Begin typing your search above and press return to search.

తెలంగాణ పీఏసీ చైర్మన్ ఎవరు?..హస్తం పార్టీకి హ్యాండిచ్చినట్టేనా?

By:  Tupaki Desk   |   7 Sep 2019 9:43 AM GMT
తెలంగాణ పీఏసీ చైర్మన్ ఎవరు?..హస్తం పార్టీకి హ్యాండిచ్చినట్టేనా?
X
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముగిసి ఇప్పటికే దాదాపుగా ఏడాది కావస్తోంది. అయినా కూడా ఇప్పటిదాకా శాసనసభ కమిటీల ఏర్పాటు జరగలేదు. శాసనసభ కమిటీలే కాకుండా అధికార పార్టీకి చెందిన విప్ లు గానీ - చీఫ్ విప్ లు గానీ ఇప్పటిదాకా తేలనే లేదు. ఏడాది అవుతున్నా ఈ నియామకాలు జరగకపోవడం - సర్కారీ సొమ్ముపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసలు అడ్రస్సే లేకపోవడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధాణంగా సభలోని ప్రధాన ప్రతిపక్షానికి దక్కే పీఏసీ కమిటీ చైర్మన్ గిరీ ఈ దఫా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందా? లేదంటే... ఆ పార్టీకి హ్యాండిచ్చేసి తన మిత్రపక్షం ఎంఐఎంకు కేసీఆర్ కట్టబెడతారా? అన్న దిశగా ఆసక్తికర చర్చలకు తెర లేసింది.

గతేడాది డిసెంబర్ 7న ఎన్నికలు జరగగా... అదే నెల 11న ఫలితాలు వెలువడ్డాయి. అందరి అంచనాల మేరకే వరుసగా రెండో పర్యాయం కూడా టీఆర్ ఎస్సే ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. టీఆర్ ఎస్ అదినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోమారు సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. చాలా కాలం పాటు కేబినెట్ లేకుండానే పాలన సాగించిన కేసీఆర్... నెలల తర్వాత కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తతంగం ఇలా సాగుతుండగానే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. మొత్తంగా కొత్త అసెంబ్లీ కొలువుదీరి ఏడాది కావస్తున్నా... ఇప్పటిదాకా అసెంబ్లీలో కీలక కమిటీల నియామకమే జరగలేదు. అయితే చాలా ఆలస్యమైనా ఇప్పుడు శాసన సభా కమిటీల ఏర్పాటు దిశగా కేసీఆర్ సర్కారు సాగుతోంది. ఈ దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అయితే శాసనసభ కమిటీలు అన్నింటిలోకి కీలకమైన ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ) చైర్మన్ పదవి ఏ పార్టీకి దక్కనుంది? ఆ పార్టీలో ఏ నేతకు దక్కనుందన్న విషయాలపై ఇప్పుడు నిజంగానే ఉత్కంఠ నెలకొంది.

విశ్వవసనీయ సమాచారం మేరకు పీఏసీ చైర్మన్ గిరీని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం లేదట. తన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ పార్టీకి ఆ పదవిని కట్టబెట్టేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. అయినా సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్... మజ్లిస్ పార్టీకి ఆ పదవిని ఎలా కట్టబెడతారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ అండ్ కో... దానికి సంబంధించిన లెక్కలు కూడా తీస్తున్నాయి. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను 9 మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. అయితే పీఏసీ చైర్మన్‌ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వడం ఆనవాయితీ. 119 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో అధికార టీఆర్ ఎస్‌ కు 103 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా - 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ నికర బలం ఏడు మాత్రమే. అదే సమయంలో మజ్లిస్ కు కూడా ఏడుగురు సభ్యుల బలం ఉంది. దీంతో మజ్లిస్ పార్టీనే అసెంబ్లీలో అతిపెద్ద రెండో పార్టీగా కేసీఆర్ గుర్తిస్తారట. ఆ లెక్కన పీఏసీ చైర్మన్ పదవి మజ్లిస్ కే దక్కుతుందట. మరి ఈ పరిణామంపై కాంగ్రెస్ ఏ స్థాయిలో పోరాటం చేస్తుందో చూడాలి.