Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క‌లో చివ‌ర‌కు జ‌రిగేదేమిటి..?

By:  Tupaki Desk   |   16 May 2018 4:24 AM GMT
క‌ర్ణాట‌క‌లో చివ‌ర‌కు జ‌రిగేదేమిటి..?
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. ఫ‌లితం వ‌చ్చేసింది. మ‌రిప్పుడు ఏం జ‌రుగుతుంది? అన్న‌ది మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యేలా క‌న్న‌డ ప్ర‌జ‌లు త‌మ తీర్పును ఇచ్చార‌ని చెప్పాలి. కేవ‌లం 8 సీట్ల తేడాతో బీజేపీకి అధికారం అంద‌కుండా చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ప‌వ‌ర్లోకి రావాలంటే రెండు మార్గాలు ఉన్నాయి.

ఒక‌టి.. కాంగ్రెస్ ను చీల్చ‌టం.. లేదంటే.. జేడీఎస్ ను రెండు ముక్క‌లు చేయ‌టం. అయితే.. ఈ రెండింటిలో ఏం చేసినా అప‌కీర్తిని మూట‌క‌ట్టుకోవ‌టం ఖాయం.

ఒక‌ప్పుడు సిద్ధాంతాలు.. ప్ర‌మాణాలు అంటూ చేతికి వ‌చ్చిన ప‌వ‌ర్ ను సైతం త్యాగం చేసిన బీజేపీ నేత‌ల మాదిరి మోడీషాలు లేర‌న్న‌ది తెలిసిందే. తాము చేసే ప‌నుల‌తో ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైనా.. దాన్ని ఎలా త‌గ్గించాల‌న్న‌ది త‌ర్వాత విష‌యన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించి.. ముందు అయితే పార్టీ ప‌వ‌ర్లోకి వ‌చ్చేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది కూడా అదే. క‌ర్ణాట‌క తుది ఫ‌లితాన్ని చూస్తే.. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ. ప‌వ‌ర్ ను చేప‌ట్టే సీట్లు ప్ర‌జ‌లు ఆ పార్టీకి ఇవ్వ‌లేదు. మ‌రిప్పుడు క‌ర్ణాట‌క‌లో ఏం జ‌ర‌గ‌టానికి అవ‌కాశం ఉంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మానికి ముందు రోజే కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం త‌న దూత‌ల్ని బెంగ‌ళూరుకు పంపింది. ఈ విష‌యంలో కాంగ్రెస్ ముందుచూపును అభినందించాల్సిందే.అయితే.. గోవా.. మ‌ణిపూర్ ఉదంతాల‌తో ఎదురుదెబ్బ‌లు త‌గిలిన కాంగ్రెస్ కర్ణాట‌క విష‌యంలో నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. ఇక్క‌డ కాంగ్రెస్ ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తే.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ లో ఉన్న క‌మ‌ల‌నాథులు మాత్రం.. క‌ర్ణాట‌కలో అప్ర‌మ‌త్తంగా ఉండ‌లేద‌ని చెప్పాలి.

కాంగ్రెస్ వాయు వేగంతో పావులు క‌దుపుతూ.. రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని మార్చేస్తున్న వైనాన్ని కాస్త ఆల‌స్యంగా గుర్తించి.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు షురూ చేసింది. సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత అమిత్ షా బెంగ‌ళూరుకు చేరుకున్నారంటే ఆ పార్టీ త‌ప్పు ఏమిటో ఇట్టే చెప్ప‌క త‌ప్ప‌దు.

ర‌స‌కందాయంలో ప‌డిన క‌ర్ణాట‌క రాజ‌కీయం ఇప్పుడు ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌నుంది? అన్న‌ది చూస్తే.. కాసిన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా క‌ర్ణాట‌క‌లో బీజేపీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ కోరే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మోడీషాలు లాంటి టాస్క్ మాస్ట‌ర్లు ఉండి.. మెజార్టీకి కేవ‌లం 8 సీట్లు మాత్ర‌మే త‌గ్గిన‌ప్పుడు కూడా ప‌వ‌ర్ ను ప‌క్క‌నోళ్ల చేతుల్లో పెట్ట‌టం అంటే.. మోడీషా స‌మ‌ర్థ‌త మీద‌నే పార్టీ వ‌ర్గాలు సందేహాలు వ్య‌క్తం చేసే ప్ర‌మాదం ఉంది. అందుకే.. న‌లుగురు వేలెత్తి చూపినా.. ఏదోలా క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే దిశ‌గానే బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని చెప్పాలి. ఒక‌వేళ‌.. జేడీఎస్.. కాంగ్రెస్ పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం అంటే.. బీజేపీ గెలిచి మ‌రీ ఘోరంగా ఓడిన‌ట్లే అవుతుంద‌న్న అభిప్రాయం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో చెడ్డపేరు వ‌చ్చినా స‌రే.. ప‌వ‌ర్ ను మాత్రం చేజార‌కుండా అమిత్ షా చూస్తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.