Begin typing your search above and press return to search.

జగన్ని ఎవరు కాపాడుకోవాలి... మంత్రుల మాటల వెనక మర్మం...?

By:  Tupaki Desk   |   13 Dec 2022 7:30 AM GMT
జగన్ని ఎవరు కాపాడుకోవాలి... మంత్రుల మాటల వెనక మర్మం...?
X
జగన్ ఏపీ సీఎం గా ఉన్నారు. ఆయన అత్యంత సమర్ధుడు అని వైసీపీ నేతలు మంత్రులే పదే పదే చెబుతారు. ఇక ప్రజాస్వామ్యంలో చూస్తే ఎవరు నాయకుడుగా ఉన్నా అందరి కంటే బలవంతులు. అసలైన సార్వభౌములు ప్రజలే. వారు తలచుకుంటే ఎంతటి వారు అయినా అధికారంలోకి వస్తారు. లేకపోతే తెర మరుగు అవుతారు. ప్రజలు ఎపుడూ కరెక్ట్ గానే తీర్పు ఇస్తారు.

జనాలను మభ్యపెట్టడం ఎవరి వల్లా కాదు. ఎంతో అధునిక సాధనా సంపత్తి చేతిలో ఉన్న వారు అంగబలం అర్ధబలం ఉన్న వారు సైతం ప్రజాభిప్రాయాన్ని ఏ మాత్రం కదిలించలేదు. చదువు తక్కువ కావచ్చు కానీ జనాల తీర్పు ఎపుడూ తప్పుగా ఉండదు. ఏపీ విషయానికి వస్తే వైసీపీ మంత్రులు ఈ మధ్య చిత్రమైన ప్రకటనలు కొన్ని చేస్తున్నారు. అలాగే కీలక నాయకులు కూడా పదే పదే కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

లేటెస్ట్ గా చూసుకుంటే విజయనగరం జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ మీద భారీ కుట్ర జరుగుతోంది అని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ పాలన లేకుండా చేయలని వ్యూహాలు రచిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని సమాదరిస్తున్నారని అయితే అది సహించలేని టీడీపీ దాని అనుకూల మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రజలను మభ్యపెట్టే విధంగా చంద్రబాబు లేని మాటలను గాలి మాటలను చెబుతూ జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కనుక పార్టీ అంతా ఒక్క మాట మీద నిలబడకపోతే ఇబ్బందులు వస్తాయని ఆయన అన్నారు జగన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు కూడా పిలుపు ఇచ్చారు.

కొద్ది రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ కూడా ఇలాంటి ప్రకటనలనే చేశారు. జగన్ అన్ని వర్గాల మన్ననలు అందుకుంటూంటే టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు విమర్శలు చేస్తున్నారు అని దాన్ని అడ్డుకోవాలని జగన్ పాలనను మళ్లీ తెచ్చుకోవాలని కోరారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని అయితే ఏపీలో ఒక వైఎస్సార్, ఒక ఎన్టీయార్ ఇద్దరూ కలిస్తే జగన్ అవుతారు అని కీర్తించారు.

అలాంటి జగన్ మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందని అన్నారు జగన్ని కాపాడుకోవాలని కొడాలి నాని కూడా పేర్కోనడం విశేషం. ఏపీలో జగన్ పాలన లేకుండా చేయాలన్నదే టీడీపీ దాని మద్దతుదారుల ప్రయత్నం అని ఆయన దుయ్యబెట్టారు. ఇలా వైసీపీ నేతలు తరచూ అంటున్న మాటలు చూస్తే కనుక ఏపీలో జగన్ పాలన లేకుండా ఎవరు చేస్తారు, కుట్రలు ఎవరు చేయగలరు అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది.

జగన్ ఇప్పటికే మూడున్నరేళ్ళ పాలన పూర్తి చేశారు. మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు వస్తాయి. జగన్ పాలన బాగుంటే మరోసారి ప్రజలే పట్టం కడతారు. అపుడు చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. అలా కాకుండా జగన్ పాలన మీద జనాలకు విరక్తి కలిగితే ఎంతమంది చేయి అడ్డుపెట్టినా కాపడలేరు. ఈ ప్రజాస్వామ్యంలో నాయకుల పనితీరు ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వారిని కాపాడాల్సింది వారి ఏలుబడి తప్ప మరోటి కాదు.

ఈ విషయం రాజకీయంగా సీనియర్ నేతలుగా ఉన్న వారికి తెలియదు అనుకోగలరా. అయితే జగన్ని కాపాడుకోవాలి అన్న మాటను పదే పదే చెప్పడం ద్వారా సానుభూతిని జనంలో క్రియేట్ చేయడానికి వైసీపీ నేతలు చూస్తున్నారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది మరి. సానుభూతి జగన్ కి కావాలా నిజంగా అలనాటి పరిస్థితి ఉంటుందా. ఆదే నిజమైతే టన్నుల కొద్దీ సానుభూతి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మీద కూడా జనాలు 2019 ఎన్నికల్లో కురిపించాల్సి ఉండేది.

ఆయన ఏకంగా నడుము దాకా వంగి పోయి మరీ జనాలను వేడుకున్నారు. తనను గెలిపించాలని కోరుకున్నారు కానీ ప్రజలు అలా చేయలేదు కదా. ఏది ఏమైనా ఎన్నికలు అంటే ఒక పరీక్ష. అక్కడ మార్కులేసేసి జనాలు. వారు తమ కోణం నుంచి చూసి అన్నీ ఆలోచించి తీర్పు ఇస్తారు తప్ప ఎవరినో కాపాడాలనో లేక సానుభూతి చూపించాలనో చేయరు కదా. సో ప్రజా తీర్పు కోసం ఎవరైనా ఎదురుచూడాల్సిందే. వారి మెప్పు కోసం కృషి చేయాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.