Begin typing your search above and press return to search.

తెలంగాణ టీడీపీకి దిక్కెవ‌రూ?

By:  Tupaki Desk   |   10 July 2021 4:30 PM GMT
తెలంగాణ టీడీపీకి దిక్కెవ‌రూ?
X
మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ప‌ని అయిపోయిందా? తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీకి దిక్కు లేదా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి తెలంగాణ టీడీపీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి గులాబీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మయ్యాడు. 30 ఏళ్లుగా ఆ పార్టీతో కొన‌సాగిన ఆయ‌న‌.. టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు చంద్ర‌బాబుకు పంపిన లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని కాస్త ఆల‌స్యంగా గ్ర‌హించిన ఆయ‌న‌.. ఇప్ప‌టికైనా పార్టీ మారి మంచి ప‌ని చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థ‌తుల్లో తెలంగాణ‌లో పంక్చ‌ర్ ప‌డ్డ సైకిల్‌ను తిరిగి న‌డిపేదెవ‌ర‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

పూర్తిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టిన టీడీజీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు.. తెలంగాణ‌లో పార్టీని ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నాయ‌క‌త్వ కూర్పుపై ప‌ర్య‌వేక్ష‌ణ లేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఇప్పుడైనా ర‌మ‌ణ రాజీనామాతో తెలంగాణ వైపు చంద్ర‌బాబు ధ్యాస మ‌ళ్లిస్తాడేమో చూడాలి. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మిస్తారో అనే ఆస‌క్తి మొద‌లైంది. పోలిట్‌బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బ‌క్క‌ని న‌ర్సింలు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌న్నూరి న‌ర్సిరెడ్డి, సీనియ‌ర్ నేత‌లు కొత్త‌కోట ద‌యాక‌ర్‌రెడ్డి, అర‌వింద‌కుమార్ గౌడ్ పేర్ల‌పై చ‌ర్చ సాగుతోంది. బ‌డుగువ‌ర్గాల‌కు చెందిన‌వాళ్ల‌కు ఇవ్వాల‌నుకుంటే బ‌క్క‌ని న‌ర్సింలుకు లేదా మంచి వాగ్ధాటి ఉన్న‌వాళ్ల‌కు ఇవ్వాల‌నుకుంటే న‌ర్సిరెడ్డికి ఆ ప‌ద‌వికి దక్కుతుంద‌ని అంచ‌నా. ఎవ‌రు అధ్య‌క్షుడిగా ఎంపికైన‌ప్ప‌టికీ.. తెలంగాణ‌లో ప‌త‌నం దిశ‌గా సాగుతున్న టీడీపీకి పూర్వ వైభ‌వాన్ని తేవ‌డమంటే త‌ల‌కు మించిన భార‌మే.

అధికార పార్టీ టీఆర్ఎస్‌లో బ‌ల‌మైన బీసీ నేతగా ఎదిగిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్‌.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌క‌టించి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈటెల‌ నిష్క్ర‌మ‌ణ‌తో ఖాళీ అయిన బీసీ నేత స్థానంలో ర‌మ‌ణ‌ను తీసుకోవాల‌ని భావించిన కేసీఆర్‌.. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ఫ‌లితం సాధించార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఈటెల రాజీనామాతో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే కేసీఆర్ క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన సంగ‌తి తెలిసిందే. జిల్లాల ప‌ర్య‌ట‌న‌తో పాటు మ‌రోసారి 50 వేల ఉద్యోగాల భ‌ర్తీ విష‌యాన్ని తెర‌మీద‌కు తెచ్చారు.

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కిన నేప‌థ్యంలో మిగ‌తా పార్టీల‌తో పోలిస్తే తెదేపా ప‌రిస్థితే ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్య‌మ పార్టీగా నిలిచిన టీఆర్ఎస్‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన రెండు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకే జ‌నాలు ప‌ట్టం క‌ట్టారు. మ‌రోవైపు టీడీపీ ఆంధ్రా పార్టీ అనే ముద్ర ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయింది. అందుకే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీని చిత్తుచేశారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేర‌డంతో అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిథ్య‌మే లేకుండా పోయింది. మ‌రోవైపు గ‌తేడాది కాస్తో కూస్తో ప‌ట్టు ఉన్న హైద‌రాబాద్ మహాన‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ఎల‌క్ష‌న్ల‌లోనూ టీడీపీకి ఘోర ప‌రాభ‌వ‌మే మిగిలింది. ఇవ‌న్నీ ఆ పార్టీని పాతాళం దిశ‌గా న‌డిపించాయి. ఇక ఇప్పుడేమో తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా ర‌మ‌ణ రాజీనామాతో ఆ పార్టీకి ఇక్క‌డ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.