Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నేత‌లు మాట్లాడుకుంటున్న న‌వీన్ రావు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   17 March 2019 5:43 AM GMT
టీఆర్ ఎస్ నేత‌లు మాట్లాడుకుంటున్న న‌వీన్ రావు ఎవ‌రు?
X
గ‌డిచిన కొద్ది రోజులుగా ఒక పేరు గులాబీ స‌ర్కాల్స్ లో త‌ర‌చూ వినిపిస్తూ ఉంది. సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉంటూ.. వారు డిసైడ్ చేసినోళ్లే ఎంపీ అవుతార‌ని బ‌లంగా వినిపించే మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానానికి నవీన్ రావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంది. టీఆర్ ఎస్ టికెట్ కోసం ప్ర‌స్తుతం ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.

తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ బంఫ‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించ‌టం.. భారీగా సీట్ల‌ను సొంతం చేసుకున్న వేళ‌.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌భావం పెద్దగా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీంతో.. టీఆర్ ఎస్ టికెట్ల‌ను ఆశిస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూపెరుగుతూ ఉంది.

త‌మ‌కు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేస్తే పోటీ సంగ‌తి తాము చూసుకుంటామ‌ని భ‌రోసా ఇస్తున్న నేత‌ల సంఖ్య పెరుగుతోంది. కేసీఆర్ పార్టీలో ఉన్న మ‌రో లాభం ఏమంటే.. పార్టీ అభ్య‌ర్థిని డిసైడ్ చేసిన త‌ర్వాత‌.. స‌ద‌రు అభ్య‌ర్థి ఎన్నిక‌ల ఖ‌ర్చుకు సంబంధించిన మంచి చెడ్డ‌ల్ని కేసీఆరే స్వ‌యంగా చూడ‌టం.. వారు ఊహించనంత రీతిలో స‌పోర్ట్ దొర‌క‌టంతో ప‌లువురు నేత‌లు ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్న వారి రేసులో ఉన్నారు.

కేసీఆర్ మ‌న‌సు ఎరిగిన వారు.. మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాకుండా లోగుట్టుగా తమ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటివేళ‌.. మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా న‌వీన్ రావు అనే పేరు వినిపించింది. ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా ప‌రిచ‌యం లేని ఈయ‌న ఎవ‌రు? ఈయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? కేసీఆర్ ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌టానికి కార‌ణం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం న‌వీన్ రావు ఎవ‌రో కాద‌ని.. ప్ర‌ముఖ చైన్ చికెన్ షాపు బ్రాండ్ అయిన స్నేహ చికెన్ సెంట‌ర్ల అధినేత‌గా చెబుతున్నారు. రాజ‌కీయాల్లో పెద్ద‌గా న‌లిగిన పేరు కాన‌ప్ప‌టికి.. చురుకుద‌నం పాళ్లు ఎక్కువ‌ని తెలుస్తోంది. దీనికి తోడు.. ఆయ‌న కేసీఆర్ కు ద‌గ్గ‌ర బంధువు అవుతార‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే కొత్త ముఖానికి అవ‌కాశం ఇవ్వ‌టంతో పాటు.. తాను ఎవ‌రిని బ‌రిలోకి దింపినా గెలుపు ప‌క్కా అన్న విష‌యాన్ని రుజువు చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అయితే.. తాజాగా మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌టంతో కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డి సామాజిక వ‌ర్గానికి సీటు కేటాయిస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ మ‌ల్కాజిగిరి స్థానం న‌వీన్ రావుకు ప‌క్కా అన్న‌టోళ్లు సైతం ఇప్పుడు సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై పోటీ అంటే కేసీఆర్ ఫుల్ అలెర్ట్ అవుతార‌ని.. బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో దింపే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.