Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'అమలాపురం' ఎవరి పరం?

By:  Tupaki Desk   |   31 March 2019 5:30 PM GMT
గ్రౌండ్ రిపోర్ట్: అమలాపురం ఎవరి పరం?
X
పార్లమెంట్ నియోజకవర్గం: అమలాపురం
టీడీపీ: గంటి హరీశ్‌
వైసీపీ: చింతా అనురాధ

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం కోనసీమకు ముఖద్వారం. గోదావరి పరవళ్లు, పచ్చని పైరుతో ఈ ప్రాంతం విలసిల్లుతోంది. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసిన పండుల రవీంద్రబాబు విజయం సాధించారు. అయితే ఆయన ఈ ఎన్నికల వేళ వైసీపీలోకి చేరారు. కానీ వైసీపీ పండుల రవీంద్రబాబుకు టికెట్ కేటాయించలేదు. వైసీపీలో ఉన్న చింతా అనురాధకే జగన్ టికెట్ కేటాయించారు. ఇక టీడీపీ లోక్‌ సభ మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీశ్‌ కు టికెట్‌ కేటాయించింది. హరీశ్‌ కు రాజకీయ చరిత్ర ఉండగా కొత్త బరిలోకి దిగడం.. అటు వైసీపీ తరుపున ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్న మహిళా అభ్యర్థిని పోటీలో ఉంచడం ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్‌ స్థాపించిన జనసేన నుంచి సైతం అభ్యర్థి శేఖర్‌ బరిలో ఉఆన్నరు.

* లోక్‌ సభ నియోజకవర్గం అమలాపురం చరిత్ర:
ఓటర్లు: 13 లక్షల 57వేలు
పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు: రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, టి.గన్నవరం, కొత్తపేట, మండపేట

1952లో ఎంపీ నియోజకవర్గం ఏర్పాటయింది. ఇప్పటి వరకు ఇక్కడ 2 సార్లు సీపీఐ, 8 సార్లు కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. 5 సార్లు టీడీపీ పసుపు జెండా పాతింది. మొదటి రెండు ఎన్నికల్లో కోనేటి మోహన్‌ రావు విజయం సాధించారు. మొత్తం ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో బాలయోగి గురించి ఇప్పటికీ చెప్పుకోవడం విశేషం. ఆయన టీడీపీ నుంచి మూడుసార్లు గెలుపొంది లోక్‌ సభ స్పీకర్‌ గా దేశవ్యాప్తంగా పేరుపొందారు.

* లోక్‌ సభ మాజీ స్పీకర్‌ కుమారుడు హరీశ్‌ బరిలోకి..
కోనసీమ మద్దుబిడ్డగా పిలుచుకున్న దివంగత స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీశ్‌. గత రెండేళ్లుగా ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారని అనుకున్నా సాధ్యం కాలేదు. అయితే సిట్టింగ్‌ ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలోకి చేరడంతో ఈ సీటు హరీశ్‌కు దక్కింది. రాజకీయాలకు కొత్త అయినా హరీశ్‌ తన తండ్రి బాటలోనే నడుస్తానని చెబుతున్నాడు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు.

*అనుకూలతలు:
-టీడీపీకి కంచుకోట
-బాలయోగి సెంటిమెంట్‌

*ప్రతికూలతలు:
-వైసీపీ పుంజుకోవడం
-కొత్తగా పోటీ చేయడం

* వైసీపీ నుంచి చింతా అనురాధ..
మాలమహానాయకుడు పీవిరావు తమ్మడి భార్య అయిన చింతా అనురాధ మొదటిసారి వైసీపీ తరుపున ఎన్నికల బరిలో నిలుచున్నారు. గత కొంతకాలంగా పార్టీ తరుపున జరిగిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారామె. టీడీపీ నుంచి ఎన్నికైన రవీంద్రబాబు చివరి నిమిషంలో వైసీపీలో చేరినా జగన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. రవీంద్రబాబు నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా గ్యాస్‌బావుల విషయంలో ఆయన రక్షణ చర్యలు చేపట్టలేదని అంటున్నారు. ఇదే అస్త్రంగా మలుచుకొని వైసీపీ అభ్యర్థి ప్రజల వద్దకు వెళ్తున్నారు. అలాగే సామాజిక వర్గం సపోర్టు అధికంగా ఉండడంతో ఈ సారి గెలుపు తనదేనని భావిస్తున్నారు.

* అనుకూలతలు:
-జగన్‌ ఇమేజ్‌ తో పాటు కార్యకర్తల అండ
-పీవీరావు బంధువు కావడం

* ప్రతికూలతలు:
-మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం
-ప్రత్యర్థికి ప్రజల్లో ఆదరణ

*టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు?
సిట్టింగ్‌ ఎంపీ రవీంద్రబాబు వైసీపీలోకి వచ్చి రాజోలు ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నించారు. ఇక టీడీపీ పార్టీ అధిష్టానం చివరికి బాలయోగి కుమారుడికే ఇచ్చింది. దీంతో బాలయోగి సెంటిమెంట్‌ ఓట్లు పడుతాయని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి చింతా అనురాధకు రాజకీయాలు కొత్తే.. అయినా రాజకీయ నేపథ్యంలో ఉంది. దీంతో రాజకీయ కుటుంబం సపోర్టుతో ఆమె గట్టెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తం అనూహ్యంగా కొత్త వారు తెరపైకి వచ్చి అమలాపురంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.