Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: ప్రత్తిపాడు పోరు ఆసక్తికరం..

By:  Tupaki Desk   |   31 March 2019 4:36 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: ప్రత్తిపాడు పోరు ఆసక్తికరం..
X
అసెంబ్లీ నియోజకవర్గం: ప్రత్తిపాడు
టీడీపీ: వరుపుల జోగి రాజు
వైసీపీ: పర్వత పూర్ణచంద్రప్రసాద్‌
జనసేన: వరుపుల తమ్మయ్య

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో సార్వత్రిక పోరు ఆసక్తిగా మారింది. ఈ నియోజకవర్గ ప్రజలు మూడు కుటుంబాల వారికే పదవులు కట్టబెడుతున్నారు. అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబీకులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, నాలుగుసార్లు పర్వత కుటుంబీకులు, మూడుసార్లు వరుపుల కుటుంబానికి చెందిన వారే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి గెలిచిన పరుపుల సుబ్బారావు గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ నుంచి పరుపుల జోగిరాజు, వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, జనసేన నుంచి పరుపుల తమ్మయ్యబాబు బరిలో ఉన్నారు.

* ప్రత్తిపాడు చరిత్ర
మండలాలు:శంకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి
ఓటర్లు: లక్షా 93 వేలు

1952 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గం భద్రాచలం శాసనసభ నియోజకవర్గం ఆధీనంలో ఉండేది. 1958లో ప్రత్తిపాడు కేంద్రంగా నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ నియోజకవర్గంలో పార్టీలకు కాకుండా అభ్యర్థులను చూసే ఓట్లేస్తారు. అయితే ఇప్పటి వరకు టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్‌ నాలుగుసార్లు జెండా ఎగరువేసింది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ దక్కించుకుంది. ఈ నియోజకవర్గానికి ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది. నియోజకవర్గవ్యాప్తంగా బీసీ ఓటర్లు ఎక్కువ. ఆ తరువాత కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు కూడా అభ్యర్థి గెలుపునకు కీలకంగా మారుతాయి.

* వరుపుల జోగిరాజు టీడీపీ జెండా ఎగురవేస్తారా..?
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన వరుపుల సుబ్బారావు ఆ తరువాత టీడీపీలోకి చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ కేటాయించలేదు. ఆయన మనువడు వరుపుల జోగిరాజుకు టీడీపీ అధిష్టానం సీటు కేటాయించింది. జిల్ల కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడిగా ఆకట్టుకున్నారు. ఇలా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్‌ కేటాయించింది. ఈసారి గెలుపే లక్ష్యంగా ఆయనకు ముందుకెళ్తున్నారు. అధికార అండదండలు, ఫ్యామిలీ సపోర్ట్, ప్రజల్లో ఫేమ్ నే నమ్ముకున్నారు.

*అనుకూలతలు:
-నియోజవకర్గంలో మంచిపేరు
-యువత ఫాలోయింగ్‌
-ప్రజలతో సత్సంబంధాలు

ప్రతికూలతలు:
-మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం
-టీడీపీలో తాత నుంచే అసమ్మతి

* పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ మరోసారి వైసీపీని గట్టేక్కిస్తారా..?
ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలురుసార్లు పర్వత కుటుంబసభ్యులే గెలిచారు. దీంతో వైసీపీ ఆ కుటుంబానికి చెందిన పర్వత పూర్ణచంద్రప్రసాద్‌కు టికెట్‌ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు పార్టీ మొదటి జాబితాలోనే అభ్యర్థిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. మరోవైపు కొంతకాలంగా పర్వత కుటుంబ సభ్యుల్లో విభేదాలున్నాయి. కానీ ఇటీవల పర్వత కుటుంబ సభ్యులంతా ఒక్కటయ్యారు. దీంతో తన గెలుపు ఖాయమని పూర్ణచంద్రప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ గాలి, జగన్ వేవ్ కలిసివస్తుందని ఆశిస్తున్నారు. ప్రధానంగా టీడీపీపై వ్యతిరేకతనే ఆయన నమ్ముకున్నారు.

*అనుకూలతలు:
-టీడీపీలో ఉన్న వ్యతిరేకత
-పర్వత కుటుంబ సభ్యులంతా ఒక్కటి కావడం
-గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం

*ప్రతికూలతలు:
-పార్టీలో కొంత అసమ్మతి
-టీడీపీ బలపడడం

*జనసేన కీలకం..
జనసేన తరుఫున ప్రత్తిపాడులో వరుపుల తమ్మయ్య పోటీచేస్తున్నారు. విశేషంగా ఉన్న కాపు ఓట్లను ఈయన చీల్చే అవకాశాలున్నాయి. దీన్ని బట్టే వైసీపీ, టీడీపీ గెలుపు ఆధారపడి ఉంది.

*కాపు ఓట్లే కీలకం..జనసేన ప్రభావం చూపేనా?
ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక ఓట్లుకూడా ప్రభావం చూపనున్న నేపథ్యంలో జనసేన పార్టీ నుంచి వరుపుల తమ్మయ్య బరిలో నిలుచున్నారు. దీంతో టీడీపీ అభ్యర్తికి కొంచెం మైనస్‌ గా మారనుంది. కానీ ఇక్కడ పార్టీల పరంగా కాకుండా కుటుంబ సభ్యుల మధ్యే పోరు నడుస్తుండడంతో క్యాండెట్‌ ను బట్టి గెలుపుంటుందని విశ్లేషకులు అంటున్నారు. కాపు ఓట్లు జనసేన అభ్యర్థి ఎన్ని చీలుస్తాడనేదానిపైనే టీడీపీ, వైసీపీ గెలుపు ఆధారపడి ఉంది.