Begin typing your search above and press return to search.

త్యాగధనులకు పదవులు

By:  Tupaki Desk   |   14 Dec 2018 5:50 AM GMT
త్యాగధనులకు పదవులు
X
తెలంగాణ ముందస్తు సమరం ముగిసింది. విజేతలు ఎవరో తేలిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీలలో టిక్కెట్ల పంపిణి సమయంలో నిరసనల హోరు వినిపించింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీలలో ఈ హోరు మరింత ఎక్కువైంది. దీంతో బుజ్జగింపుల పర్వం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిక్కెట్టు రానివారు నిరాశ చెందవద్దని వారిని కడుపులో పెట్టుకుంటామని ప్రకటించారు. అయిన కొందరు ఆశావాహులు ఆయన మాటను పెడచెవిన పెట్టారు. ఎన్నికల బరిలో రెబల్స్‌ గా పోటీ చేసారు. వారిని పోటీ నుంచి విరమింప చేసేందుకు రెండు మూడు సార్లు కేసీఆర్ బుజ్జగింపు ప్రకటనలు చేసారు. విసిగి వేసారిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక దశలో "వారి ఖర్మ వారే పోతారు" అని ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ రాష్ట్ర సమితికి రెబల్స్ బెడద ఎక్కువైంది. దీన్ని ప్రభావం ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనపడింది. అయితే కొందరు రెబల్స్ మాత్రం అధిష్టానం మాటకు విలువనిచ్చి పోటీ నుంచి తప్పుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా భారీ అధిక్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది.

ఎన్నికలు ముగిసిన తర్వాత భారీ విజయం దక్కడంతో త్యాగధనులలో హుషారు - రెబల్స్‌ లో బేజారు మొదలైంది. నెలరోజులు ఓపిక పట్టుంటే తమకు కూడా పదవులు దక్కుననే ఆలోచన రెబల్స్‌ లో పెరిగింది. మరోవైపు అధిష్టానం మాటకు విలువిచ్చి ఎన్నికల బరిలోంచి తప్పుకున్న నాయకుల పంటపండుతోంది. త్వరలో తెలంగాణలో ఎమ్మెల్సీల పదవుల పందారం జరగనుంది. ఈసారి 5 స్దానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 ఎమ్మెల్సీలు శాసనసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ మూడు స్దానాలు ఖాళిగా ఉన్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి 4 ఎమ్మెల్సీలు పార్టీ మారారు. వీరిపై వేటు పడడం ఖాయం. ఈ మొత్తం అన్ని స్దానాలు కలుపుకుంటే కొత్తగా 12 మందికి ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం ఉంది. అధిష్టానం మాట విని ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నాయకులు బుజ్జగింపులతో మాటవిన్న వారికి ఎమ్మెల్సీ పదవులు దక్కె అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు గా పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సినీయర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ స్దానాలు దక్కె అవకాశం లేదు. దీంతో ఎన్నికలకు ముందు త్యాగం చేసి అధిష్టానం ద్రుష్టిని ఆకర్షించి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు పదవి యోగం పట్టనుంది. ఇవే కాదు పలు కోర్పోరేషన్ల చైర్మన్ పదవులు కూడా త్యాగధనులకు దక్కె అవకాశం ఉందంటున్నారు.