Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'తాడికొండ' ఎవరికి అండ..?

By:  Tupaki Desk   |   31 March 2019 7:56 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: తాడికొండ ఎవరికి అండ..?
X
అసెంబ్లీ నియోజకవర్గం : తాడికొండ
టీడీపీ: తెనాలి శ్రావణ్‌
వైసీపీ: ఉండవల్లి శ్రీదేవి

గుంటూరు జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నియోజకవర్గం తాడికొండ. ఒకప్పుడు ఇది సాధారణ నియోజకవర్గంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి దగ్గరగా ఉండడంతో అభివృద్ధి రూపురేఖలు మారిపోయాయి. అయితే నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కరిస్తామని ఎందరో నేతలు హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఏ ఒక్కరు తమ బాధలు తీర్చడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇక సార్వత్రిక పోరులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన తెనాలి శ్రావణ్‌కే టీడీపీ టికెట్‌ కేటాయించింది. వైసీపీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి దక్కించుకుంది. పొత్తులో భాగంగా ఇక్కడి సీటును పవన్‌ బీఎస్పీకి కేటాయించారు. అయితే ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్య పోరే అధికంగా ఉందని చెప్పాలి.

*తాడికొండ నియోజకవర్గం చరిత్ర
మండలాలు: తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం,
ఓటర్లు :లక్షా 67వేలు

1955లో నియోజకవర్గం ఏర్పడింది. కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసింది. అత్యధికంగా కమ్మ సామాజికవర్గం కలిగిన ఈ నియోజకవర్గంలో ఎస్సీ, ముస్లిం ఓట్లు కీలక ప్రభావం చూపనున్నాయి. 2014లో తెనాలి శ్రావణ్‌ టీడీపీ టికెట్‌ పై ఇక్కడ గెలుపొందారు. ప్రస్తుతం ఆయనే 2019లో పోటీపడుతున్నాడు. వైసీపీ నుంచి శ్రీదేవి కొత్తగా పోటీచేస్తున్నారు.

* తెనాలి శ్రావణ్‌ రెండోసారి..
2014 ఎన్నికల్లో తెనాలి శ్రావణ్‌ టీడీపీ నుంచి గెలుపొందారు. ఈసారి మాత్రం ఆయన గెలుపు అంత సులువు కాదంటున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని సొంతపార్టీ నాయకులే అందోళన చేశారు. కానీ పట్టుబట్టి మరీ ఆయన అధిష్టానం నుంచి టికెట్‌ తెచ్చుకున్నారు. దీంతో ఆయన ఆసమ్మతి మధ్యే పోరులో నిలబడ్డారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్ర శ్రావణ్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న పేరుంది. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆయన కృషి చేశారని అంటున్నారు. అధికార పార్టీ ప్రోద్బలం.. సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు.

* అనుకూలతలు:
-అభివృద్ధి, సంక్షేమ పథకాలు
-గత ఎన్నికల్లో గెలవడం

* ప్రతికూలతలు:
-సొంతపార్టీలోనే అసమ్మతి
-తాగునీటి సమస్య తీర్చడంలో పట్టించుకోకపోవడం

* ఉండవల్లి శ్రీదేవి వైసీపీ జెండా ఎగురవేయనుందా..?
వైసీపీలోనూ అసమ్మతి మధ్యే శ్రీదేవి టికెట్‌ దక్కించుకుంది. అప్పటి వరకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కత్తెర క్రిస్టియానా పనిచేశారు. అయితే ఆమెను కాదని పార్టీలో కొత్తగా చేరిన శ్రీదేవికి టికెట్‌ కేటాయించారు జగన్‌. దీంతో శ్రీదేవి సైతం అసమ్మతి మధ్యే పోరులో నిలబడ్డారు. ఆమెకు రాజకీయాలకు కొత్తే అయినా జగన్‌ ఇమేజ్‌, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

* అనుకూలతలు:
-జగన్‌ ఇమేజ్‌
-టీడీపీలో ఉన్న వ్యతిరేకత కలిసొచ్చే అవకాశం

* ప్రతికూలతలు:
-రాజకీయాలకు కొత్త
-సొంత పార్టీలో అసమ్మతి

*అసమ్మతుల మధ్య ఎవరు గెలుస్తారో.?
ఇక్కడ ఎస్సీ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించింది. తాడికొండ, తుళ్లూరు మండలాలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. మేడికొండూరులోనూ ఆధిక్యతే ఉంది. అయితే ఫిరంగిపురంలో మాత్రం వైసీపీకి కలిసిచ్చే అవకాశం ఉంది. దీంతో టీడీపీ, వైసీపీల మధ్య పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. టీడీపీ, వైసీపీ ఇద్దరు అభ్యర్థులకు అసమ్మతే ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఆ అసమ్మతిని ఛేధించి ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టంగా మారింది. సో ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.