Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'గోపాలపురం'.. ఎవరి పరం..?

By:  Tupaki Desk   |   1 April 2019 11:53 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: గోపాలపురం.. ఎవరి పరం..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: గోపాలపురం
టీడీపీ: ముప్పిడి వెంకటేశ్వర్‌ రావు
వైసీపీ: తలారి వెంకట్రావు

పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం టీడీపీకి కంచుకోట. రిజర్వుడు స్థానమైనా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురులేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఆ పార్టీనే విజయకేతనం ఎగురవేస్తూ వస్తోంది. అందుకే ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేయడానికి నేతలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుత సార్వత్రిక పోరులో టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర్‌ రావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తలారి వెంకట్రావు బరిలో ఉన్నారు. దీంతో పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు.

* గోపాలపురం నియోజకవర్గం చరిత్ర
మండలాలు: ద్వారక తిరుమల, నల్లజెర్ల, దేవరపల్లి, గోపాలపురం
ఓటర్లు:2 లక్షల 6 వేలు

1962లో నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉండేది. కానీ టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఎన్ని పార్టీలు వచ్చిన ఇక్కడి ప్రజలు సైకిల్‌ గుర్తుకే ఓటేస్తారు. 2004లో వైఎస్‌ గాలి ప్రభంజనంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దల సునీత గెలుపొందారు. ఆ తరువాత మళ్లీ పసుపు జెండాకే పట్టం కడుతున్నారు.

* రెండోసారి 'ముప్పిడి' కి ఓట్లు పడేనా..?
2014 ఎన్నికల్లో ముప్పిడి వెంకటేశ్వర్‌ రావు 11వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావ్‌ పై విజయం సాధించారు. టీడీపీలో జడ్పీచైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వంటివారు వెంకటేశ్వర్‌ రావుకు బలంగా ఉన్నారు. ఇది వారికి కలిసి వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. కానీ ముప్పిడి వ్యతిరేకులు ఈసారి టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. కానీ వ్యక్తిగతంగా మంచిపేరు తెచ్చుకున్న వెంకటేశ్వర్‌ రావుకే చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. అభ్యర్థితో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గం ప్రజలు టీడీపీని ఆదరించడం ముప్పిడికి ప్లస్‌ గా చెప్పవచ్చు.

* అనుకూలతలు:
-టీడీపీకి పెట్టని కోట
-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం
-గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి

* ప్రతికూలతలు:
-వర్గపోరును పరిష్కరించకపోవడం
-వైసీపీ బలపడడం

* తలారి వెంకట్రావ్‌ ఈసారైనా జెండా పాతుతారా..?
గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చెందిన తలారి వెంకట్రావ్‌ కు వైసీపీ అధిష్టానం ఈసారి కూడా టికెట్‌ ఇచ్చింది. ఎమ్మెల్యే కాకున్నా ఆయన ప్రజల మధ్యే ఉంటూ మంచిపేరుతు తెచ్చుకున్నాని సర్వే ద్వారా జగన్‌ తెలుసుకున్నారు. దీంతో ఇన్ని రోజులు ఆయన ప్రజత వద్దకు వెళ్లి పరిచయాలు పెంచుకోవడం.. ఎమ్మెల్యేగా గెలిస్తే చేసే అభివృద్ధి పనులు ప్రచారం చేయడం వెంకట్రావ్‌ కు కలిసివచ్చే అవకాశం ఉంది.

* అనుకూలతలు:
-వ్యక్తింగా పరిచయాలు ఎక్కువగా ఉండడం
-జగన్‌ ఇమేజ్‌ బలపడడం
-సానూభూతి ఓట్లు పడే అవకాశం

* ప్రతికూలతలు:
-టీడీపీ కేడర్‌ ఎక్కువగా ఉండడం
-అన్ని మండలాల్లో వైసీపీకి ఆదరణ లేకపోవడం

*ఈసారి టఫ్ ఫైట్.. గెలిచేదెవరు.
అభ్యర్థుల కంటే తెలుగుదేశం పార్టీకే పట్టం కడుతున్న ఇక్కడి ఓటర్లు ఈసారి ఎవరికి వేస్తారోనన్న ఆసక్తి పెరిగింది. 8 సార్లు గెలిచిన టీడీపీకి తొమ్మిదోసారి వైసీపీ బ్రేక్‌ వేస్తుందా..? అనే చర్చ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ కు వస్తున్న ఇమేజ్‌ కు తోడు ఐదేళ్లలో వైసీపీ నాయకులు ప్రజల్లో మమేకమై ఉండడంతో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.