Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ‘జగ్గంపేట' జగజ్జేత ఎవరో..?

By:  Tupaki Desk   |   8 April 2019 5:11 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ‘జగ్గంపేట జగజ్జేత ఎవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: జగ్గంపేట
టీడీపీ: జ్యోతుల నెహ్రూ
వైసీపీ: జ్యోతుల చంటిబాబు
జనసేన: సూర్యచందర్‌ రావు

తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థులనే బరిలో దించాయి. వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రు మరోసారి టీడీపీ నుంచి పోటీలో ఉండగా.. వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు బరిలో ఉన్నారు. జనసేన నుంచి సూర్యచందర్‌ రావు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని ప్రధాన పార్టీల నుంచి పోరు ఉన్నా.. ప్రధానంగా మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది.

* జగ్గంపేట నియోజకవర్గం చరిత్ర:
మండలాలు: గోకవరం, జగ్గంపేట, గండెపల్లి, కిర్లంపూడి
ఓటర్లు: 2 లక్షల 4 వేలు

1955లో నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 6 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు 2 సార్లు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై గెలుపొందారు. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లే కీలకం కానున్నాయి.

*అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ..
2014 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీ నుంచే పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా ఆయన నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాను పార్టీ మారింది నియోజకవర్గం కోసం కాదని కొడుకు భవిష్యత్తును అంచనా వేసుకొని సైకిల్‌ ఎక్కాడని అంటున్నారు. మరోవైపు కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని నియోజకవర్గంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి..

* అనుకూలతలు:
-వ్యక్తిగతంగా ఇమేజ్‌ ఉండడం
-టీడీపీ కేడర్‌ బలంగా ఉండడం
-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం

* ప్రతికూలతలు:
-నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత
-కొడుకు కోసం అడ్డదారులనే ఆరోపణ

* వైసీపీ నుంచి పోటీ చేస్తున్న జ్యోతుల చంటిబాబు..
రెండుసార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన జ్యోతుల చంటిబాబుపై ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన పార్టీలో వర్గ విభేదాలతో సైకిల్‌ ను వీడారు. ఆ తరువాత వైసీపీలో చేరి టికెట్‌ దక్కించుకున్నారు. గత ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలుపొందడంతో ఈసారి తనకు ప్రజలు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకత చంటిబాబుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి పట్టు ఉండడం కూడా చంటిబాబు గెలుపుకు కారణం కావచ్చని అంటున్నారు.

* అనుకూలతలు:
-సానుభూతి పవనాలు
-వైసీపీ బలంగా ఉండడం
-నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం

*ప్రతికూలతలు:
-రెండుసార్లు ఓటమి చెందడం
-నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోవడం

*టఫ్ ఫైట్ లో గెలుపెవరిది?
జగ్గంపేటలో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి సూర్య చందర్ రావు ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు ఓట్లను చీల్చే అవకాశాలున్నాయంటున్నారు. అయితే వైసీపీ గెలిచిన ఈ సీటులో ఆ పార్టీ నుంచి పోటీచేస్తున్న చంటిబాబుకు ఆశలున్నాయి. నెహ్రూపై వ్యతిరేకత.. వైసీపీ గాలి, జగన్ పాదయాత్ర కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టీడీపీ సంక్షేమం, అభివృద్ధిని అజెండాగా పెట్టుకుంది. మిగిలిన అన్ని పార్టీల నుంచి ఈ నియోజకవర్గంలో ఎవరికివారే అన్నట్లు ప్రచారం జరుగతోంది. దీంతో పోటీ టఫ్‌ గానే ఉంది. అయితే టీడీపీ, వైసీపీల్లో ఈసారి ఎవరి జెండా ఎగురవేస్తారనే ఆసక్తి చర్చ సాగుతోంది.