Begin typing your search above and press return to search.

పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధూకు ఉన్న అవకాశాలెంత?

By:  Tupaki Desk   |   19 Sep 2021 9:33 AM GMT
పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు? సిద్ధూకు ఉన్న అవకాశాలెంత?
X
అదేం సిత్రమో కానీ... ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఆ పార్టీ వేసిన ఎత్తులు.. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని ఏలేలా చేశాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. ఈ రోజున దేశ రాజకీయ పరిస్థితులు ఈ తీరులో ఉండటానికి కారణం.. కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా అన్నది నిజం. అయితే.. మిగిలిన పార్టీలకు కాంగ్రెస్ కు ఉన్న తేడా ఏమంటే.. ఎంత బలంగా ఉంటుందో.. అంతే బలహీనంగా మారిపోతుంది. అంతేకాదు.. ప్రజావ్యతిరేకతకు తలొగ్గుతుంది. గడిచిన ఏడున్నరేళ్లుగా మోడీ పాలనను చూసిన వారికి కాంగ్రెస్ అధినాయకత్వానికి.. బీజేపీ అధినాయకత్వానికి ఉన్న తేడా ఏమిటో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన మోడీ సర్కారు మీద ఎంత వ్యతిరేకత వచ్చినా.. కించిత్ కూడా వెనక్కి తగ్గని తీరు మోడీలో కనిపిస్తే.. ఒకవేళ కాంగ్రెస్ కానీ మోడీ స్థానంలో ఉండి ఉంటే.. తప్పక తలొగ్గేదని చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజున దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో.. మోడీషాల పుణ్యమా అని మాణ్నాళ్ల ముచ్చటగా మారింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పరిస్థితి అదే పరిస్థితి.

ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన మోడీ సర్కారు మీద పంజాబీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సింది. కానీ.. అంతర్గత కుమ్ములాటలో ఉన్న ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో.. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. చాలామంది మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూనే కాబోయే సీఎం అన్న మాటను చెబుతున్నారు. అయితే.. తాజాగా రాజీనామా చేసిన అమరీందర్ కు..సిద్ధూకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇలాంటివేళ.. ఆయన స్థానంలో సిద్ధూను సీఎంగా నియమిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు సిద్దూతో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్.. మాజీ సీఎం రాజేందర్ కౌర్ భట్.. ప్రతాప్ సింగ్ భజ్వా.. రణ్వీత్ బిట్టు.. మాజీ మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా సోనియాకు సన్నిహితురాలైన సీనియర్ నేత అంబికా సోనీ పేరు తెర మీదకు వచ్చింది. సిద్ధూ పేరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమరీందర్ సింగ్ మాటకు కాంగ్రెస్ అధినాయకత్వం ఎంతమేరకు విలువనిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సీఎం ఎవరైనా ఫర్లేదు కానీ.. సిద్ధూను మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇవాళ (ఆదివారం) సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో అమరీందర్ వారసుడ్ని ఎన్నుకోనున్నారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ పేరు బలంగా వినిపిస్తోంది. సిద్ధూకు ఒకవేళ సీఎం పీఠం దక్కని పక్షంలో సునీల్ కే దక్కుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం..మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా తయారవుతోంది. దీంతో పార్టీ చీఫ్ పదవి సిక్కు వర్గీయులకు కేటాయించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి పదవిని సిక్కుయేతర వ్యక్తికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఫార్ములాను ఫాలో అయితే.. సీఎంగా సునీల్ జాఖర్ ఎంపిక కావటం ఖాయమని చెప్పక తప్పదు.