Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: గుంటూర్ వెస్ట్ లో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   3 April 2019 6:55 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: గుంటూర్ వెస్ట్ లో గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం: గుంటూర్ పశ్చిమ
టీడీపీ: మద్దాలి గిరి
వైసీపీ: చంద్రగిరి ఏసురత్నం
జనసేన: తోట చంద్రశేఖర్‌
బీజేపీ: మాధవీలత

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి జిల్లా అయిన గుంటూరులో రాజకీయం వేడెక్కుతోంది. ఈ జిల్లాలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు పార్టీల నుంచి కీలక అభ్యర్థులు బరిలో ఉండడంతో పోటీ రసవత్తంగా ఉంది. రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ...ఇక్కడ ఆ పార్టీ నుంచి సినీ నటి మాధవీలత పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. నెల కిందట ఆయన వైసీపీలోకి చేరడంతో ఈ స్థానంలో టీడీపీ మరో అభ్యర్థి మద్దాలి గిరిని నిలిపింది. ఇక వైసీపీ నుంచి పోలీసుశాఖలో పనిచేసిన చంద్రగిరి రత్నం, జనసేన నుంచి తోట చంద్రశేఖర్‌ పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి హీరోయిన్ మాధవీలత పోటీపడుతున్నారు.

* గుంటూరు పశ్చిమం నియోజకవర్గం చరిత్ర:
ఓటర్లు : లక్షా 60 వేలు

* టీడీపీకి మోదుగుల షాక్‌.. వెంటనే మద్దాలి గిరికి టికెట్‌..
2014లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇటీవల వైసీపీలో చేరారు. గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో ఒకరకంగా షాక్‌ తిన్న బాబు ఆలస్యం చేయకుండా మద్దాలి గిరికి టికెట్‌ కేటాయించారు. గత ఎన్నికల్లో గంటూరు తూర్పు నుంచి మద్దాలి గిరి పోటీ చేసి ఓటమి చెందారు. ఆయినా ఆయన పార్టీకి విధేయుడిగా ఉండడంతో పశ్చిమ బరిలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా టీడీపీకి గాలి వీస్తుండడంతో గెలుపు ఖాయమేనంటున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతం కావడంతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కువే జరిగాయి. దీంతో మద్దాలి గిరికి ఈసారి టీడీపీ అభివృద్ధి, సంక్షేమంతో అదృష్టం వరిచేనో లేదో చూడాలి.

* అనుకూలతలు:
-అధికార టీడీపీ నుంచి నిలబడడంతో అనుకూలతలు
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు
-కేడర్‌ సపోర్టు

* ప్రతికూలతలు:
-నియోజకవర్గంలో కొత్తగా పోటీ చేయడం
-నగర శివార్ల టీడీపీ పట్టుకోల్పోవడం

* వైసీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం..
పోలీసు అధికారి పోస్టు చేసి ఆ తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రగిరికి ప్రజల్ని కలుపుకుపోయే మనస్తత్వం ఉందని అంటున్నారు. మరోవైపు గుంటూరు ఎంపీగా మోదుగుల పోటీ చేస్తుండడంతో ఆయన బలం చంద్రగిరి కొండంత అండగా ఉంది. ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది. బీసీల్లోని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆయనకు ఆ కులాల సపోర్టు బాగా ఉంది. ఇక జగన్‌ ఈమేజ్‌ ఎక్కువగా వస్తుండడంతో ఆయన అండదండలతో ప్రచారంలోకి దూసుకుపోతున్నారు.

* అనుకూలతలు:
-వైసీపీ బలపడడం
-మోదుగుల సపోర్టు ఎక్కువ
-సామాజిక ఓట్లు వచ్చే అవకాశం

* ప్రతికూలతలు:
-టీడీపీకి బలమైన నియోజకవర్గం
-కొత్తగా ఎన్నికల్లో పోటీ చేయడం

*చతుర్మఖ పోటీ..గెలుపెవరిది.
ఇక బీజేపీ నుంచి సినీ నటి మాధవీలత బరిలో ఉన్నారు. మోడీ చేపట్టిన పథకాలు, దేశంలో మోడీ హవాపై ప్రచారం చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. అయితే పార్టీకి కేడర్‌ లేకపోవడంతో కొంత నిరాశ కలిగిస్తోంది. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన తోట చంధ్రశేఖర్‌ గతంలో గుంటూరు ఎంపీగా ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జనసేన నుంచి పోటీపడుతున్నారు. ఆ సానుభూతితో పాటు నగరంలో కొంత సానుకూల ఓట్లు పడే అవకాశం ఉంది. మరోవైపు కాపు సామాజిక వర్గం ఆయనకు కలిసివచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా గుంటూరు పశ్చిమలో అధికార టీడీపీ బలంగా ఉండగా.. మోదుగుల బలంతో వైసీపీ సై అంటోంది. బీజేపీ, జనసేన బరిలో నిలవడంతో చతుర్ముఖ పోటీలో ఎవరు నెగ్గుతారనే ఆసక్తి నెలకొంది.