Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'బాపట్ల' ఎవరి పట్ల..?

By:  Tupaki Desk   |   26 March 2019 7:49 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: బాపట్ల ఎవరి పట్ల..?
X
అసెంబ్లీ నియోజకవర్గం : బాపట్ల
టీడీపీ: శ్రీరాం మల్యాద్రి
వైసీపీ: నందిగం సురేశ్‌

ప్రముఖులు, మహామహులు పోటీ చేసిన లోక్‌ సభ నియోజకవర్గం బాపట్ల. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గతంలో పోటీ చేయడం విశేషం. అలాగే సినీ దిగ్గజం రామానాయుడు కూడా ఈ నియోజకవర్గంలో ప్రాతినిథ్యం వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో విస్తరించిన బాపట్ల నియోజవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉంది. కొన్ని ఏళ్లు కాంగ్రెస్‌, 2014లో టీడీపీ వశమైన ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ శ్రీరాం మల్యాద్రి మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి యువకుడైన నందిగం సురేశ్‌ బరిలో ఉన్నారు.

* పార్లమెంట్‌ నియోజకవర్గం బాపట్ల చరిత్ర
అసెంబ్లీ నియోజకవర్గాలు: బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, వేమూరు
ఓటర్లు: 13లక్షల 80 వేలు

1977లో బాపట్ల లోక్‌ సభ స్థానానికి తొలిసారిగా ఎన్నిక జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి 1989లో బీజేపీ నుంచి పోటీ చేసిన వెంకయ్యనాయుడు ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి సైతం 1998లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు రెండుసార్లు పోటీ చేసి ఒకసారి గెలుపొంది, మరోసారి ఓడిపోయారు.2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడుగా మార్చారు.. ఆ వెంటనే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి శ్రీరాం మాల్యాద్రి గెలుపొందారు. ప్రస్తుతం ఆయనే పోటీ చేస్తున్నారు.

* శ్రీరాం మల్యాద్రికి చాన్స్ వచ్చేనా.
మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన శ్రీరాం మాల్యాద్రి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆయన నియోజకర్గానికి చాలా తక్కువ సమయంలో వచ్చారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. పార్లమెంట్‌ చర్చలో సైతం కేవలం 136 ప్రశ్నలే సంధించారన్న విమర్శలు వస్తున్నాయి. అవి కూడా నియోజకవర్గానికి చెందినవి కావంటున్నారు. దీంతో నియోజకవర్గంలోని కొందరు మా ఎంపీ కనబడుట లేదని ఫిర్యాదులు కూడా ఇచ్చిన దాఖాలాలు ఉన్నాయి. స్థానికంగా ఉండకపోవడం.. కేడర్ ను పట్టించుకోకపోవడం ఈయనకు మైనస్. అయితే అధికార టీడీపీ సంక్షేమ పథకాలు.. బలం ఈయన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

* అనుకూలతలు:
-అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ బలంగా ఉండడం
-నియోజకవర్గంలో ఫాలోయింగ్‌ ఉండడం

* ప్రతికూలతలు:
-నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
-సొంత సామాజిక వర్గంపై కూడా కరుణ చూపకపోవడం
-స్థానికంగా ఉండరనే ఫిర్యాదులు.. ప్రజలకు దూరమవడం..

* యువ నందిగం సురేశ్‌ ఆశలు..
ఉద్దండ్రాయినిపాలేం ప్రాంతానికి చెందిన నందిగం సురేశ్‌ వైసీపీలో తొలుత యువజన విభాగం నాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత ఆయనకు పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన కార్యకర్తల సహకారంతో నియోజకవర్గంలోని ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నాయి. వైసీపీ టికెట్‌ కేటాయించడంతో తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. యువకుడు, ఉత్సాహవంతుడు కావడం ఆయనకు కలిసివస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత.. సిట్టింగ్ ఎంపీ అందుబాటులో ఉండకపోవడం ఈయనకు కలిసివస్తోంది. టీడీపీ వ్యతిరేకతే గెలిపిస్తుందని ఆశిస్తున్నాడు.

* అనుకూలతలు:
-పార్లమెంట్‌ పరిధిలో సురేశ్‌ కు ఫాలోయింగ్‌ ఎక్కువ
-పార్టీలో యాక్టివ్‌ నాయకుడిగా ఉండడం
-జగన్‌ చేపట్టిన సంకల్పయాత్ర కలిసి రావడం

* ప్రతికూలతలు:
-కొత్తగా బరిలోకి దిగడం
-అరటిదగ్ధం కేసులో ఆరోపణలు

*వైసీపీకే చాన్స్..
టీడీపీ తరుపున బరిలో ఉన్న శ్రీరాం మల్యాద్రిపై నియోజవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా తాను నియోజకవర్గం లోనే ప్రజలకు దగ్గరగా ఉంటానని నందిగం సురేశ్‌ ప్రచారం చేస్తున్నారు. స్థానికుడు కావడం.. యువకుడు కావడంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. అటు జగన్‌ సంకల్ప యాత్ర చేసినప్పుడు ఆయన జనసమీకరణ చేయడంలో సఫలీకృతుడయ్యారు. ఇదే వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలను పెంచుతోంది.