Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ : 'చీపురుపల్లి'లో ఊడ్చేదెవరో..?

By:  Tupaki Desk   |   25 March 2019 9:59 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ : చీపురుపల్లిలో ఊడ్చేదెవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం : చీపురుపల్లి
టీడీపీ : కిమిడి నాగార్జున
వైసీపీ : బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గురించి తెలియనివారుండరు. ఎందుకంటే ఇక్కడ గతంలో ప్రాతినిథ్యం వహించిన బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి అందరికీ సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీ తరుపున పోటీ చేస్తున్నారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యే కిమిడి మృణాళిపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన కుమారుడు నాగార్జునకు టికెట్‌ కేటాయించింది టీడీపీ. 2014 ఎన్నికల్లో దాదాపు 23వేల ఓట్లు సాధించిన మృణాళిని కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ బొత్సను ఓడించారు.. ఈసారి మాత్రం బొత్స వైసీపీని నుంచి బరిలో నిలబడడంతో బలంగా మారారు.

*చీపురుపల్లి చరిత్ర
చీపురుపల్లి నియోజకవర్గంలో మండలాలు: చీపురుపల్లి, మెరకుమడిదాం, గరివెడి, గొల్ల
ఓటర్లు: లక్షా 90వేలు

ఈ నియోజకవర్గంలో కాపు, ఎస్సీ, బలిజ సామాజికవర్గాలు అన్నీ సమానంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఒకప్పుడు ఉండేది. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు.1989లో టీడీపీ నుంచి టంకాల సరస్వతమ్మ విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ నాయకులే గెలుస్తూ వస్తున్నారు. ఆ తరువాత 1994,1999లోనూ పసుపు జెండానే ఎగిరింది. 2004, 2009లో కాంగ్రెస్‌ తరుపున బొత్స సత్యనారాయణ గెలిచారు. ఆయన వైఎస్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో కీలక మంత్రి పదవులు చేపట్టినందున ఇక్కడ అభివృద్ధి చేశారు.

* బొత్స సత్యనారాయణ గెలుపు ఈజీనే..
2004 నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో పదేళ్లపాటు బొత్స సత్యనారయణ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి చేశారనే పేరును సంపాదించుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ ముఖ్యనేతల్లో బొత్స ఒకరు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ మొత్తంగా కాంగ్రెస్‌ డిపాజిట్లు కోల్పోయినా బొత్స సత్యనారాయణ మాత్రం 42వేల ఓట్లు సాధించడం ఆయన వ్యక్తిగత పనితీరుకు నిదర్శనంగా చెప్పుకుంటారు. దీంతో ఆయన వైసీపీ ఆయనా.. మిగతా ఏ పార్టీలోఉన్నా విజయం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

* అనుకూలతలు:
-పదేళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
-గతంలో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో మంచిపేరు
-వ్యక్తిగతంగా ఆయనకు ప్రజలల్లో ఆదరణ ఉండడం

* ప్రతికూలతలు:
-అనుచరులను పట్టించుకోడనే వాదన
-నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌ లేకపోవడం

* యువకుడైన కిమిడి నాగార్జున.. బొత్సను ఢీకొని నిలబడుతాడా?
సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన కిమిడి మృణాళినికి టిక్కెట్‌ కేటాయింపుపై ఆరోపణలు రావడంతో ఆమె కుమారుడు నాగార్జునకు టికెట్‌ ఇచ్చారు చంద్రబాబు. రాజకీయాలకు కొత్త అయినా మంత్రిగా పనిచేసిన మృణాళిని అండతో ఆయన ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన పథకాలపై ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ప్రజల్లోనూ యువనాయకుడు అయినందున సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఉంటుందని ఆశపడుతున్నారు. అయితే బలమైన బొత్సను తట్టుకొని ఎంతవరకు నిలబడుతాడనే చర్చ జిల్లాలో సాగుతోంది. బొత్సకు బలమైన సామాజికవర్గాల బలముంది. అదే కిమిడి నాగార్జునకు మైనస్ గా మారింది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ బలం, క్యాడర్ ఉండడం ఈయనకు ప్లాస్ గా మారింది.

* అనుకూలతలు:
-రాజకీయ చరిత్ర కలిగి ఉండడం
-టీడీపీ కేడర్‌ బలంగా ఉండడం
-మంత్రిగా మృణాళిని చేపట్టిన అభివృద్ధి పనులు

* ప్రతికూలతలు:
-ప్రధానంగా పార్టీలో వర్గపోరు
-తల్లి మృణాళిపై తీవ్ర ఆరోపణలు

*బొత్సకే అవకాశాలు..

మంత్రిగా మూడేళ్లు పనిచేసిన మృణాళినిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెను పదవి నుంచి తొలగించారు. టికెట్‌ కూడా ఇవ్వద్దని రాజధాని కేంద్రంగా టీడీపీ నాయకులే ఆందోళనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె కుమారుడు నాగార్జునకు టికెట్‌ ఇచ్చి తాత్కాలికంగా వివాదం సద్దుమణిగేలా చేసినా గెలుపుపై ఆశలు సన్నగిల్లే అవకాశాలున్నాయి. ఇదే అదనుగా బొత్స సత్యనారాయణ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. గతంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రచారం చేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. మొత్తంగా చూస్తే యువకుడైన నాగార్జున కంటే బొత్సకే గెలుపు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని గ్రౌండ్ రిపోర్టులో తేలింది.