Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'జమ్మలమడుగు' విజేత ఎవరో..?

By:  Tupaki Desk   |   22 March 2019 5:35 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: జమ్మలమడుగు విజేత ఎవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: జమ్మలమడుగు
టీడీపీ:రామసుబ్బారెడ్డి
వైసీపీ: సుధీర్‌ రెడ్డి
జనసేన : పోటీపడలేదు..
--------------------------
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.. అదే ఫ్యాక్షన్ చరిత్ర. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా కడపలో ఈ నియోజకవర్గం ఉండడం విశేషం. ఫ్యాక్షన్‌ హత్యలతో దద్దరిల్లే ఈ ప్రాంతంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది.నియోజకవర్గంగా జమ్మల మడుగు ఏర్పడిన తరువాత కాంగ్రెస్‌ అధికారంలో రాగా టీడీపీ ఆవిర్భావం తరువాత దీనిని కంచుకోటగా మార్చుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఆయన టీడీపీలోకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి వెళ్లినా ఈసారి 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

కొన్ని రోజులుగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీడీపీలో అసంతృప్త జ్వాలలు చెలరేగాయి. పొన్నపు శివారెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు పొన్నపు రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి రాజకీయారంగేట్రం చేశారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డి గెలుపొందడంతో తన పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి చేరడంతో రామసుబ్బారెడ్డితో వివాదాలు మొదలయ్యాయి. ఒకదశలో ఆదినారాయణరెడ్డికి టికెట్‌ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని పొన్నపు రామసుబ్బారెడ్డి వర్గీయులు హెచ్చరించడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో కలగజేసుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి పొన్నపు శివారెడ్డికే జమ్మలమడుగు టికెట్‌ కేటాయించారు. అదినారాయణరెడ్డిని ఒప్పించారు.

* నియోజకవర్గ చరిత్ర:
1955లో జమ్మలమడుగు నియోజకవర్గం ఏర్పడింది.
ప్రస్తుత ఓటర్లు 2 లక్షలు.
మండలాలు: పెద్దముడియం, మైలవరం, కొండాపురం, జమ్మలమడుగు, ముద్దునూరు, ఎర్రగుంట్ల

జమ్మలమడుగులో ఆది నుంచి రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యం. ఎస్సీ,బీసీలతో పాటు కొన్ని మండలాల్లో చేనేత కార్మికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 13సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ నుంచి కుందా రామయ్య తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి ఆ పార్టీదే ఆధిపత్యం కొనసాగింది. గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. 1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన పొన్నపురెడ్డి శివారెడ్డి గెలుపొందారు. వరుసగా ఆయన మూడుసార్లు విజయం సాధించి టీడీపీకి తిరుగులేకుండా చేశారు. ఆయన మరణం తరువాత రామసుబ్బారెడ్డి రెండుసార్లు టీడీపీ నుంచే గెలుపొందడం విశేషం. అయితే మూడు పర్యాయాలుగా రామసుబ్బారెడ్డి ఓడుతూ వస్తున్నారు. ఈయనపై ఆదినారాయణరెడ్డి పైచేయి సాధిస్తున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఫ్యాక్షన్ యుద్ధంలా నియోజకవర్గంలో సాగుతోంది.

* సుధీర్‌ రెడ్డికి వైసీపీ అవకాశం..
గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున నిలబడి విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో ఈ నియోజకవర్గంలో మరో ప్రత్యామ్మాయ నేత సుధీర్‌ రెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ. ప్రస్తుతం సుధీర్‌ రెడ్డి పార్టీ ఇన్‌ చార్జిగా కొనసాగుతున్నారు. టికెట్‌ దక్కించుకున్న సుధీర్‌ రెడ్డి గ్రామగ్రామన తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

అనుకూలించే విషయాలు: నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం. జగన్‌పై ఉన్న ఇమేజ్‌ కలిసి వస్తుందన్న ఆశాభావం.
ప్రతికూలించే విషయాలు: తొలిసారి పోటీ చేస్తుండడం. ప్రత్యర్థి బలంగా ఉండడం.

*బలంగా రామసుబ్బారెడ్డి
గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడంతో టికెట్‌ ఎవరికి వస్తుందోనని సస్పెన్స్‌ కొనసాగింది. చివరికి టీడీపీలో ఆదినుంచి పనిచేసుకుంటూ వచ్చిన రామసుబ్బారెడ్డికే చంద్రబాబు టికెట్‌ కేటాయించారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో సీనియర్ నేత కావడం.. బలమైన కార్యకర్తలు, ప్రజాబలం ఉండడంతో తిరుగులేకుండా ఉన్నారు. ఇక రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య గత కొంతకాలంగా ఉన్న వైరాన్ని చంద్రబాబు సద్దుమణిగేలా చేశారు.

అనుకూలించే విషయాలు: రామసుబ్బారెడ్డికి ప్రధానంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండడం కలిసి వచ్చే అంశం.. ఎంతోకాలంగా వైరంగా ఉన్న ఆదినారాయణరెడ్డి సొంత టీడీపీ పార్టీలోనే ఉండడం. పార్టీ క్యాడర్‌ బలంగా ఉండడం అనకూలిస్తోంది.

ప్రతికూలించే విషయాలు: వరుసగా మూడుసార్లు ఓటమి పాలవ్వడం. రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డి వర్గం ఎంతవరకు సహకరిస్తాడనే అనుమానాలు.

*టీడీపీకే కాస్త మొగ్గు.. జగన్ గాలి వీస్తే కష్టమే..
ప్రస్తుతం జమ్మలమడుగు రాజకీయాలను గమనిస్తే వైసీపీతో పోల్చితే టీడీపీ బలంగా ఉంది. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలు ఒకే ఒరలో రెండు ఫ్యాక్షన్ కత్తులు లాగా ఇమిడిపోయి ఉన్నారు. అవి సహకరించుకుంటే విజయం.. లేదంటే తేడా కొట్టవచ్చు. ఇక వరుసగా ఓడిపోయిన రామసుబ్బారెడ్డిపై ప్రజల్లో సానుభూతి కలిసివస్తుంది. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులను తట్టుకొని వైసీపీ గాలిలో కొట్టుకువస్తే ఆశ్చర్యమే మరి.. జగన్ వైసీపీ వేవ్ పనిచేస్తే ఆయనే గెలుపు. కానీ చివరకు ఎవరూ గెలుస్తారనే విషయంలో టీడీపీకే కాస్త మొగ్గు కనిపిస్తోంది.