో ఆయన పోలవరం ప్రాజెక్టు సీఈఓగానూ పనిచేశారు.

కాగా ప్రస్తుత సీఎస్ టక్కర్ రాష్ట్రానికి చెందినవారు కాకపోవడంతో కులాల సమీకరణలేవీ అప్పట్లో లేవు. ఆయన కంటే ముందు సీఎస్ గా పనిచేసిన నవ్యాంధ్ర తొలి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. అయితే.. ఈసారి కుల సమీకరణలు పనిచేస్తాయా లేదంటే రాష్ర్టంలోని కులాలతో సంబంధంలేని ఇతర రాష్ట్ర వ్యక్తి అయిన అనిల్ చంద్ర పునేఠాకు ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.