Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'కందుకూరు'లో రసవత్తరం..

By:  Tupaki Desk   |   2 April 2019 5:01 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: కందుకూరులో రసవత్తరం..
X
అసెంబ్లీ నియోజకవర్గం: కందుకూరు
టీడీపీ: పోతుల రామారావు
వైసీపీ: మానుగుంట మహీధరరెడ్డి

ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గాల్లో కందుకూరు ఒకటి. దశాబ్దాల పాటు ఇక్కడ పార్టీలు కాకుండా రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోరు సాగుతోంది. దివి, మానుగుంట కుటుంబ సభ్యులే అత్యధికంగా గెలిచిన సందర్భాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన పోతుల రామారావు ఆ తరువాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ నుంచే బరిలో ఉన్నారు. అటు వైసీపీ నుంచి మానుగుంట మహీధరరెడ్డి పోటీచేస్తున్నారు. జనసేన నుంచి పులి మల్లిఖార్జున్‌ బరిలో ఉన్నారు.

* కందుకూరు నియోజకవర్గం చరిత్ర
మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గూడ్లూరు, ఉలవపాడు
ఓటర్లు:లక్షా 90వేలు

ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్‌ గెలుపొందింది. టీడీపీ రెండుసార్లు గెలవగా స్వతంత్రులు గెలిచారు. మరోసారి వైసీపీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి తొలి ఎమ్మెల్యేగా దివిగొండ కొండయ్య చౌదరి ఎన్నికయ్యారు. గత 2014 ఎన్నికల్లో పోతుల రామారావు వైసీపీ తరుపున విజయం ఆధించారు. అయితే సిట్టింగ్‌ స్థానం అని భావిస్తున్న వైసీపీ మరోసారి జెండా ఎగురవేయాలని చూస్తోంది.

* పోతుల రామారావు మరోసారి బరిలోకి..
పోతుల రామారావు కాంగ్రెస్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కొండేపిలో రెండు సార్లు పోటీ చేసి ఒకసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరుపున కందుకూరులో విజయం సాధించారు. ఈసారి టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టికెట్‌ ఆశించిన దివి శివరాంకు సీటు దక్కలేదు. దీంతో ఆయన పోతులకు సహకరిస్తాడా..? లేదా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

* అనుకూలతలు:
-సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడం
-నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం
-కార్యకర్తలు అండగా ఉండడం

*ప్రతికూలతలు:
-నాన్‌ లోకల్‌ అభ్యర్థి కావడం
-సంక్షేమ పథకాలు ఆనుకూలంగా ఉన్నవారికే అందించారని ఆరోపణ

*వైసీపీ నుంచి మానుగుంట మహీధర్‌ రెడ్డి..
తమ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన పోతుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తోంది వైసీపీ. దీంతో కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రిని మానుగుంట మహీధర్‌ రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని టికెట్‌ కేటాయించింది. ఈ నియోజకవర్గంలో మానుగుంటకు మంచి పట్టు ఉంది. మరోవైపు వైసీపీకి అనుకూలంగా నియోజకవర్గం ఉండడంతో ఈసారి గెలుపు తనదేనన్నట్లు ప్రచారం చేస్తున్నారు.

*అనుకూలతలు:
-రాజకీయ కుటుంబ నేపథ్యం
-పార్టీ బలంగా ఉండడం
-మాజీ మంత్రిగా చేసిన అనుభవం

*ప్రతికూలతలు:
-సామాజిక ఓట్లు దూరమవడం
-దివి కుటుంబం ప్రత్యర్థి పార్టీలో ఉండడం

* టఫ్ ఫైట్ లో గెలిచేదెవరు.
ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతున్న రామారావు, మహీధర్‌ రెడ్డిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని మానుగుంట, మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ జెండా ఎగురవేస్తానని పోతుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉండడంతోపాటు జగన్ గాలి కలిసివచ్చే అవకాశాలున్నాయి. ఇక జనసేన నుంచి పులి మల్లిఖార్జున్‌ బరిలో ఉన్నారు. కాపు సామాజిక ఓట్లు ఎక్కువే ఉన్నందున ఆయన ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్ గా మారింది.