Begin typing your search above and press return to search.

కొడాలి నానిని ఢీకొట్టే నేత ఎవరంటే?

By:  Tupaki Desk   |   25 Feb 2019 6:27 AM GMT
కొడాలి నానిని ఢీకొట్టే నేత ఎవరంటే?
X
కృష్ణా జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో పోరు మరింత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తిరుగులేకుండా ఉన్నారు.. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఈయన ఈసారి కూడా వైసీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అటు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గుడివాడలో టీడీపీలో పాగా వేయాలని పసుపు పార్టీ అధినేత ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.

గుడివాడ టీడీపీ ఇన్‌ చార్జిగా రావి వెంకటేశ్వర్‌ రావు కొనసాగుతున్నందున ఈసారి టిక్కెట్‌ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన కొడాలి నానితో సైఅంటే సై అన్నారు.. కానీ ఓడిపోయారు.. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దేవినేని అవినాష్‌ సైతం ఈ నియోజకవర్గ టికెట్‌ కోసం ఆరాట పడుతున్నారు.

టీడీపీ శ్రేణులు వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందనుకుంటున్న వేళ పార్టీ అధినేత తాజా నిర్ణయంతో అయోమయానికి గురవుతున్నారు. కొడాలి నానిపై బలమైన నేతను నిలబెట్టాలనే ఉద్దేశంతో రావి - దేవినేనిలు కాకుండా ఎవరైతే గట్టి పోటీ ఇస్తారోనని ఓ సర్వే నిర్వహించాడట. దీంతో వీరిద్దరికి కాకుండా ఇంకొకరికి టికెట్‌ ఖాయమవ్వనుందనే వార్త హల్ చల్ చేస్తోంది.

ఈ పరిణామాలను కొడాలి నాని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉన్నాడట.. గుడివాడ అభ్యర్థిత్వంపై టీడీపీ సాచివేత ధోరణి అవలంభిస్తుండడంతో కొడాలి చేరికల డ్రామాకు తెరతీశారు. రావి - దేవినేనిలు టికెట్‌ ఇవ్వకపోతే వారు వైసీపీలోకి చేరే అవకాశం ఉంటుందని ప్రచారం చేయిస్తున్నాడట.. దీంతో ఇప్పుడు టీడీపీలో కూడా అసమ్మతి రాజుకుంటోంది. టీడీపీ అధినేత నిర్ణయం త్వరగా తేల్చకపోతే గుడివాడలో పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నియోజకవర్గ నేతలు అంటున్నారు.